calender_icon.png 23 October, 2024 | 12:50 PM

కౌలు రైతులకు దక్కని నష్టపరిహారం

18-09-2024 01:37:05 AM

  1. భూయజమానుల ఖాతాలో జమ చేయనున్న ప్రభుత్వం 
  2. ప్రజాభిప్రాయ సేకరణలో 8.50 లక్షల మంది కౌలు రైతుల గుర్తింపు 
  3. తమను ఆదుకోవాలని ఎమ్మెల్యేలకు కౌలుదారుల విన్నపాలు 
  4. వడ్డీ వ్యాపారుల నుంచి అప్పలు తెచ్చామని కన్నీరు

హైదరాబాద్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పలు జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. దీంతో ప్రభుత్వం పంట నష్టం కింద ఎకరానికి రూ.10 వేలు పరిహారం అందిస్తామని ప్రకటింది. ప్రభుత్వ నిర్ణయం భూ హక్కులు కలిగిన రైతులకు ఆనందం కలిగించగా, కౌలు రైతులకు నిరాశ మిగిల్చింది. వ్యవసాయ శాఖ అధికారులు వారం రోజు ల పాటు పర్యటించి రాష్ట్రవ్యాప్తంగా 2.31 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని నివేదిక సమర్పించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.231 కోట్లను కేటాయించింది.

ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట, నల్లగొండ, వికారాబాద్, నారాయణ్‌పేట, వనపర్తి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో పంట నష్టం అధికంగా జరిగింది. ఈ పరిహారం పట్టా పాసుబుక్ ఉన్న రైతులకు మాత్రమే అందించనున్నారు. పంట నష్టపోయిన వారి లో కౌలు రైతులు కూడా ఉన్నారు. వీరంతా తమ పరిస్థితి ఏమిటని స్థానిక ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. తాము భూములను కౌలుకు తీసుకొని లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టామని, భూములను సొంతంగా సాగుచేసుకున్న వారి కంటే తామే అధిక మొత్తంలో నష్టపోయామని వాపోతున్నారు.

తమకు కూడా పంట నష్టపరిహారం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. వర్షాలకు పత్తి, వరి పంటలకే బాగా నష్టం జరిగింది. కొన్ని చోట్ల మిరప, మొక్కజొన్న దెబ్బతిన్నాయి. వీటిని గుర్తించి స్థానిక వ్యవసాయ అధికారులు పట్టాదారు పాసుపుస్తకాల ఆధారంగా వారి ఖాతాలో జమ చేయనున్నారు. మూడు నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పంపిణీ కోసం మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించి జిల్లాల వారీగా ప్రజాభిప్రాయ కార్యక్రమాన్ని చేపట్టింది.

అందులో కౌలు రైతుల వివరాలను సైతం సేకరించింది. ఈ డాటా ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 8.50 లక్షల మంది కౌలు రైతులు ఉన్నట్లు గుర్తించారు. వీరంతా ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద పెట్టుబడి కోసం అప్పులు తీసుకొని పంట సాగు చేశారు. పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు పడడంతో పంట నేలపాలైంది. దీంతో అన్నదాతలు ఆందోళనలో ఉన్నారు.

నేటి నుంచి పరిహారం జమ..

ఇటీవల ప్రభుత్వం పంట నష్టం పరిహా రం కోసం నిధులు కేటాయించడంతో వాటి ని నేటి నుంచి రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ పేర్కొంది. 33 శాతం కంటే అధికంగా దెబ్బతిన్న పంటలకు మాత్రమే నష్టం పరిహారం పంపిణీ చేస్తున్నామని, అంతకంటే తక్కువ నష్టపోతే పరిగణనలోకి తీసుకోవడం లేదని తెలిపింది. పంటల పరిశీలనకు వెళ్లినప్పుడు కౌలు రైతులు కూడా తమను ఆదుకోవాలని కోరినట్లు అధికారులు పేర్కొన్నారు. పట్టా పాసుబుక్ ద్వారా చెల్లింపులు చేయాలని నిబంధనలు ఉండడంతో ఆ ప్రకారమే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నట్లు వెల్లడించారు. 

కౌలు రైతులకు రైతు భరోసా! 

ప్రభుత్వం ఎన్నికల సమయంలో కౌలు రైతులకు కూడా పంట పెట్టుబడి సాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుందని, అందుకోసం కౌలు రైతుల జాబితా సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. వారికి రూ.15 వేల చొప్పన ఖాతాల్లో జమ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఏవిధంగా వారికి పంపిణీ చేయాలనే అంశంపై స్పష్టత రాగానే దసరా తర్వాత వానాకాలం, యాసంగి పంటలకు ఒకేసారి రైతు భరోసా ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.