calender_icon.png 23 February, 2025 | 4:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్టభద్రులు ఎటువైపు..?

18-02-2025 12:58:13 AM


  1. పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ  స్థానాల కోసం పోటాపోటీ ప్రచారం..

సంగారెడ్డి, ఫిబ్రవరి 17 (విజయ క్రాంతి): పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ స్థానాల కోసం పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో బిజెపి, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు వారి మద్దతుదారుల కోసం ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికలకు  దూరంగా ఉంది. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ స్థానాల కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 27న పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. మార్చ్ 3న ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ఏర్పాట్లు చేపడుతున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కోసం 56 మంది పోటీలో ఉండగా, టీచర్ ఎమ్మెల్సీ స్థానం కోసం 15 మంది పోటీలో ఉన్నారు. ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నారు.

పట్టభద్రుల స్థానం కోసం ..

పట్టభద్రుల స్థానం కోసం బిజెపి తరఫున అంజిరెడ్డి, కాంగ్రెస్ తరపున నరేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు. వీరితోపాటు పలు పార్టీలకు చెందిన వారు పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. 56 మంది పట్టభద్రుల స్థానం నుంచి పోటీలో ఉన్నారు. ఎవరికి వారు పట్టభద్రుల ఓట్ల కోసం ప్రయత్నం చేస్తున్నారు. పట్టభద్రుల ఓటర్లకు ఫోన్లు ద్వారా, వాట్సాప్ మెసేజ్ ల ద్వారా తమకు ఓటు వేయాలని కోరుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారు ఎక్కువగా సోషల్ మీడియాలో ప్రచారం నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా తమకు ఓటు వేయాలని, మీ  సమస్యలు పరిష్కరిస్తామని వేడుకుంటున్నారు. విద్యావంతుల తీర్పు కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పట్టభద్రుల ఎన్నికలు ఆసక్తిగా మారాయి. పట్టభద్రులు ఎటువైపు ఆసక్తి చూపుతారనేది చర్చ జరుగుతుంది. పట్టభద్రుల స్థానంలో ఎక్కువమంది స్వాతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ పదవి కాలం మార్చి 29 తో ముగుస్తుంది. 

విజయం కోసం తీవ్ర పోటీ..

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయం కోసం పలు సంఘాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ నుంచి మల్క కొమరయ్య, బీఎస్పీ నుంచి యాటకారి సాయన్న, దళిత బహుజన పార్టీ నుంచి గవ్వల లక్ష్మి, ప్రస్తుత ఎమ్మెల్సీ కూర రఘు ఉత్తమ్ రెడ్డి, వై అశోక్ కుమార్, తో పాటు పలువురు పోటీ చేస్తున్నారు. 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. గెలుపు కోసం ఎవరికి వారు ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాన పట్టణాలలో ఉపాధ్యాయులతో సమావేశాలు ఏర్పాటు చేసి తమకు ఓట్లు వేయాలని వేడుకుంటున్నారు. మరి కొందరు నేరుగా పాఠశాలలకు వెళ్లి మీ సమస్యలు పరిష్కరిస్తామని, తమకు ఎన్నికల్లో ఓటు వేసి ఆశీర్వదించాలని కోరుతున్నారు. అభ్యర్థులకు మద్దతుగా కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలకు చెందిన నాయకులు ప్రచారం నిర్వహిస్తున్నారు.