- బాధితులు సివిల్ కోర్టును ఆశ్రయించొచ్చు
- హైడ్రాపై కేసులో హైకోర్టు
- అమీన్‌పూర్ భూములపై యథాతథస్థితి
హైదరాబాద్, నవంబర్ 20(విజయక్రాంతి): చట్ట ప్రకారం నిర్మాణాలు జరిగిన వాటిని హైడ్రా కూల్చివేస్తే బాధితులు సంబంధిత సివిల్ కోర్టులో నష్టం పరిహారం కావాలని కేసులు వేసుకునే వీలు చట్టంలో ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. సంబంధిత అధికారుల నుంచి నష్టపరిహారం కోరవచ్చునని పేర్కొంది.
ఒకవేళ ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు ఉన్నాయని తేలితే వాటిని క్రమబద్ధీకరణ చేయాలని దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉందని, అలా చేసుకున్న వాటిని అధికారులు చట్ట ప్రకారం పరిష్కరించాలని చెప్పింది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం పటేల్‌గూడలోని పట్టా భూముల్లో చట్ట ప్రకారం నిర్మించుకున్న ఇళ్లు, విల్లాలను హైడ్రా కూల్చివేస్తే బాధితులు చట్ట ప్రకారం నష్టపరిహారం కోరవచ్చునని హైకోర్టు స్పష్టంచేసింది.
పటేల్‌గూడ సర్వే నంబర్ 6లోని ప్రైవేట్ భూమితోపాటు సర్వే నంబర్ 12లోని ప్రభుత్వ భూమిపై సర్వే నిర్వహించి హద్దులు తేల్చాలని ఆదేశించింది. ఈ మేరకు సర్వే శాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌కు ఉత్తర్వులు జారీచేసింది. సర్వే పూర్తయ్యే వరకు స్టేటస్కో (యథాతథస్థితి) కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
ప్రభుత్వ భూముల్లో ఎవరైనా ఉంటే వాళ్లు క్రమబద్ధీకరణకు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చునని కూడా చెప్పింది. ఈ విధంగా ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే వాటిపై అధికారులు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. తమ ఇళ్లను, విల్లాలను హైడ్రా అధికారులు చట్ట వ్యతిరేకంగా కూల్చేస్తున్నారంటూ దాఖలైన 22 పిటిషన్లను జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి బుధవారం విచారణ జరిపారు.
పటేల్‌గూడలోని సర్వే నంబర్ ౦౬లోని పట్టా భూములను కొనుగోలు చేశాక ఇళ్ల నిర్మాణాలు చేసుకునేందుకు ల్యాండ్ కన్వర్షన్ చేయించుకు న్నారని, అనుమతులు పొందాకే నిర్మాణాలు చేశారని పిటిషనర్ల తరఫు న్యాయ వాదులు చెప్పారు. సర్వే చేయకుండానే, నోటీసులు కూడా జారీ చేయకుండానే చెప్పాపెట్టకుండా ఇళ్లను, విల్లాలను హైడ్రా కూల్చేసిందని ఆరోపించారు.
సర్వే నంబర్ 12లో ప్రభుత్వ భూమని చెప్పి అక్రమ నిర్మాణాలని చెప్పి హైడ్రా ఏకపక్షంగా కూల్చేసిందని చెప్పారు. చట్ట ప్రకారం అన్ని అనుమతులు ఉన్నప్పటికీ హైడ్రా కూల్చివేత చర్యలు చేపట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి అధికారుల నుంచి నష్టపరిహారంతోపాటు చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
దీనిపై ప్రభుత్వ న్యాయవాది మురళీధర్‌రెడ్డి వాదిస్తూ.. పిటిషనర్ల ఇళ్లు ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 12లో ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. మండల సర్వేయర్ సర్వే చేశాకే నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకున్నట్టు వివరించారు.
వాదనల అనంతరం హైకోర్టు.. భూమికి సంబంధించిన సేల్ డీడ్లు, నాలాతోపాటు ఇతర అనుమతులన్నీ పొంది ఇళ్లు నిర్మించుకున్నామని పిటిషనర్లు చెప్తున్నారని గుర్తుచేసింది. తమ సమక్షంలో సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయించలేదని పిటిషనర్లు చెప్తున్నందున అందుకు అనుగుణంగా సర్వే చేయాలని సర్వే అధికారులను ఆదేశించింది. రెండు సర్వే నంబర్ల హద్దులను తేల్చాలని ఆదేశించింది.
పిటిషనర్ల భూమి ప్రైవేట్ సర్వే నంబర్లో ఉంటే చట్ట ప్రకారం ఇళ్ల నిర్మాణాలకు అనుమతించాలని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. చట్ట విరుద్ధంగా కూల్చివేతలు ఉంటే వాటికి పిటిషనర్లు నష్టంతోపాటు పరిహారం కూడా సివిల్ కోర్టులో కోరవచ్చునని స్పష్టం చేసింది.
ప్రభుత్వ భూమి సర్వే నెం 12లో నిర్మాణాలు ఉంటే వాటిని క్రమబద్ధీకరణకు పిటిషనర్లు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపింది. పిటిషన్లపై విచారణ ముగిసినట్టు ప్రకటించింది.