calender_icon.png 20 September, 2024 | 6:57 PM

కులగణనకు కట్టుబడి ఉన్నం

20-09-2024 01:25:45 AM

  1. సర్కార్‌కు కేటీఆర్ డెడ్‌లైనా!
  2. ఎస్‌కేఎస్ రిపోర్టు ఎక్కడుంది?
  3. బీఆర్‌ఎస్ అధ్యక్ష పదవిని బీసీలకు ఇవ్వాలె 
  4. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 

హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): కులగణనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. కులగణనపై బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ తమకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదని, సర్కార్‌కు డెడ్‌లైన్ పెట్టేంత సీను ఆయనకు లేదని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే నివేదిక ఎక్కడుందని నిలదీశారు.

గురువారం ఆయన సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కులగణన చేసి జనాభాలో ఎవరి వాటా ఎంతో తేల్చి అందుకు తగినట్టుగా నిధులు కేటాయించాలని రాహుల్‌గాంధీ సూచించారని పేర్కొన్నారు. దీంతో తమ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. బీఆర్‌ఎస్‌కు కులగణనపై అంత చిత్తశుద్ధి ఉంటే అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అమలు చేయలేదని ఆయన నిలదీశారు. బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ ఉన్నారని, ఈ మూడు పదవుల్లో ఒకటి ఇతరులకు ఇవ్వొచ్చు కదా అని ప్రశ్నించారు.

బీఆర్‌ఎస్ అధ్యక్ష పదవిని బీసీలకు కేటాయించాలని లేదంటే వర్కింగ్ పదవికి కేటీఆర్ రాజీనామా చేసి బీసీలకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్‌ను కాంగ్రెస్ పార్టీ నియమించిందని, మంత్రివర్గంలోనూ బీసీలకు మరింత ప్రాధాన్యత ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డినే స్వయంగా చెప్పారని ఆయన గుర్తు చేశారు. బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీకున్న చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరన్నారు. బీసీ జనాభా అధికంగా ఉందని సమగ్ర కుటుంబ సర్వేలో తేలడంతో ఆ నివేదికను బయటపెట్టలేదన్నారు.

ప్రజాపాలనను బీఆర్‌ఎస్‌లోని ఆ నలుగురు ఓర్వలేకపోతున్నారని ఆయన ఆరోపించారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా జీవోను తీసుకొచ్చిందని, బీఆర్‌ఎస్ హయాంలో గల్ఫ్ కార్మికులను పట్టించుకోలేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ విమర్శలు చేయడం సరికాదని, రాహుల్‌గాంధీని కాకా పట్టాల్సిన అవసరం లేదన్నారు. ఎన్టీఆర్ మెప్పుకోసం కేసీఆర్ తన కొడుకుకు తారక రామారావు అని పేరు పెట్టారన్నారు. చంద్రబాబు లేకపోతే కేసీఆర్ ఎక్కడ ఉండేవాడో ఓసారి గుర్తుంచుకోవాలని ఆయన హితవు పలికారు.