19-04-2025 12:08:22 AM
హనుమకొండ, ఏప్రిల్ 18 (విజయ క్రాంతి): గత కొన్ని దశాబ్దాలుగా భార్యా భర్తల మధ్య తగాదాలు, తల్లిదండ్రులు పిల్లల మధ్య తగాదాలు సమాజంలో పెరిగి పోతున్నాయని, వీటికి చక్కటి పరిష్కారం కమ్యూనిటీ మీడియేషన్ అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ అన్నారు. సమాజంలో వ్యక్తులు, సమూహాల మధ్య వచ్చే వివాదాలను పరిష్కరించి శాంతియుతమైన సమాజాన్ని స్థాపించడానికి కమ్యూనిటీ పెద్దలు నడుం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలకు సంబంధించి ఆయా జిల్లాల న్యాయ సేవ సంస్థలు గుర్తించిన కమ్యూనిటీ మీడియేటర్ల మూడు రోజుల శిక్షణ కార్యక్రమాలను సీజే శుక్రవారం ఉదయం హనుమకొండలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ వివాదమైనా ఒక వ్యక్తికి వ్యక్తి మధ్యనో లేదా వ్యక్తుల సమూహాల మధ్యనో ఏర్పడుతుందని, అయితే ఆ వ్యక్తి గాని సమూహం గాని ఏదో ఒక కమ్యూనిటీకి చెందిన వారై ఉంటారన్నారు.
అటువంటి పరిస్థితిల్లో అదే కమ్యూనిటీ కి చెందిన పెద్దవారు వారికి నచ్చచెప్పినట్లయితే వివాదాలు సుహృద్భావ వాతావరణంలో పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ బృహత్తర ఆలోచన నుంచి ఉద్భవించినదే కమ్యూనిటీ మీడియేషన్ విధానమన్నారు. మొదటిసారిగా భారతదేశంలో కేరళ రాష్ట్రంలో ఈ విధానం విజయవంతం అయిందని పేర్కొన్నారు. సమాజంలోని కమ్యూనిటీ పెద్దలు కోర్టుల దాకా రాకుండా వేల సంఖ్యలో వివాదాలను పరిష్కరించారన్నారు.
ఆ తరువాత ఈ విధానం మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చేరి అక్కడ కూడా విజయవంతమైందన్నారు. అయితే 2023వ సంవత్సరంలో వచ్చిన మీడియేషన్ చట్టం ఈ విధానానికి చట్టబద్ధత కల్పించిందని అన్నారు. న్యాయస్థానాల లో కేసులు ఉంటే, ఇరుపక్షాలలో ఒకరు గెలిస్తే మరొకరు పైకోర్టుకు వెళ్తారని కానీ కమ్యూనిటీ మీడియేషన్ విధానంలో వివాదం పరిష్కారమైతే వ్యక్తులే కాకుండా కుటుంబాలు కూడా సంతోషంగా ఉంటాయని జస్టిస్ సుజోయ్ పాల్ పేర్కొన్నారు.