calender_icon.png 27 September, 2024 | 6:56 AM

భారత్‌ను పాక్‌తో పోలుస్తారా?

26-09-2024 02:03:02 AM

కర్ణాటక జడ్జీపై సుప్రీంకోర్టు మండిపాటు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: న్యాయమూర్తులు ఏ వర్గానికి సంబంధించి పక్షపాత ధోరణి అవలంబించవద్దని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ఓ కేసు విచారణ సందర్భంగా కర్ణాటక జడ్జి వాఖ్యలను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు.. ఆ కేసు విచారణ ముగింపు సందర్భంగా బుధవారం సీజేఐ ఘాటుగా స్పందించారు. ‘భారత్‌లోని ఏ ప్రాంతాన్ని పాకిస్థాన్‌తో పోల్చడం సరికాదు.

ఇది దేశ ప్రాదేశిక సమగ్రతకు విరుద్ధం. న్యాయమూర్తులు కేసుల విచారణ సమయంలో ద్వేషపూరితంగా, ఓ వర్గాన్ని ఉద్దేశించేలా పక్షపాత వ్యాఖ్యలు చేయవద్దు’ అని సీజేఐ తెలిపారు. తన వ్యాఖ్యల పట్ల సదరు జడ్జి బహిరంగ క్షమాపణలు చెప్పడంతో సుమోటో కేసును మూసివేస్తున్నట్లు సీజేఐ స్పష్టం చేశారు. కాగా ఇటీవల ఓ భూవ్యవహారానికి సంబంధించిన కేసులో కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్ వేదవ్యాసాచార్ శ్రీశానంద విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.