calender_icon.png 17 January, 2025 | 7:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడు దశల్లో కమిటీలు

07-07-2024 01:04:01 AM

విభజన సమస్యలపై మొదట అధికారుల స్థాయిలో ఏర్పాటు

రెండోది మంత్రులు.. మూడోది సీఎంల స్థాయిలో.. 

డ్రగ్స్, సైబర్ క్రైమ్ నియంత్రణకు కలిసి ముందుకు

సీఎంలు చంద్రబాబు, రేవంత్ భేటీలో నిర్ణయం

వివరాలు వెల్లడించిన డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క

కీలక నిర్ణయాలు

మూడు దశల్లో కమిటీలు ఏర్పాటు చేయాలి.

మొదటి దశలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల స్థాయి ఉన్నతాధికారులతో కూడిన త్రీమెన్ కమిటీ.

రెండు వారాల్లో ఉన్నతస్థాయి అధికారుల కమిటీ సమావేశం.

రెండో దశలో మంత్రులతో కమిటీ ఏర్పాటు. అధికారులు కమిటీ పరిష్కారం చూపలేని అంశాలపై ఇరు రాష్ట్రాల మంత్రుల కమిటీ కసరత్తు.

మూడో దశలో మంత్రుల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలకు ఇద్దరు. ముఖ్యమంత్రులు మార్గాలు కనుగొనాలని నిర్ణయం.

మత్తు పదార్థాల నిరోధానికిై ఇరు రాష్ట్రాలు చేతులు కలపాలని నిర్ణయం.

డ్రగ్స్, సైబర్ క్రైమ్‌పై ఉక్కుపాదం మోపేందుకు రెండు రాష్ట్రాల అడిషనల్ డీజీ స్థాయిలో కమిటీ

హైదరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఇంకా కొనసాగుతున్న విభజన సమస్యల పరిష్కారానికి రోడ్ మ్యాప్ ఖారారైంది. గత పదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను మూడు దశల్లో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.

విభజన సమస్యల పరిష్కారమే ఎజెండాగా శనివారం సాయంత్రం ప్రజాభవన్‌లో ఇద్దరు సీఎంల భేటీ జరిగింది. ఈ సమావేశంలో పెండింగ్ సమస్యలపై దాదాపు రెండు గంటలపాటు చర్చించారు. ఈ భేటీలో తీసుకున్న విధానపరమైన నిర్ణయాలను తెలంగాణ డిఫ్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మీడియాకు వెల్లడించారు. పదేళ్లుగా పరిష్కారానికి నోచుకోని అంశాలను త్వరగా పరిష్కరించుకునేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఇరు పక్షాలు నిర్ణయించాయని చెప్పారు.

రెండువారాల్లో సమావేశం

రెండు వారాల్లో ఉన్నతస్థాయి అధికారుల కమిటీ సమావేశమై వారిస్థాయిలో పరిష్కార మార్గాలను అన్వేషిస్తుందని భట్టి విక్రమార్క తెలిపారు. రెండో దశలో మంత్రులతో కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఉన్నతస్థాయి అధికారులు పరిష్కారం చూపలేని అంశాలపై ఇరు రాష్ట్రాల మంత్రుల కమిటీ కసరత్తు చేస్తుందని వెల్లడించారు. మంత్రుల స్థాయిలో పరిష్కారం కనుగొన్న సమస్యలకు ఇరు రాష్ట్రాల సీఎంలు ఆమోదం తెలుపుతారని చెప్పారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్యలపై కూడా కలిసి పనిచేయాలని ఈ సమావేశంలో విధాన పరమైన నిర్ణయం తీసుకున్నట్లు భట్టి తెలిపారు. సైబర్ క్రైమ్‌కు సంబంధించి సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. డ్రగ్స్, సైబర్ క్రైమ్ అంశాల్లో రెండు రాష్ట్రాలు సమన్వయంతో పని చేసి వీటికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. 

తెలుగు జాతి హర్షించే రోజు: ఏపీ మంత్రి సత్య ప్రసాద్ 

విభజన సమస్యల పరిష్కారానికి ఇద్దరు సీఎంలు ముందుకు రావడం శుభ పరిణామమని ఏపీ మంత్రి సత్యప్రసాద్ అన్నారు. ఇది తెలుగుజాతి హర్షించదగ్గ రోజు అని పేర్కొన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు ఏపీలోనూ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపేందుకు ఇప్పటికే ఆరుగురు మంత్రులతో ఒక కమిటీని వేసినట్లు వెల్లడించారు.

ఎవరెవరు పాల్గొన్నారంటే?

ఈ చర్చలో ఏపీ తరఫున సీఎం చంద్రబాబుతోపాటు మం త్రులు కందుల దుర్గేశ్, సత్యప్రసాద్, బీసీ జనార్ధన్‌రెడ్డి పాల్గొనగా.. తెలంగాణ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. అలాగే ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ పాల్గొన్నారు.

ప్రజాభవన్‌లో ఇద్దరు సీఎంల డిన్నర్

సమావేశం ముగిసిన అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులతో పాటు మంత్రులు ప్రజా భవన్‌లోనే డిన్నర్ చేశారు. అనంతరం ఇద్దరు సీఎంలు తమ నివాసాలకు పయనమయ్యారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం భట్టి ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాల మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు.

భేటీలో చర్చించిన కీలకాంశాలు 

  1. ఏపీ పునర్విభజన చట్టంలోని షెడ్యూలు 9,10లో పేర్కొన్న ఆస్తుల పంపకాలు
  2. ఏపీ ఫైనాన్షియల్ కార్పొరేషన్ వివాదం
  3. పెండింగ్ విద్యుత్ బిల్లులు
  4. ఏపీ విభజన చట్టంలో చెప్పని కొన్ని ఆస్తుల పంపకాలు
  5. హైదరాబాద్‌లోని మూడు భవనాలను ఏపీకి కేటాయించే విషయంపై చర్చ
  6. ఇరు రాష్ట్రాల ఉద్యోగుల విభజన సమస్య
  7. లేబర్ సెస్ పంపకాలు
  8. విదేశీ రుణసాయంతో ఉమ్మడి రాష్ట్రంలో 15 ప్రాజెక్టులను నిర్మించారు. వాటి అప్పులపై చర్చ.
  9. ఏపీలో కలిపిన ఏడు మండలాల్లోని ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయటంపై చర్చ
  10. ఉమ్మడి సంస్థల ఖర్చులకు సంబంధించిన చెల్లింపులు

రేవంత్ బాగున్నావా..? 

ముఖ్యమంత్రుల భేటీ కోసం చంద్రబాబునాయుడు సాయం త్రం 6 గంటలకు ప్రజా భవన్‌కు చేరుకున్నారు. బాబుకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రు లు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ‘రేవంత్ బాగున్నావా?’ అంటూ చంద్రబాబు ఆప్యాయం గా పలకరించారు. అనంతరం చంద్రబాబును రేవంత్‌రెడ్డి సన్మానించి.. కాళోజీ రాసిన ‘నా గొడవ’ పుస్తకాన్ని అందజేశారు. ఆ తర్వాత చంద్రబాబు కూడా రేవంత్‌రెడ్డికి శాలువా కప్పి.. తిరుమల శ్రీవారి ప్రతిమతో పాటు ప్రసాదాన్ని అందజేశారు. ఆ తర్వాత ఇరు రాష్ట్రాల నేతల సమావేశం ప్రారంభమైంది.