calender_icon.png 26 December, 2024 | 6:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూసీ నిర్వాసితులపై కమిటీ

06-10-2024 12:44:13 AM

సెర్ప్ సీఈవో చైర్మన్‌గా 14 మంది సభ్యులతో ఏర్పాటు

నిర్వాసితులకు ఉపాధి.. విద్యార్థులకు సౌకర్యాలు

మహిళలకు నైపుణ్య శిక్షణ.. సంక్షేమ పథకాలు

వివిధ అంశాలపై ౩౦ రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక

ఆదేశాలు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్, అక్టోబర్ 5 (విజయక్రాంతి): మూసీ నది సుందరీకరణ పథకంలో భాగంగా నివాసాలు కోల్పోతున్న బాధితులకు మెరుగైన జీవనం కల్పించటంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. నిర్వాసితుల జీవనోపాధి కల్పించే అంశంపై సూచనలు చేసేందుకు శనివారం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.

ఈ కమిటీ చైర్మన్‌గా సెర్ప్ సీఈవోను నియమించారు. ఈ కమిటీలో 14 మందికి చోటు కల్పించారు. మూసీ నిర్వాసితులను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలన్న అంశంపై ప్రభుత్వానికి 30 రోజుల్లో ఈ కమిటీ నివేదిక అందించనుంది.

చైర్మన్‌గా సెర్ఫ్ సీఈవో, వైస్ చైర్మన్‌గా జీహెచ్‌ఎంసీ కమిషనర్, సభ్యులుగా టీ సీఈవో, మైనార్టీ వెల్ఫేర్ డైరెక్టర్, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్, ఎస్సీ వెల్ఫేర్ కమిషనర్, బీసీ వెల్ఫేర్ డైరెక్టర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్, వివిధ గురుకులాల కార్యదర్శులు, తెలంగాణ మైనార్టీ గురుకులాల ఎండీ అండ్ వైస్‌చైర్మన్‌లు ఉన్నారు.

మెంబర్ కన్వీనర్‌గా ఎంఆర్‌డీసీఎల్ జాయింట్ డైరెక్టర్‌ను నియమించారు. కమిటీ వివిధ అంశాలపై నివేదిక రూపొందించనుంది. నిర్వాసితుల కుటుంబాల్లోని ఆరేళ్లలోపు పిల్లలను గుర్తించి అంగన్‌వాడీ కేంద్రాల్లో ఏ విధంగా సర్దుబాటు చేయాలనే దానిపై మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులో పేర్కొన్నారు.

మెప్మా, స్వయం సహాయ సంఘాల సహకారంతో ఉపాధి అవకాశాలు దక్కేలా అవసరమైన నైపుణ్య శిక్షణను అందించాలని ప్రభుత్వం తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల సహకారంతో అర్హులైన వారికి వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనం కల్గించాలి.

ఆయా ప్రాంతాల్లో చదివే విద్యార్థులను విద్యాశాఖ అధికారులు గుర్తించి గురుకులాల్లో అడ్మిషన్లు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. ప్రజలతో ఈ కమిటీ సంప్రదింపులు జరిపి ఎలాంటి ఇబ్బందుల్లేకుండా జీవనోపాధి కల్పించేలా అన్ని రకాల చర్యలు తీసుకోనుంది.