calender_icon.png 20 November, 2024 | 4:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయ పాలక మండళ్లకు పోటీ

20-11-2024 01:12:57 AM

  1. పదవుల కోసం ఆశావహుల ప్రయత్నాలు
  2. మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు 
  3. ఖమ్మం జిల్లాలో 13 ప్రధాన ఆలయాలు 

ఖమ్మం, నవంబర్ 19 (విజయక్రాంతి): ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని దేవాలయాల పాలక మండళ్లకు నూతన పాలకవర్గాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆశావహుల మధ్య తీవ్ర పోటీ పెరుగుతోంది. ఆలయాల్లో ఖాళీగా ఉన్న చైర్మన్, సభ్యుల నియామకాలకు ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.

దీంతో ఆశావహులు పోటీ పడి దరఖాస్తు చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 13 ప్రధాన ఆలయాల పాలకవర్గాలపై ఆశావహులు ఆశలు పెట్టుకున్నారు. ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నప్పటికీ పాలక మండళ్ల చైర్మన్, సభ్యుల నియమాకాలన్నీ అధికార పార్టీకి చెందిన వారినే నియమించడం ఆనవాయితీగా వస్తున్నది. 

ప్రధాన ఆలయాలు ఇవే..

భద్రాచలం దేవస్థానంతో పాటు ఎర్రుపాలెం వేంకటేశ్వర స్వామి, ఖమ్మంలోని స్తంభాద్రి లక్ష్మీనర్సింహాస్వామి, కమాన్‌బజార్‌లోని వేంకటేశ్వర స్వామి, ఖమ్మం రూరల్ మండలంలోని మారెమ్మగుడి, తీర్థా సంఘమేశ్వర స్వామి, వేంసూరు మండలం కందుకూరు వేంకటేశ్వర స్వామి, అన్నపురెడ్డిపల్లిలోని బాలాజీ, పెనుబల్లి మండలంలోని నీలాద్రి, పాల్వంచ పెద్దమ్మగుడి, కొత్తగూడెంలోని విజయ విఘ్నేశ్వర స్వామి ఆలయాలకు నూతన పాలక మండళ్లు ఏర్పాటు చేయాల్సి ఉంది.

వీటిల్లో చైర్మన్, సభ్యుల పదువులకు పెద్ద పోటీ నెలకొన్నది. ఈ నెల 13న నోటిఫికేషన్ రావడంతో ఇప్పటికే చాలా మంది దరఖాస్తులు సమర్పించారు. ముఖ్యంగా భద్రాచలం రామాలయం, పాల్వంచ పెద్దమ్మగుడి, ఎర్రుపాలెం వేంకటేశ్వర స్వామి ఆలయాలకు పోటీ తీవ్రంగా ఉన్నది. పదవుల కోసం ఆశావహులు మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చూస్తున్నారు. 

పోటీకి నిబంధనలు ఇవే 

ఆలయ పాలక మండళ్లలోని పదవులకు పోటీ చేయాలంటే కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. కోర్టుల్లో దివాలా పిటిషన్లు దాఖలు చేసిన వారు, భగవంతుడిపై నమ్మకం లేని వారు ఈ పోస్టులకు అనర్హులు. దివ్యాంగులు, వివిధ రకాల అంటువ్యాధులతో ఇబ్బందిపడుతున్న వారు, క్రిమినల్ కేసులున్న వారు, హిందూ మతాన్ని వ్యతిరేకించే వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులు. 

భద్రాచలంలో తీవ్ర పోటీ

భద్రాద్రి రామాలయం వార్షిక ఆదాయం దాదాపు రూ.80 కోట్ల దాకా ఉండటంతో పాటు విలువైన భూములు సైతం ఉన్నాయి. దీంతో ఈ ఆలయ చైర్మన్, పాలక మండలి సభ్యుల పదవులకు ఎక్కువ పోటీ నెలకొన్నది. వీటి కోసం పైరవీల జోరు సాగుతున్నది. స్థానిక ఎమ్మెల్యేల ద్వారా జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల చుట్టూ ఆశావహులు తిరుగుతున్నారు. భద్రాద్రి ఆలయ చైర్మన్ కోసం మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, బాలసాని లక్ష్మీనారాయణ పోటీ పడుతున్నారు.