calender_icon.png 6 March, 2025 | 1:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌లో పోటాపోటీ

06-03-2025 01:17:38 AM

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కసరత్తు

  1. రేపోమాపో అభ్యర్థులను ప్రకటించే అవకాశం 
  2. సామాజిక అంశాలు పరిగణలోకి..  
  3. ఓసీ నుంచి సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, జెట్టి కుసుమకుమార్ పేర్లు పరిశీలన 
  4. ఎస్సీ నుంచి సంపత్ లేదా అద్దంకి దయాకర్ 
  5. బీసీ నుంచి పోటీపడుతున్న కొనగాల మహేశ్

హైదరాబాద్, మార్చి ౫ (విజయక్రాంతి): ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై అధికార కాంగ్రెస్ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది. రెండు, మూడురోజుల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయిన విషయం తెలిసిందే. నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలైంది.ఈ నెల 10వ తేదీకి నామినేషన్ల గడువు ముగుస్తుంది.

ఖాళీ అయిన స్థానాల్లో అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి కాంగ్రెస్ పార్టీకి నాలుగు సీట్లు, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌కు ఒక ఎమ్మె ల్సీ దక్కనుంది. అయితే ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు తమకు ఒక సీటు కేటాయించాలని కాంగ్రెస్‌ను మిత్రపక్షమైన సీపీఐ కోరుతున్నది. మరొక సీటు తమకు కావాలని ఎంఐఎం కూడా అడుగుతోంది.

ఎమ్మెల్సీ ఎంపికలో సామాజిక న్యాయం పాటించాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఓసీ నుంచి ముఖ్యమంత్రి సలహాదారు, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి, పీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్, సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వేం నరేందర్‌రెడ్డి మొదటి నుంచి సీఎం రేవంత్‌రెడ్డితో ఉంటున్నారు.

ఇక జెట్టి కుసుమ్‌కుమార్ కూడా రేవంత్‌రెడ్డితో కలిసి చదువుకున్నారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అద్దంకి దయాకర్‌కు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు.

సంపత్‌కుమార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ టికెట్ అడిగినప్పటికీ.. మల్లు రవికి టికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణలో 32 లక్షల పైగా జనాభా కలిగిన మాదిగలకు అవకాశం ఇవ్వాలని ఆ వర్గం నుంచి పెద్దఎత్తున డిమాండ్ వినిపిస్తోంది.

గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎంఐఎంకు ఒక సీటు కేటాయిస్తే పార్టీ నుంచి మైనార్టీలకు చాన్స్ ఉండదని చెబుతున్నారు. గిరిజన సామాజిక వర్గం నుంచి ఖమ్మం జిల్లాకు చెందిన విజయ్‌పేరు వినిపిస్తోంది. ఆదివాసీలు మాత్రం మాజీ ఎమ్మెల్యే పొడెం వీరయ్యకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. 

బీసీల నుంచి ఒత్తిడి

జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలనే ఒత్తిడి పెరుగుతోంది. ఎమ్మె ల్సీ టికెట్ కోసం మున్నూరుకాపు సామాజికవర్గం నుంచి పీసీసీ అధికార ప్రతినిధి కొనగాల మహేశ్, యాదవ సామాజిక వర్గం నుంచి చరణ్‌కౌశిక్ యా దవ్,  పద్మశాలీ సామాజికవర్గం నుంచి సంగిశెట్టి జగదీశ్ తదితరులు ఎమ్మెల్సీ టికెట్‌ను ఆశిస్తున్నారు.

అయితే యాదవ సామాజిక వర్గానికి రాజ్యసభ ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్‌కు అవకాశం ఇచ్చిన విషయాన్ని పార్టీనేతలు గుర్తుచేస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ టికెట్‌ను ఆశించిన యువ నాయకుడు కొనగాల మహేశ్ గట్టిగా ప్రయత్నం చేసుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ము న్నూరుకాపు సామాజిక వర్గానికి అవకాశం రాలేదని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అకామిడేట్ చేయాలని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లుతున్నారు.