calender_icon.png 3 October, 2024 | 2:50 PM

కేటీఆర్‌పై ఫిర్యాదు

03-10-2024 01:02:36 AM

ఎల్బీనగర్, అక్టోబర్ 2: కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు సీఎం రేవంత్‌రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేసిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని టీపీసీసీ మీడియా, కమ్యూనికే షన్ చైర్మన్ సామ రామ్మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

అనంతరం రామ్మోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మూసీ ప్రక్షా ళనకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1.50 లక్షల కోట్లు కేటాయించడంలో కుంభకోణం ఉందని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కేటీఆర్ ఆరోపణలు మాని ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. మంత్రిగా పనిచేసిన కేటీఆర్‌కు ప్రభుత్వ నిధులు ఎలా కేటాయి స్తారో తెలియదా అని ప్రశ్నించారు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా మూసీ ప్రాజెక్ట్ పేరుతో కోట్లాది నిధులు కేటాయించిందని.. వారు కూడా దోచుకోవడానికే నిధులు కేటాయించారా అని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం మూసీ పేరిట చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణ లు చేస్తున్నారని అన్నారు.