calender_icon.png 4 October, 2024 | 3:02 AM

భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలి

04-10-2024 12:59:34 AM

రైతుల గోడు వినకుండా భూములు గుంజుకోవడం సరికాదు

ఇందిరాపార్కులో నిర్వహించిన భూనిర్వాసితుల ధర్నాలో వక్తలు

ముషీరాబాద్, అక్టోబర్ 3: ఓఆర్‌ఆర్ నుంచి ఆర్‌ఆర్‌ఆర్ వరకు ప్రధానమైన నాలుగు రహదారుల విస్తరణలో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు వెంటనే నష్టపరిహారం లేదా ప్రత్యామ్నాయంగా భూములను కేటాయించి న్యాయం చేయాలని పలువురు వక్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

భూములు కోల్పో తున్న తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆర్‌ఆర్‌ఆర్ భూనిర్వాసితుల ఐక్యవేదిక, ఐక్యవేదిక యాదాద్రి భువనగిరి జిల్లా సంయుక్త ఆధ్వర్యంలో గురువారం ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో ధర్నా నిర్వహించారు.

మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య, మాజీ ఎమ్మెల్యేలు ఫైళ్ల శేఖర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, జూలకంటి రంగారెడ్డి, గ్యాదరి కిశోర్, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ సాగర్, పల్లె రవి హాజరై ధర్నాకు హాజరై రైతులకు మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా ఎంపీ ఈటల మాట్లాడుతూ.. చౌటుప్పల్  భువనగిరి అలైన్‌మెంట్‌ను వెంటనే మా ర్చాలని డిమాండ్ చేశారు. గజ్వేల్ ఫార్మాసిటీ భూ నిర్వాసితులు కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారని, వారికి కూడా తమ మద్దతు ఉంటుంద న్నారు. రోడ్లకు, ప్రాజెక్ట్‌లకు భూములు ఇవ్వడానికి వ్యతిరేకం కాదని, కానీ అక్కడ ఉన్న రేటు ఇచ్చి తీసుకోవాలని అన్నారు.

స్థానిక రైతుల అభిప్రాయం తెలుసుకోకుండా, వారి గోడు వినకుం డా భూములు గుంజుకుంటే ఎలా అని ప్రశ్నించారు. ఈ విషయంలో కేంద్రానికి సంబంధం ఉందంటే నేనే ముందుండి మాట్లాడతానని తెలిపారు. అనంతరం మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్‌ఆర్‌ఆర్ విషయంలో గత ప్రభుత్వ ఆలోచనకు భిన్నంగా అలైన్‌మెంట్‌ను కొద్దిమంది అవసరాలకు అనుగుణంగా మార్చే ప్రయత్నం జరిగిందని, దీని వల్ల రైతులు నష్టపోయారన్నారు.

ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు ఆర్‌ఆర్‌ఆర్ రైతులు తెగించి పోరాడాలని అన్నారు. కార్యక్రమంలో రైతు ఐక్య వేదిక నాయకులు చింతల దామోదర్ రెడ్డి, కృష్ణ, నర్సింహ, శ్రీశైలం, సురేందర్ రెడ్డి, మల్లేశం, రామలింగం గౌడ్, రాములు, భాగయ్య, నర్సిరెడ్డి, ప్రకాశ్ రెడ్డి, వెంకటేశం, పాండు యాదవ్, యాదయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.