calender_icon.png 8 January, 2025 | 8:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చావులోనూ తోడుగా..

07-01-2025 02:10:24 AM

  1. ప్రేమ విషయం పేరెంట్స్‌కు చెబుతానని అగంతుకుడి బెదిరింపులు 
  2. అడిగినన్ని డబ్బులు ఇచ్చినప్పటికీ మరిన్ని ఇవ్వాలని డిమాండ్
  3. భయపడి కారులో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ప్రేమజంట ఆత్మహత్య
  4. ఘట్‌కేసర్ ఓఆర్‌ఆర్ సమీపంలో ఘటన

ఘట్ కేసర్, జనవరి 6: ఓ అగంతకుడి బ్లాక్‌మెయిల్‌కు భయపడి ఓ ప్రేమజంట కారుకు నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఘట్ కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. ఘట్‌కేసర్ ఇన్‌స్పెక్టర్ పరుశురాం తెలిపిన ప్రకారం వివరాలు.. యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం జమీలాపేట్‌కు చెందిన పర్వతం శ్రీరామ్(25).. పోచారం మున్సిపాలిటీ నారపల్లి సమీపంలో సైకిల్ రిపేరింగ్ షాపు నిర్వహిస్తున్నాడు.

అక్కడే ఉంటున్న ఓ బాలికతో శ్రీరామ్‌కు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కాగా ఇద్దరి ప్రేమ వ్యవహారం బాలిక సమీప బంధువు పోచారం మున్సిపాలిటీ మక్త గ్రామానికి చెందిన చింటుకు తెలిసింది. వీరి ప్రేమ విషయం బాలిక తల్లిదండ్రులకు చెబుతానని గత 15 రోజులుగా చింటు బెదిరింపులకు దిగాడు.

అడిగినన్ని డబ్బులు ఇస్తే తప్ప ఊరుకునేది లేదని బ్లాక్‌మెయిల్ చేయడంతో మొదట శ్రీరామ్ దగ్గర ఉన్న రూ.లక్ష 35వేలు చింటుకు ఇచ్చారు. అయినా బాలికకు ఫోన్ చేసి మరిన్ని డబ్బులు కావాలని ఇవ్వకపోతే మీ తల్లిదండ్రులకు చెబుతానని బెదిరించసాగాడు.

తమవద్ద ఇవ్వడానికి ఇంకా ఏమి లేకపోవడానికి తోడు విషయం తెలిస్తే తల్లిదండ్రులు చంపేస్తారని భయపడ్డ ప్రేమ జంట చనిపోదామని నిర్ణయించుకున్నారు. సోమవారం ఉదయం బోడుప్పల్ కు చెందిన శ్రీరామ్.. మిత్రుడు నవీన్‌కు చెందిన ఎర్టిగా(టీఎస్08 జేయూ1163) కారును అడిగి తీసుకున్నాడు.

బాలికతో కలిసి సాయంత్రం 6 గంటల సమయంలో ఘనపూర్ సమీపంలోని ఓఆర్‌ఆర్ సర్వీసు రోడ్డుకు చేరుకుని వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను కారులో పోసుకుని నిప్పంటించుకున్నారు. దీంతో మంటలు అంటుకుని కారులో పేలుడు సంభవించింది. శ్రీరామ్ మంటలకు తట్టుకోలేక డోర్ తీసుకుని బయటకు వచ్చి రోడ్డుపై కుప్పకూలి అక్కడిక్కడే మృతిచెందగా బాలిక మంటల్లో పూర్తిగా ఆహుతి అయ్యింది.

సమచారం అందుకున్న  ఫైర్ ఇంజన్ సిబ్బంది, పోలీసులు మంటలను ఆర్పివేశారు. మృతుడు జరిగిన విషయాన్ని బాలిక తల్లిదండ్రులు, అతని బంధువులకు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్నారు.