ట్రావెర్నియా ఫెస్ట్‌లో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి
హైదరాబాద్, నవంబర్ 15 (విజయక్రాంతి): తెలంగాణ టూరిజం ప్రమోషన్ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్టు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. శుక్రవారం మాదాపూర్‌లోని హైటెక్స్‌లో జరిగిన ట్రావెర్నియా ఫెస్ట్‌ను మంత్రి ముఖ్యఅథితిగా హాజరై ప్రారంభించారు.
అనంతరం జూపల్లి మాట్లాడుతూ.. తెలంగాణలోని సాంస్కృతిక, వారసత్వ కట్టడాలు, చారిత్రక ప్రాంతాలను సందర్శించేలా విదేశీయులను ఆకర్షించేందుకు తమ ప్రజా ప్రభుత్వం కొత్త ఒడవడికి శ్రీకారం చుట్టబోతోందని చెప్పారు. ఇందుకోసం టూరిజం ప్రమోషన్‌పై దృష్టి పెట్టినట్టు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు.
పర్యాట కులతోపాటు జాతీయ, అంతర్జాతీయ సమావేశాలు, అధికారిక కార్యక్రమాలు, ఆయా పనుల నిమిత్తం వచ్చే వారిని ఆకర్షించేందుకు పలు పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించి.. టూరిస్టులే బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలని విజ్ఞప్తిచేశారు.
కార్యక్రమంలో యూఎన్ టూరిజం అంబాసిడర్ కార్ల్ జోషువా, చరిత్రకారుడు డాక్టర్ సిన్హారాజు తమ్మిట, ట్రావెర్నియా ఫెస్ట్ వ్యవస్థాపడుకు డాక్టర్ అంతోని విపిన్ దాస్‌తోపాటు రవాణా, ట్రావెల్ ఏజెన్సీ ప్రతినిధులు హాజరయ్యారు.