calender_icon.png 9 January, 2025 | 3:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓఆర్‌ఆర్ లీజు అక్రమాలపై కేటీఆర్‌పై ఫిర్యాదు

09-01-2025 01:15:36 AM

  1. ఏసీబీకి ఫిర్యాదు చేసిన బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్
  2. ఎలక్ట్రోరల్ బాండ్లు సహా అవినీతితో పాటు ఫార్ములా ఈ-రేస్, కైటెక్స్‌పైనా ఫిర్యాదు

హైదరాబాద్, జనవరి 8 (విజయక్రాంతి): ఫార్ములా ఈ- రేస్ వ్యవహారం లో అటు ఏసీబీ ఇటు ఈడీ కేసులతో సతమతమవుతున్న మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఓఆర్‌ఆర్ టోల్ లీజు కేసు శరాఘాతం లా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు బుధ వారం నాడు ఏసీబీ అధికారులకు కేటీఆర్‌పై ఫిర్యాదు అందింది.

బీసీ రాజకీయ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ హైదరాబాద్ లోని ఏసీ బీ డీజీ కార్యాలయంలో ఫిర్యాదు చేశా రు. ఓఆర్‌ఆర్ టోల్ లీజ్ వ్యవహారంలో ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా సంస్థ, గత ప్రభుత్వ పెద్దలకు మధ్య ‘క్విడ్ అండ్ ప్రో కో’ నడిచిందని, దీనివెనుక నాటి సీఎం కేసీఆర్, నాటి మాజీ మంత్రి కేటీఆర్ హస్తం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అంతేగాక ‘ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా సంస్థకు 30 ఏళ్లకు ఓఆర్‌ఆర్ టోల్ లీజ్‌లోనూ పెద్దఎత్తున అవినీతి జరిగింది.ఎలక్ట్రోరల్ బాండ్ల ద్వారా కేటీఆర్ రూ.కోట్లు గోల్‌మాల్ చేశారు. 2023 ఏప్రిల్ 27న ఐఆర్బీ ఇన్‌ఫ్రా సంస్థకు ఓఆర్‌ఆర్ టోల్  రోడ్డును 30 ఏళ్లకు బీఆర్‌ఎస్ సర్కార్ లీజుకు ఇచ్చింది. ఇదే ఏడాది జూలై 4న ఐఆర్బీ సంస్థ రూ.25 కోట్ల ఎలక్ట్రోరల్ బాండ్ కొనుగోలు చేసి బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఇచ్చింది.

జూలై 13న బాండ్‌ను నగదుగా మార్చుకుంది. వరంగల్, రంగారెడ్డి కైటెక్స్ గార్మెంట్స్ యూనిట్స్ వ్యవహారంలోనూ క్విడ్ అండ్ ప్రో కో జరిగింది. 2023 జూన్ 16న వరంగల్ కైటెక్స్ రూ.15 కోట్ల ఎలక్ట్రోరల్ బాండ్లు కొనుగోలు చేయగా జూలై 17న బాండ్ నగదుగా మారింది. సెప్టెంబర్‌లో రంగారెడ్డి జిల్లా కైటెక్స్ 2వ యూనిట్ పరిధిలో రూ.10 కోట్ల బాండ్ కొనుగోలు జరిగింది.

అక్టోబర్ 16న బీఆర్‌ఎస్ పెద్దలు ఎన్‌క్యాష్ చేసుకున్నారు’ అని యుగంధర్ గౌడ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇవే అంశాలపై గతంలో సీఎం రేవంత్‌రెడ్డి, ప్రభుత్వ సీఎస్, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఈడీకి ఫిర్యాదు చేశామని, తాజాగా ఏసీబీకి సైతం ఫిర్యాదు చేశామని స్పష్టం చేశారు. క్యాబినెట్ తీర్మానం, ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా అప్పటి ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకు సైతం తెలియకుండా అవినీతి జరిగిందని వెల్లడించారు.

ఐఆర్బీ సంస్థకు  ఔటర్ రింగ్ రోడ్డు బాధ్యతలు మాత్రమే అప్పగించిన బీఆర్‌ఎస్ సర్కార్.. అధికంగా ఖర్చయ్యే సర్వీసు రోడ్డు, గ్రీనరీ బాధ్యతలను మాత్రం ప్రభుత్వ సంస్థ అయిన హెచ్‌ఎండీఏ నెత్తిన మోపిందని ఆరోపించారు. హెచ్‌ఎండీఏ నిధులు, ఎలక్ట్రోరల్ బాండ్ల లావాదేవీలు, ఐఆర్బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్లు, కైటెక్స్ గార్మెంట్స్‌కు ఇచ్చిన కాంట్రాక్టులపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని ఏసీబీని కోరుతున్నామని వెల్లడించారు.

అసలేంటి ఓఆర్‌ఆర్ టోల్ లీజు వ్యవహారం..

ఓఆర్‌ఆర్‌పై టోల్ వసూలుతో నెలకు రూ.40 కోట్ల ఆదాయం వస్తున్నదని గతంలో ఓ ప్రైవేటు సంస్థ బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అయితే ఔటర్‌ను లీజుకు తీసుకున్న ఐఆర్బీ ఇన్‌ఫ్రా సంస్థకు మాత్రం లీజు అనంతరం నెలకు రూ.60 కోట్లకు పైనే ఆదాయం వస్తున్నదని హెచ్‌ఎండీఏ వర్గాలు తెలిపాయి. ఈ వ్యవహారం హెచ్‌ఎండీఏ పరిధిలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

లీజుకు ముందు రూ.40 కోట్ల ఆదాయం ఉన్న టోల్.. లీజు తర్వాత ఒక్కసారిగా రూ. 20 కోట్లు ఎలా పెరిగిందనే ప్రశ్న మొదలైంది. అయితే ఓఆర్‌ఆర్ టోల్‌పై సర్వే చేసిన ప్రైవేటు సంస్థ ఆదాయాన్ని కావాలనే తక్కువ చేసి చూపారనే ఆరోపణలు ఉన్నాయి. అంటే లీజుకు ముందు సైతం నెలకు రూ. 20 కోట్ల మిగులు ఆదాయం వచ్చిందని, ఆ సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్లిందనే ప్రశ్న తలెత్తింది.

మరోవైపు ఐఆర్బీ ఇన్‌ఫ్రాకు 30 ఏళ్లకు కేవలం రూ.7,380 కోట్లకు మాత్రమే లీజుకు ఇవ్వడంపైనా అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. ఐఆర్బీ నెలకు రూ. 60 కోట్లకు పైగా టోల్ వసూలు చేస్తున్నదంటే ఏడాదికి రూ.720 కోట్లు, అలా 30 ఏళ్లకు రూ.21,600 కోట్లు ఆదాయం వస్తుందనేది సుస్పష్టం. కానీ ప్రస్తుతం ఏటా వాహనాల సంఖ్య పెరుగుతూనే ఉంది. టోల్ ఫీజు కూడా పెరుగుతుంది.

అలా 30 ఏళ్లలో టోల్ రూపంలో సుమారు రూ.50 వేల కోట్లకు పైగానే టోల్ వసూలు ఉంటుందని అంచనా. కానీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రం కేవలం రూ.7,380 కోట్లకు గంప గుత్తగా ఐఆర్బీ సంస్థకు ఓఆర్‌ఆర్‌ను అప్పగించడం, అలాగే ఓఆర్‌ఆర్ సర్వీసు రోడ్డు నిర్వహణ, గ్రీనరీతో సంస్థకు సంబంధం లేకపోవడం విమర్శలకు దారి తీస్తున్నది.

నిర్వహణ బాధ్యతలను పైసా ఆదాయం పొందని హెచ్‌ఎండీఏకు అప్పగించడంపై తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై టోల్ లీజు ప్రక్రియ జరిగిన నాటి నుంచే ప్రతిపక్షాలు విమర్శలు మొదలు పెట్టాయి.

ఇప్పుడు ప్రభుత్వం మారిన తరుణంలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ వ్యవహారంపై సీరియస్‌గా దృష్టి సారించారని తెలుస్తోంది. అంటే మాజీ మంత్రి కేటీఆర్ మెడకు మరో ఉచ్చు సిద్ధమవుతున్నట్లుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఔటర్ టోల్ గోల్‌మాల్

* నెలకు రూ.60 కోట్ల ఆదాయం వచ్చే వనరు ఓఆర్‌ఆర్ 

* 30 ఏళ్లకు కేవలం రూ.7,380 కోట్లకే అప్పగింతపై అభ్యంతరం

* ఫలితంగా భారీగా సర్కారు ఆదాయానికి గండి పడిందని ఆరోపణ

* లీజుపై ఇప్పటికే సిట్ విచారణకు ఆదేశించిన సీఎం రేవంత్‌రెడ్డి

* తాజాగా ఏసీబీకి అందిన ఫిర్యాదుతో కేటీఆర్‌పై మరో కేసుకు అవకాశం

* “చాలా రోజుల నుంచి ఓఆర్‌ఆర్‌పై చర్చ జరుగుతోంది. ఎన్నికల కంటే ముందు హడావిడిగా సరైన విధి విధానాలు పాటించకుండా టెండర్ నిబంధనలను అతిక్రమించి గత ప్రభుత్వం

* కొందరికి ఆయాచితంగా లబ్ధి చేకూర్చేందుకు ఔటర్ రింగ్ రోడ్డు లీజును అప్పగించింది. లీజుపై విచారణ జరపాలని మాజీ మంత్రి హరీశ్‌రావు కోరడం అభినందనీయం. ప్రధాన ప్రతిపక్షం కోరిక మేరకు ఓఆర్‌ఆర్ లీజుకు సంబంధించి ఈ సభ సభ్యులందరి ఆమోదంతో విచారణకు ఆదేశిస్తున్నా” 

19 డిసెంబర్ 2024 అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, జనవరి 8 (విజయక్రాంతి): ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) టోల్ టెండర్లలో భారీగా అక్రమాలు జరిగాయంటూ కొంత కాలం నుంచి ఆరోపణలు వెల్లువెతుతున్నాయి. ఈ క్రమంలో ఇదే అంశంపై తాజాగా ఏసీబీకి ఫిర్యాదు అందింది. దీంతో కేసు విచారణ సైతం ఊపందుకుంటుందనే చర్చ జరుగుతోంది.

గతేడాది అసెంబ్లీ సెషన్స్ సందర్భంగా ఓఆర్‌ఆర్ టోల్ లీజుపై పెద్దఎత్తున చర్చ జరిగింది. సమావేశాల్లో నాడు బీఆర్‌ఎస్ సభ్యులు అవసరమైతే టోల్ లీజును రద్దు చేయాలంటూ ప్రభుత్వానికి సూచించారు. ఈ వ్యవహారాన్ని కేవలం లీజు రద్దుతోనే సరిపుచ్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి అంగీకరించలేదు.

అక్రమాల నిగ్గు తేల్చేందుకుసిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారం బయటకు వచ్చింది. అనంతరం టోల్ లీజు విషయం కొంతకాలం మరుగున పడింది. తాజాగా బీసీ పొలిటికల్ జేఏసీచైర్మన్ యుగంధర్ ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం మరోసారి వార్తల్లో నిలిచింది.