06-03-2025 01:11:49 AM
చర్ల, మార్చి 5 (విజయ క్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లో యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే స్నేహపూర్త క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు భద్రాచలం ఏఎస్‌పి ఆపరేషన్ సంతోష్ పంకజ్ అన్నారు. ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే యువత ప్రతిభను బయటకు తీసుకొచ్చేందుకు చర్ల పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం క్రీడలను ప్రారంభించారు.,
ఈ పోటీలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. చర్ల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయనతో పాటు భద్రాచలం ఏ ఎస్ పి విక్రాంత్ కుమార్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు 49 గ్రామాల క్రీడాకారుల జట్లు నమోదు చేసుకున్నారు.ఇందులో జిల్లాకు సరిహద్దులో ఉన్న చత్తీస్గడ్ రాష్ట్ర గ్రామాలలో క్రీడాకారులను కూడా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే యువత చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని అన్నారు.యువత చాలా మంది రక రకాల కారణాలతో చదువును మధ్యలోనే ఆపేసి పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నారని అన్నారు.చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తూ తమ ప్రాంతానికి మంచి పేరు తీసుకొచ్చి ప్రత్యేక గుర్తింపు సాధించాలని సూచించారు.
క్రీడాకారులందరూ క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని,గెలుపోటములు సహజమని అన్నారు.ఏజెన్సీ ప్రాంతంలో పుట్టి పెరిగి ఇటీవల మహిళల క్రికెట్లో తనదైన శైలిలో ప్రతిభను కనబరిచి టీమ్ ఇండియా వరల్ కప్ సాధించేలా కృషి చేసిన గొంగిడి త్రిష ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే యువత వారి ప్రతిభను చాటుకునేందుకుకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సారధ్యంలో ఇలాంటి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు.
విద్య,వైద్యం మరియు రవాణా వంటి సౌకర్యాలను కల్పించేందుకు ఏజెన్సీ ప్రాంత ప్రజల కోసం జిల్లా పోలీసు శాఖ ఎంతగానో కృషి చేస్తుందని అన్నారు. మొదటి రోజు జరిగిన వాలీబాల్ పోటీలకు పలు ప్రాంతాల నుంచి అనేకమంది ఆటగాళ్లు మరియు వీక్షకులు పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో సందడి చేశారు.