04-04-2025 01:54:18 AM
సభ్యులుగా డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి
హైదరాబాద్, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా కంచ గచ్చి బౌలి పరిధిలోని 400 ఎకరాల భూవివాదంపై భారత అత్యున్నత న్యాయ స్థానం ఆదేశాల మేరకు రాష్ట్రప్రభుత్వం మంత్రుల కమిటీని నియమించింది. కమిటీ సభ్యులుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని ఎంపిక చేసింది.
ఈ మేరకు గురువారం రాత్రి డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువులోపు సమర్పిస్తామని స్పష్టం చేశారు. న్యాయస్థానాలపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, అంతిమంగా న్యాయమే గెలుస్తుందనే నమ్మకం తమకు ఉందని ప్రకటించారు.
మరోవైపు విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరించొద్దని ఇప్పటికే అదనపు డీజీ (ఇంటెలిజెన్స్), సైబరాబాద్ కమిషనర్లను ఆదేశించినట్లు తెలిపారు. తమ కమిటీ త్వరలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులతో పాటు అనేక ప్రజాసంఘాల సభ్యులతో సంప్రదింపులు జరుపుతుందని వెల్లడించారు.