- ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్
- గాంధీ దవాఖానలో ఆదివాసీ మహిళకు పరామర్శ
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబరు 5 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం తీరు బతికుంటే పరిహారం.. చనిపోతే సంతాప మన్నట్లు తయారైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. అత్యాచారానికి గురైన బాధితురాలిని గురువారం ఆయన గాంధీ దవాఖా నలో పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జైనూర్‌లో ఆదివాసీ మహిళపై అఘాయిత్యానికి పాల్పడి, అత్యం త పాశవికంగా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈమె ప్రాణాలతో ఉండడం వల్ల ఎవరేం మాట్లాడటం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోకపోవడాన్ని మంత్రి తప్పుబట్టారు.
పేరుకు మాత్రమే నిందితుడిని పట్టుకొని అరెస్టు చేశామని చెపుతున్నారన్నారు. కానీ ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయాల గురించి మాట్లాడితే హిందూవులపై లాఠీ చార్జి చేసి, హిందూ యువకులను అరెస్టు చేస్తున్నారన్నారు. ఇప్పటికే నిర్మల్‌లో స్థానిక మున్సిపల్ చైర్మన్, బేగంబజార్‌లో ఎంఐఎం పార్టీ నాయకుడు, వక్ఫ్‌బోర్డు అధ్యక్షులు, ఎమ్మెల్యే కుమారుడు అధికారిక వాహనంలో అత్యాచారానికి పాల్పడిన సంఘటనలు ఉన్నాయన్నారు.
వీటితో పాటు సుల్తానాబాద్, కరీంనగర్, నాగర్‌కర్నూల్ తదితర ప్రాంతాల్లో ఒక వర్గానికి చెందిన వారే మహిళలపై ముర్ఖంగా అత్యాచారానికి పాల్పడుతున్నారని విమర్శించారు. ఎంఐఎం పార్టీకి చెందిన నాయకులు ఆదివాసీ మహిళపై జరిగిన అత్యాచారం గురించి మాట్లాడకుండా.. షాపులపై దాడులు జరిగాయని మాట్లాడటం దుర్మార్గమైన చర్య అని అభిప్రాయపడ్డారు. ఈ తరహా ఘటనలను పోలీస్ వ్యవస్థ కంట్రోల్ చేయాలన్నారు. ఇప్పటికే ఈ విషయంపై డీజీపీతో మాట్లాడినట్టు వెల్లడించారు.