భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): ఆ సాంఘీక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ హెచ్చరించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ ఆధ్వర్యంలో శుక్రవారం కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కూలీ లైన్ లో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాంను నిర్వహించారు. ఇందులో భాగంగా మొత్తం సుమారుగా 250 ఇండ్లలో సోదాలు నిర్వహించడం జరిగింది. సరిగా పత్రాలు లేకుండా నెంబర్ ప్లేట్లు లేని 16 వాహనాలను సీజ్ చేశారు.
11 వాహనాలకు రూ.2400 జరిమానా విధించడం జరిగింది. ఇద్దరు బెల్ట్ షాపు నిర్వాహకుల నుండి సుమారుగా రూ.14,000 మద్యం బాటిలను సీజ్ చేశారు. అనంతరం కూలీ లైన్ కాలనీ వాసులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్ట వ్యతిరేక మరియు సాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని కోరారు.
తమ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. మట్కా,జూదం, బెట్టింగ్, గంజాయి రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడమైనదని తెలిపారు. ఇట్టి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల సమాచారం తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 100 మందికి పైగా పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.