calender_icon.png 7 January, 2025 | 8:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజిజుపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు

13-12-2024 01:28:15 AM

* ఎంపీలను విమర్శించినందుకు వ్యతిరేకంగా ఫైల్ చేసిన తృణమూల్ ఎంపీ

* 60 మంది ప్రతిపక్ష ఎంపీల మద్దతు

* ఇప్పటికే చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టిన ఇండియా కూటమి

న్యూఢ్లిలీ, డిసెంబర్ 12: కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మీద తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాగరికా ఘోష్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ప్రవేశపెట్టారు. రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీలు ‘శుద్ధ దండగ’ అని రిజిజు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా ఎంపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసును ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి 60 మంది ప్రతిపక్ష ఎంపీలు మద్దతు తెలిపారు. రిజిజు ప్రతిపక్ష ఎంపీల గురించి ఇలా వ్యాఖ్యానించి ఒక రోజు గడిచిన తర్వాత సాగరిక ఘోష్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ప్రవేశపెట్టారు. 

మీరు శుద్ధ దండగ.. 

చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ మీద అవిశ్వాసం ప్రవేశపెట్టిన తర్వాత మంత్రి రిజిజు రాజ్యసభలో మాట్లాడుతూ.. ప్రతిపక్ష ఎంపీలపై విమర్శలు గుప్పించారు. మీరు శుద్ధ దండగ అని వ్యాఖ్యానించారు. దీంతో ప్రతిపక్ష ఎంపీలు గరం అయి.. మంత్రి మీద సభా హక్కుల ఉల్లంఘన నోటీసును ప్రవేశపెట్టారు. విలేకరులతో ఎంపీ సాగరికా మాట్లాడుతూ.. ‘పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రిజిజు పార్లమెంట్‌ను చక్కగా నడపడం మీద దృష్టి కేంద్రీకరించకుండా ప్రతిపక్షాలను ప్రతి రోజు విమర్శిస్తూనే ఉన్నారు. పార్లమెంట్ లోపల, బయట ఆయన వ్యక్తిగత విషయాలు మాట్లాడుతూ.. మమ్మల్ని తప్పుగా చూపుతున్నారు’ ’ అని ఆమె పేర్కొన్నారు. 

మంత్రి రిజిజు ఆయన కార్యాలయాన్ని దుర్వినియోగం చేస్తూ మాపై ‘అన్‌పార్లమెంటరీ’ భాష వాడుతున్నారు  అని ఘోష్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులో పేర్కొన్నారు. ఈ తీర్మానంపై ప్రతిపక్షంలోని అన్ని పార్టీలకు చెందిన సీనియర్ లీడర్లు సంతకం చేసినట్లు ఘోష్ తెలిపారు.

మరోమారు సోరోస్ రచ్చ.. 

జార్జ్ సోరోస్ ఆంశం మరోమారు పార్లమెంట్‌ను కుదిపేసింది. గురువారం కూడా రాజ్యసభలో సోరోస్ ఆంశం మీద రచ్చ జరిగింది. ప్రతిపక్ష కూటమి చైర్మన్ మీద అవిశ్వాసం ప్రవేశపెట్టగా అది ఎటూ తేలలేదు. సోరోస్ ఆంశం మీద అధికార ప్రతిపక్ష ఎంపీల మధ్య మాటల యుద్ధం నడిచింది. లోక్‌సభలో కూడా ఇదే రగడ జరిగింది. రాజ్యసభ ప్రారంభం కాగానే.. మంత్రి జేపీ నడ్డా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మీద విరుచుకుపడ్డారు. ఖర్గే చైర్మన్ మీద చేసిన వ్యాఖ్యలు అర్థం లేనివన్నారు.  కాంగ్రెస్ పార్టీకి యూఎస్ బిలియనీర్ సోరోస్ నుంచి నిధులు అందుతున్నాయని.. కాంగ్రెస్ దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు చూస్తోందని ఆరోపించారు.

‘అసలు సోరోస్‌కు సోనియా గాంధీకి ఉన్న సంబంధం గురించి దేశం మొత్తం తెలుసుకోవాలనుకుంటుంది’ అని నడ్డా వ్యాఖ్యానించారు. అదానీ ముడుపుల వ్యవహారం గురించి చర్చ జరపాలని పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు ధర్నాను కొనసాగించారు.  

మీకు సభలో ఉండే హక్కు లేదు.. 

చైర్మన్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. ‘మీరు ఆ కుర్చీకైనా విలువ ఇవ్వాలి. మీరు కనుక కుర్చీకి విలువ ఇవ్వకుంటే మీకు ఈ సభలో ఉండే అర్హత లేదు’ అని ప్రతిపక్షాలను విమర్శించారు. మంగళవారం 60 మంది ఇండియా కూటమి ఎంపీలు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఆయన సభలో పక్షపాత వైఖరితో ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై భగ్గుమన్న ప్రతిపక్ష ఎంపీలు రిజిజుపై కూడా సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ప్రవేశపెట్టారు.