calender_icon.png 23 October, 2024 | 5:48 PM

ప్రజలను మోసం చేశారని సీఎంపై ఫిర్యాదు

23-10-2024 01:26:12 AM

  1. ప్రభుత వైఫల్యాలపై 24న భారీ సభ 
  2. మాజీ మంత్రి రామన్న

ఆదిలాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): బూటకపు హామీలతో ప్రజలను, రైతులను మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై చీటింగ్ కేసులు నమోదు చేయాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న డిమాండ్ చేశారు. మంగళవారం ఎస్పీ గౌష్ ఆలం ను పార్టీ శ్రేణులతో కలిసి సీఎంపై ఫిర్యాదు చేశారు.

అంతకుముందు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామన్న మాట్లాడుతూ.. ఉట్నూర్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసులు నమోదు చేయగా, అంతకుముందే తనను మోసగించిన సీఎంపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసినా.. ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. 

రైతాంగం ఎదుర్కుంటున్న సమస్యలపై బీఆర్‌ఎస్ రైతు ఐక్య వేదికను ఏర్పాటు చేసి, ఉద్యమబాట పట్టిందని తెలిపారు. పార్టీ జెండా లేకుండా పార్టీలకు అతీతంగా ఈ నెల 24న రాంలీలా మైదానంలో ప్రభుత వైఫల్యాలపై కేటీఆర్ శంఖారావం పూరించనున్నారని, ఈ బహిరంగ సభకు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలనీ పిలుపునిచ్చారు.