calender_icon.png 20 September, 2024 | 5:43 AM

జమిలి ఎన్నికల నిర్వహణ కోసం కమిటీ

20-09-2024 01:10:16 AM

వేర్వేరుగా ఎలక్షన్ల వల్ల ఖజానాపై ఆర్థిక భారం 

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విజయ క్రాంతి): జమిలీ ఎన్నికల నిర్వహణ కోసం కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. జమిలీ ఎన్నికలను ఇప్పు డు వ్యతిరేకిస్తున్న పార్టీలు త్వరలోనే దీనికి సహకరిస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. గురువారం జమిలీ ఎన్నికలపై ఆయన స్పందించారు.

దేశంలో పార్లమెంటు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించడం వల్ల  ఖజానాపై రూ.4,500 కోట్ల ఆర్థికంగా భారం పడుతోందని   పేర్కొ న్నారు. జమిలీ ఎన్నికలతో ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. పార్లమెంటు ఎన్నికల సమయంలో కేవలం జాతీయ సమస్యలపైనే చర్చ జరుగుతున్న మాట వాస్తవమన్నారు. జమిలీ ఎన్నికల ద్వారా.. జాతీయ అంశాలతోపాటుగా, ప్రాంతీయ సమస్యలపైన సమాన స్థాయిలో చర్చ జరు గుతుందన్నారు. అలాగే ప్రాంతీయ పార్టీలు కూడా ప్రభావం చూపిస్తాయన్నారు. 

అభివృద్ధి కోసమే..

2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలు నిర్వహించాలనుకోవడం మంచి పరిణామమని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా ఐదేళ్లపాటు ఏదో ఒకచోట ఎన్నికలు జరుగుతున్నందున కోడ్ అమల్లో ఉంటుందని, దీంతో సాధారణ నిర్ణయాలు కూడా తీసుకోలేని పరిస్థితి ఏర్పందన్నారు. వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించడంతో ఓటర్లలో ఎన్నికల ప్రక్రియ పట్ల నిరాసక్తత పెరిగిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.

ఈ సమస్యకు జమిలీ ఎన్నికల పరిష్కారాన్ని చూపుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. జమిలీ ఎన్నికల కారణంగా దేశంలో ద్రవ్యోల్బణంలో 1.1శాతం తగ్గుతుందని రామ్‌నాథ్ కోవింద్ కమిటీ సూచించిందని గుర్తు చేశారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే జీడీపీలో 1.5శాతం పెరుగుదల ఉంటుందని ఆ కమిటీ చెప్పినట్లు పేర్కొన్నారు. ఇలాంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, జమిలీ ఎన్నికల అవసరాన్ని గుర్తిస్తూ కోవింద్ నేతృత్వంలోని కమిటీ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందన్నారు.

ఎన్నికలపై దాదాపు 47 పార్టీల అభిప్రాయాలను కమిటీ తీసుకోగా 32 పార్టీలు జమిలీ ఎన్నికలకు సానుకూలంగా స్పందించాయని తెలిపారు. ఒకేసారి అసెంబ్లీ, పార్లమెంటుకు.. 100 రోజుల్లోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగాలని రామ్‌నాథ్ కోవింద్  కమిటీ సూచించిందని వివరించారు. గరిష్టంగా 6 నెలల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తయితే మిగిలిన సంవత్సరాలు దేశాభివృద్ధిపై దృష్టి సారించేందుకు వీలు కలుగుతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.