ఐటీడీఏ పీవో రాహుల్...
భద్రాచలం (విజయక్రాంతి): 2025-26 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ గురుకులాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ బాల, బాలికలకు ఇంగ్లీష్ మీడియంలో ఐదవ తరగతిలో ప్రవేశానికి కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. శుక్రవారం తన చాంబర్లో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించిన ఫ్లెక్సీ, కరపత్రాలు ఆర్ సి ఓ గురుకులం నాగార్జున రావు, ప్రిన్సిపాల్ సమక్షంలో ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం గురుకులాల్లో ఐదవ తరగతిలో ప్రవేశానికి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించి నిష్ణాతులైన బాల బాలికలను మెరిట్ ప్రకారము తీసుకోవడం జరుగుతుందని, ఆరవ తరగతి నుండి 9వ తరగతి వరకు బ్యాక్ లాగ్స్ ప్రవేశాల కొరకు, ఎస్ ఓ ఈ లో 8వ తరగతి ప్రవేశం కొరకు విద్యార్థినీ, విద్యార్థులు దరఖాస్తుని https://tgcet.cgg.gov.in ద్వారా ఆన్లైన్లో మాత్రమే సమర్పించాలని ఆయన అన్నారు.
దరఖాస్తుదారులు కులం సర్టిఫికెట్ నెంబరు, ఆదాయం సర్టిఫికెట్ నెంబరు, ఆధార్ కార్డు నెంబరు, బర్త్ డే సర్టిఫికెట్, ఫోటో తప్పనిసరిగా జత చేసి ఆన్లైన్లో సమర్పించాలని, సర్టిఫికెట్ల విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే సర్టిఫికెట్స్ సత్వర జారీ కోసం జిల్లా కలెక్టరేట్లో సహాయ కేంద్రం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. దరఖాస్తులు సమర్పించాల్సిన చివరి తేదీ 01 ఫిబ్రవరి 25 వరకు ఆన్లైన్ చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రమాదేవి, వైస్ ప్రిన్సిపాల్ హేమలత, ఫ్యాకల్టీ సరోజినీ తదితరులు పాల్గొన్నారు.