- జమిలీ ఎన్నికలనూ నిర్వహిస్తాం
- ఆర్టికల్ 370ని పూర్తిగా సమాధి చేశాం
- జాతీయ భద్రతకు పదేళ్లుగా కృషి చేస్తున్నాం
- జాతీయ ఐక్యతా దినోత్సవంలో ప్రధాని మోదీ
గాంధీనగర్, నవంబర్ 1: త్వరలోనే దేశంలో జమిలీ ఎన్నికలు సాధ్యమవుతాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. భారత ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా దేశమంతా ఒకేసారి ఎన్నికల నిర్వహణ ఉపయోగపడుతుందని తెలిపారు.
జమిలీతోపాటు అన్ని వర్గాలకు అనుకూలంగా ఉండే ఉమ్మడి పౌరస్మృతిని కూడా తొందరలోనే అమల్లోకి తెస్తామని చెప్పారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 149వ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద ప్రధాని మోదీ గురువారం ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జాతీయ ఐక్యతో పాటు వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఉమ్మడి పౌర స్మృతి, అర్బన్ నక్సల్స్ వంటి అంశాలపై వ్యాఖ్యానించారు.
జమిలీ, యూసీసీపై స్పష్టత
జీఎస్టీ ద్వారా ఒకే దేశం పన్ను విధానాన్ని తీసుకువచ్చాం. ఆయుష్మాన్ భారత్ ద్వారా ఒక దేశం, ఒక ఆరోగ్య బీమా పథకాన్ని తెచ్చాం. ఇప్పుడు ఒకే దేశం ఎన్నిక దిశగా పనిచేస్తున్నాం. జమిలీ ఎన్నికలు కూడా భారత్‌లో నిజమవుతాయి. ఇది ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా ఎన్నికల ఖర్చునూ తగ్గిస్తుంది.
వన్ నేషన్ సివిల్ కోడ్ దిశగా దేశం అడుగులు వేస్తోంది. ఇది సెక్యులర్ సివిల్ కోడ్ అని పేర్కొన్నారు. ప్రపంచంలో సంక్షోభం తలెత్తినప్పుడు భారత్ విశ్వబంధుగా మారడం సాధారణ విషయం కాదని, రెండు దేశాల మధ్య దూరం పెరిగినప్పుడు పరిష్కారం కోసం మన వద్దకు వస్తున్నారని చెప్పారు. ఈ రోజు సమస్యలను భారత్ ఎలా పరిష్కరిస్తుందో ప్రపంచం ఆసక్తిగా చూస్తోందని మోదీ అన్నారు.
ఎప్పటికీ సమాధిలోనే 370
నిత్యం రాజ్యాంగాన్ని జపిస్తామని చెప్పుకునేవారు అదే రాజ్యాంగాన్ని అవమానిస్తున్నార ని కాంగ్రెస్‌పై మోదీ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆర్టికల్ 370 రద్దు విషయాన్ని ప్రస్తావిస్తూ గత ప్రభుత్వాలు సైతం వివక్షాపూరిత విధానాలు, ఉద్దేశాలతో జాతీ య ఐక్యతను బలహీనపరిచాయని ధ్వజమెత్తారు.
దాన్ని పూర్తిగా సమాధి చేశామని చెప్పారు. 70 ఏళ్లుగా బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగం అమలు కాని జమ్ము కశ్మీర్‌లో 370 ప్రకరణ రద్దు చేసిన తర్వాత అక్కడి సీఎం భారత రాజ్యాంగంపై ప్రమాణం చేశారని చెప్పారు. అంతేకాకుండా పదేళ్లుగా జాతీయ భద్రతను సవాలుగా మారిన ఉగ్రవాదంపై పోరాడుతున్నామని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా దీపావళి
ఈసారి జాతీయ ఐక్యతా దినోత్సవం, దీపావళి ఒకేరోజు రావడం అద్భుతం. దీపావళి భారత్‌ను వెలుగులు నింపడమే కాకుండా ప్రపంచ దేశాలతో అనుసంధానిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో దీపావళిని జరుపుకుంటున్నారు. వైట్‌హౌస్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బుధవారం నిర్వహించిన వేడుకల్లో 600 మంది పాల్గొన్నారు.
చాలా దేశాల్లో దీపావళిని జాతీయ పండుగ నిర్వహిస్తున్నారు. కానీ, రాజకీయాల కోసం కొన్ని శక్తులు జాతీయ ఐక్యతను బలహీనం చేయాలని ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి అర్బన్ నక్సల్స్ కూటమిని గుర్తించి పోరాడాల్సిన అవసరం ఉంది అని మోదీ పిలుపునిచ్చారు.