calender_icon.png 19 April, 2025 | 11:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామన్ డైట్ మెనూ అమలు చేయాలి

21-03-2025 01:42:28 AM

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి 

హుజురాబాద్, మార్చి20 (విజయక్రాంతి):  హాస్టల్లో విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కామన్ డైట్ మెనూ ప్రకారమే నాణ్యమైన పోషకాహారం అందించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. హుజురాబాద్ మండలం బోర్నపల్లిలో గల మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలను కలెక్టర్ పమేలా సత్పతి గురువారం సందర్శించారు.

ఈ సందర్భంగా హాస్టల్లో వసతులను, సౌకర్యాలను పరిశీలించారు. వంటగదిని, సరుకుల స్టోరేజీ గదిని తనిఖీ చేశారు. వంట గదిలో శుభ్రత పాటించాలని, పరిశుభ్రత, నాణ్యతతో భోజనం తయారు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కామన్ డైట్ మెనూ ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు.  భోజనం రుచి, నాణ్యతను గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

ప్రతిరోజు ఏ సమయానికి ఏయే ఆహారం ఇస్తున్నారని విద్యార్థులను అడిగారు. కామన్ డైట్ మెనూ ద్వారా ప్రభుత్వం అన్ని రకాల పోషకాహారంతో కూడిన  ఆహారాన్ని అందజేస్తున్నదని  తెలిపారు. అద్దె భవనంలో కొనసాగుతున్న ఈ పాఠశాలను పక్కా భవనంలోకి మార్చే విషయాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ప్రిన్సిపల్ రాణి పాల్గొన్నారు.