calender_icon.png 22 October, 2024 | 6:11 PM

ఖద్దరు నేతల ఖాతాల్లోకి పరిహారం!

22-10-2024 12:57:14 AM

  1. సర్కారు భూముల్లో పట్టాలు ఉన్నట్టు ప్రభుత్వ సొమ్ము లూటీ
  2. ఆలస్యంగా వెలుగులోకి రెవెన్యూ అధికారుల లీలలు 

నాగర్‌కర్నూల్, అక్టోబర్ 21 (విజయక్రాంతి): సర్కారు భూములన్ని తమ పట్టా భూములుగా చెప్పుకుని ఖద్దరు లీడర్లు మార్కండేయ ప్రాజెక్టు పరిహారాన్ని అమాంతం మింగేశారు. భూ సేకరణలో అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా నకిలీ వ్యక్తుల ఖాతాల్లోకి లక్షల ప్రజాధనాన్ని జమ చేశారు.

ప్రాజెక్టు నిర్మాణం కోసం నిజమైన రైతులు భూములను కోల్పోయి వారికి అందాల్సిన పరిహారం కోసం కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా కనకరం చూపని రెవెన్యూ అధికారులు.. ఏకంగా 9 ఎకరాల 33 గుంటల భూమిలో 6 ఎకరాల 33 గుంటలు ప్రభుత్వ భూమిగా చూపుతూ మిగితా ప్రభుత్వ భూమిని నేతలకు అప్పనంగా అప్పజెప్పారు.

2018 ఎన్నికల హామీలో భాగంగా గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్యాకేజి 29 కాల్వ నుంచి ఎత్తు ప్రాంతం గల బిజినపల్లి మండలం మార్కెండేయ ప్రాజెక్టు ద్వారా 11 గ్రామాలు, తండా లకు నీళ్లు ఇవ్వాలన్న లక్ష్యంతో ఆ ప్రాంతం లో ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది.

బిజినపల్లి మండలం గంగారం గ్రామ శివారులో 71 మంది రైతుల ద్వారా 34.11 ఎకరాలు భూ సేకరణ చేపట్టింది. ఎకరానికి రూ.10లక్షల చొప్పున రూ.3,97,95,313 లను ప్రభు త్వం రైతుల ఖాతాల్లోకి జమచేసింది. సేకరించిన భూమిలో సర్వే నంబర్ 469 లో 9 ఎక రాల 33 గుంటల ప్రభుత్వ భూమి ఉంది.

ఆ భూమిలో డీ మహేశ్వరమ్మకు 2 ఎకరాల 15 గుంటలు, బీ. కాంతారెడ్డి 0.24 గుంటలు, వీ మేఘారెడ్డి 0.09 గుంటలు, శివారెడ్డి 0.09 గుంటలు ఉన్నట్లుగా చూపి రూ.40,34, 686 ప్రైవేట్ వ్యక్తులు కాజేశారు. వారంతా ఆయా గ్రామాల్లో ఓటర్లను ప్రభావితం చేయగల నేతలు కావడంతో గత పాలకులు, రెవెన్యూ అధికారుల కన్నుసనుల్లోనే అప్పజెప్పినట్టు అనుమానాలు రేకెత్తుతున్నాయి.