calender_icon.png 29 September, 2024 | 11:09 PM

రామంతాపూర్ పెద్దచెరువు ఎఫ్టీఎల్ తేల్చండి

26-09-2024 03:39:09 AM

  1. లేక్ ప్రొటెక్షన్ కమిటీకి ఆరు నెలల గడువు
  2. 20 ఏళ్ల నాటి పిల్‌లో హైకోర్టు తుది ఉత్తర్వులు

హైదరాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): రామంతాపూర్ పెద్దచెరువు ఎఫ్టీఎల్ నిర్దారణకు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆరు నెలల గడువు ఇచ్చింది. 3 వారాల్లోగా ప్రతివాదులు, ఇతరుల నుంచి లేక్ ప్రొటెక్షన్ కమి టీ అభ్యంతరాలను స్వీకరించాలని సూచించింది.

ఆ అభ్యంతరాలను ౪ వారాల్లోగా పరిష్కరించి ఫైనల్ నోటిఫికేషన్ వెలువరించాలని ఆదేశించింది. ఎఫ్టీఎల్ నిర్దారణ తర్వా త చెరువు రక్షణకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని తుది ఉత్తర్వులు జారీచేసింది. ఈ చెరువు పై 2005లో దాఖలైన వ్యాజ్యంపై విచారణ ను ముగిస్తున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాస్‌రావుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవా రం తీర్పు వెలువరించింది.

26 ఎకరాల్లోని రామంతాపూర్ పెద్ద చెరువును డంపింగ్ యార్డులా మార్చేశారంటూ ఉస్మానియా వర్సిటీ ప్రొఫెసర్‌గా పనిచేసిన డాక్టర్ కేఎల్ వ్యాస్ 2005లో రాసిన లేఖను హైకోర్టు పిటిషన్‌గా పరిగణించి విచారణ జరుపుతోం ది. ప్రతివాదులుగా ఆ ప్రాంతానికి చెందిన పలువురి తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ఇదే అంశంపై హైకోర్టు గతంలోనే ఉత్తర్వులు జారీ చేసిందని, మరోసారి విచారణ అవసరం లేదని చెప్పారు.

ధర్మాసనం కల్పించుకొని, ఎఫ్టీఎల్ నిర్దారణకు తుది నోటిఫికేషన్ వెలువడిందో లేదో చెప్పాలని పలుసార్లు ప్రశ్నించింది. ఎఫ్టీఎల్ నిర్ణయించే నిమిత్తం తుది నోటిఫికేషన్ వెలువడలేదని న్యాయవాదులు అంగీకరించారు. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ విషయంలో తాము జారీచేసిన ఉత్తర్వులను పరిశీలించాలని ధర్మాసనం సూచించింది.

చట్ట ప్రకారం లేక్ ప్రొటెక్షన్ కమిటీనే ప్రాథమిక, తుది నోటిఫికేషన్లు జారీ చేసి ఎఫ్టీఎల్‌ను ఖరారు చేయా ల్సివుంటుందని వెల్లడించింది. హైదరాబాద్ వరంగల్ రోడ్డు 30 అడుగుల నుంచి 200 అడుగులకు విస్తరించినప్పుడు ప్రభుత్వమే పెద్దచెరువు భూమిని తీసుకుందని మరో న్యాయవాది చెప్పారు.

40 ఏళ్ల క్రితమే అక్కడి లేఅవుట్లలో స్థలాలను కొనుగోలు చేసి చట్ట ప్రకారం అనుమతులు తీసుకుని ఇళ్ల నిర్మాణాలు చేసుకున్నారని, ఇప్పుడు వచ్చిన అధికారులు ఎఫ్టీఎల్‌లో ఇళ్లు ఉన్నాయని చెప్పడం అన్యాయమని చెప్పారు. దీని పై స్పందించిన హైకోర్టు.. 40 ఏళ్ల నుంచి ఉంటున్నారా? నాలుగేళ్ల నుంచి ఉంటున్నా రా? అన్నది అప్రస్తుతమని తేల్చిచెప్పింది.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ మహమద్ ఇమ్రాన్ ఖాన్ వాదనలు వినిపిస్తూ.. ఎఫ్టీఎల్ నిర్దారణకు నోటిఫికేషన్ వెలువడలేదని చెప్పారు. జాయింట్ లేక్ ప్రొటెక్షన్ కమిటీ సర్వే నివేదికలో పెద్దచెరువు మ్యాప్ ఉందని, అది చూసిన ప్రతివాదులు ఎఫ్టీఎల్ నిర్దారణ అయినట్టు పొరపాటు పడుతున్నారని చెప్పారు.  

చెరువును పూడ్చేసి జాగా ఉందంటూ

హెచ్‌ఎండీఏ స్టాండింగ్ కౌన్సిల్ పాశం కృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ.. పెద్దచెరువులో గ్రావెల్ పోసి తమకు ఇంటి స్థలం ఉం దని చెప్తున్నారని, చాలామంది అలా చేసే ఇళ్ల నిర్మాణాలు చేశారని చెప్పారు. చెరువు ను రక్షించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉం దన్నారు. జోక్యం చేసుకున్న ధర్మాసనం.. గతంలోనే ఉత్తర్వులు జారీచేస్తే ఇప్పటి వర కు ఎఫ్టీఎల్ ఎందుకు ఖరారు చేయలేదని ప్రశ్నించింది.

అధికారులు చెరువు రక్షణకు వెళితే అడ్డుకుంటున్నారని స్టాండింగ్ కౌన్సిల్ చెప్పడంపై స్పందించిన ధర్మాసనం.. బుల్డోజర్లతో కూల్చివేత చర్యలు తీసుకుంటూ ప్రభుత్వాన్నే అడ్డుకుంటున్నారని ఎలా చెప్తారని ఎదురు ప్రశ్నించగా, ఎఫ్టీఎల్ నిర్ణరణకు వీలుగా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.

వాదనల అనంతరం ధర్మాసనం.. పెద్దచెరువు ఎఫ్టీఎల్ నిర్ధారణ చేసే ముందు అభ్యంతరాలను స్వీకరించి వాటిని చట్ట ప్రకారం పరిష్కరించాలని సూచించింది. ౬ నెలల్లోగా ఎఫ్టీఎల్‌ను తేల్చి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తుది ఉత్తర్వుల ను జారీచేసింది. సుమారు 20 ఏళ్లకు పిల్‌పై విచారణ ముగిస్తున్నట్టు ప్రకటించింది.

28న జాతీయ లోక్ అదాలత్

హైదరాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): ఎస్సై యాక్ట్ కేసులు, ఎక్సైజ్ కేసులు, కార్మిక వివాదాలు, మ్యాట్రిమోనిల్, సివిల్ కేసుల్లో రాజీ కోసం 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ (టీఎస్‌ఎల్‌ఎస్‌ఏ) సభ్య కార్యదర్శి సీహెచ్ పంచాక్షరి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశా రు.

జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఫిజికల్‌గా, ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. హైకోర్టుతో పాటు తాలూకా కోర్టుల్లోనూ ఈ లోక్ అదాలత్ జరుగుతుందని చెప్పా రు.

కేసులను పరిష్కరించుకోవాలనుకునే వారు జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, న్యాయసేవా సదన్, మండల న్యా యసేవా కమిటీలను సంప్రదించాలని సూచించారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, సత్వర న్యాయం పొందాలని వివరించారు.