రాష్ట్రం నుంచి 36,893 కోట్ల ఫార్మా ఎగుమతులు
మహిళల కోసం 119 పారిశ్రామిక వాడలు
ఈజిప్టు వాణిజ్య దౌత్యవేత్తలతో మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, ఆగస్టు 26 (విజయ క్రాంతి): ఔషధ ఎగుమతుల్లో తెలంగాణ రాష్ట్రం ప్రపంచంలోని అనేక దేశాలతో పోటీ పడే స్థాయిలో దూసుకుపోతోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నా రు. రాష్ట్రం మొత్తం ఎగుమతులు రూ. 1,16,182 కోట్లు కాగా, ఇందులో రూ. 36,893 కోట్లు ఫార్మా ఎగుమతులేనని తెలిపారు. రాష్ట్రంలో అత్యాధునిక వైద్య సంస్థల తో హెల్త్ టూరిజం కూడా విస్తరిస్తోందని చెప్పారు. హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్డీ సంస్థలో మూడు వారాల శిక్షణ ముగించుకున్న ఈజిప్టు వాణిజ్య దౌత్యవేత్తల బృందం తో సచివాలయంలో సోమవారం మంత్రి శ్రీధర్‌బాబు సమావేశమయ్యారు.
ఈజిప్టు, హైదరాబాద్‌కు సాంస్కృతిక పరంగా అనేక సారూప్యాలు ఉన్నాయని ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు ప్రస్తావించారు. రాష్ట్రంలోని 67,000 మంది ఎస్‌హెచ్‌జీ మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమాన్ని తమ ప్రభుత్వం చేపట్టిందని వెల్లడిం చారు. మహిళల కోసం ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒకటి చొప్పున 119 ప్రత్యేక పారిశ్రామికవాడలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. డ్వాక్రా మహిళల ఉత్పత్తులు దేశవ్యాప్తంగా, కొన్ని కళాఖండాలు, వస్త్రాలు విదేశాలకు కూడా వెళ్తున్నాయని చెప్పారు. ఐటీ, ఏఐ రంగాల్లో హైదరాబాద్ ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చెందుతోందన్నారు.
ఇటీవలే ఏఐ సిటీని 200 ఎకరాల్లో ఏర్పాటు చేసే పనులు ప్రారంభించామన్నారు. సెమీ కండక్టర్ల తయారీకి తమ రాష్ట్రం చిరునామాగా మారబోతోందని చెప్పారు. ఈజిప్టుతో వాణిజ్య సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు తమ ప్రభుత్వం ఆసక్తితో ఉందన్నారు. ఇక్కడి ప్రసిద్ధ ఇరానీ టీ, బిర్యానీ ఆహార పదార్థాలను రుచి చూశారా అని ప్రతినిధి బృందాన్ని అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఎంసీహెచ్‌ఆర్డీ డైరెక్టర్ జనరల్ గోయెల్, కోర్సు డైరెక్టర్ డా.మాలతి, తదితరులు పాల్గొన్నారు.