479 పంచాయతీలు, 124 మున్సిపల్ వార్డుల్లో ఎర్ర జెండా రెపరెపలాడాలి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
ఉత్సహంగా సిపిఐ జిల్లా స్థాయి కౌన్సిల్ సమావేశం
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భారత కమ్యూనిస్టు పార్టీది వందేళ్ల సుదీర్ఘ చరిత్రని, ఈ చరిత్రను ప్రజలకు వివరించాలని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి కౌన్సిల్ సమావేశం పాల్వంచలోని' సిఆర్ భవన్'లో శనివారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన కూనంనేని మాట్లాడుతూ సిపిఐది నిర్మాణ, సిద్ధాంత బలం అని అన్నారు. జిల్లా వ్యాపితంగా వందేళ్ల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని 476 గ్రామపంచాయతీలు, 124 మున్సిపల్ వార్డుల్లో ఎర్రజెండా రెపరెపలాడాలని, ఉత్సవాలను పండువలా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
షరతులు, ఆంక్షలు లేకుండా రూ.2 లక్షల రైతు రుణాలను మాఫీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, ప్రతిపక్షాల నోళ్లు మూయించేందుకు, ప్రభుత్వంపై రైతులకు నమ్మకాన్ని కలిగించేందుకు ఇదొక్కటే మార్గమని అన్నారు. రుణమాఫీ జాప్యం రైతుల్లో ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ఖరీఫ్, రబీతో కలిపి రెండు దఫాలుగా రైతు భరోసా చెల్లించాల్సివుండగా నేటికీ దీనిపై స్పష్టత ఇవ్వలేకపోతోందన్నారు. రైతు భరోసా, రేషన్ కార్డులు, పెన్షన్లు వంటి ప్రధానమైన సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ద్రుష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. పథకాల అమలు జాప్యం ప్రభుత్వానికి చేటు చేస్తుందన్నారు. బిసి కులగాణను స్వాగతిస్తున్నామని, ఐతే ఎస్సి, ఎస్టీ, మైనార్టీల లెక్కలు కూడా తేల్చాల్సిన భాద్యత ప్రభుత్వంఫై ఉందన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులవల్లే రాష్ట్రానికి లోటు బడ్జెట్ ఏర్పడిందని, దీన్ని చక్కదిద్దేందుకు రాష్ట్ర మంత్రివర్గం సమిష్టిగా శ్రమించాలని సూచించారు.
కేంద్రం తీసుకున్న జమిలి ఎన్నికల విధానాన్ని సిపిఐ వ్యతిరేఖిస్తోందని, ఈ ఎన్నికలు రాజ్యాంగానికి విరుద్ధమని, కేంద్ర నిర్ణయాన్ని అడ్డుకొని తీరుతామన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కేవలం మతంపైనే మనుగడ సాగిస్తోందని, మతంపేరుతో ఓట్లు దండుకునే ప్రయత్నంలో భాగంగానే జమిలి ఎన్నికల జపాన్ని వల్లిస్తోదని విమర్శించారు. పంటలను ధరలపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా రైతులను నష్టాల ఊభిలోకి నేడుతోదని విమర్శించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందిస్తూ వాటి పరిస్కారంకోసం కార్యకర్తలు కృషి చేయాలని తద్వారా పార్టీని మరింత బలోపేతం చేయాలనీ కోరారు. ఈ సమావేశంల్లో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి అయోధ్య, ఎండి మౌలానా, జిల్లా కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాధం, సరెడ్డి పుల్లారెడ్డి, కె సారయ్య, కల్లూరి వెంకటేశ్వర్ రావు, ఎస్ డి సలీం, చంద్రగిరి శ్రీనివాసరావు, నరాటి ప్రసాద్, రావులపల్లి రవికుమార్, రేసు ఎల్లయ్య, చండ్ర నరేంద్ర కుమార్, దేవరకొండ శంకర్, మండల కార్యదర్శులు వి పూర్ణచందర్ రావు, ఏ సాయిబాబు, వాసిరెడ్డి మురళి, జి రామకృష్ణ, యూసుఫ్, వి రమేష్, బంధం నాగయ్య, భూక్యా దస్రు, గుగులోత్ రాంచందర్, డి సుధాకర్, కేశవరావు, వి సతీష్, ధర్మ, జిల్లా సమితి సభ్యులు, ప్రజా సంఘాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.