28-02-2025 12:46:16 AM
ఇటీవల ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించిన కమిషనర్
మేడ్చల్, ఫిబ్రవరి 27(విజయ క్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్న విషయాన్ని విజయ క్రాంతి దినపత్రిక వెలుగులోకి తీసుకురాగా, వాటిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం చేయడంతో పనులు పూర్తయ్యాయి. అవి అక్రమ నిర్మాణాలేనని కమిషనర్ ఇటీవల ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు.
అక్రమ నిర్మాణాలపై విజయ క్రాంతి దినపత్రికలో జూన్ 27న కమిష(న్) నర్ మేడలు శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన పురపాలక శాఖ జాయింట్ డైరెక్టర్ నారాయణరావు మేడ్చల్ అదనపు కలెక్టర్ పర్యవేక్షణలో విచారణ చేయాలని పీర్జాదిగూడ కమిషనర్ త్రిల్లేశ్వరరావు ను ఆదేశించారు.
దీనిపై కమిషనర్ ఇటీవల ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. సర్వే నంబర్ 42 లో 58, 59 ప్లాట్ లలో వేరువేరుగా ఇండ్ల నిర్మాణానికి అనుమతులు తీసుకొని సెట్ బ్యాక్ వదలకుండా రెండింటిని కలిపి కాంప్లెక్స్ నిర్మించారని కథనం ప్రచురితమైంది.
నిబంధనలకు విరుద్ధంగా ఒక అంతస్తు, టెంట్ హౌస్ అదనంగా నిర్మించారని, భవనాన్ని సీజ్ చేశామని, దీనిపై జూన్ 27న టాస్క్ ఫోర్స్ కు లేఖ రాశామని కమిషనర్ నివేదికలో పేర్కొన్నారు. ఫిర్జాదిగూడ పెద్ద చెరువులో బఫర్ జోన్లో సర్వే నెంబర్ 74,75 లో అపార్ట్మెంట్ నిర్మించారని, అనేక ఫిర్యాదులు రావడంతో అనుమతిపై సమీక్షించాలని హెచ్‌ఎండిఏ కమిషనర్ కు లేఖ రాశామని తెలిపారు. వరంగల్ రహదారిలో చెంగిచెర్ల క్రాస్ రోడ్ వద్ద రెండు అంతస్తులకు అనుమతి తీసుకుని ఐదు అంతస్తులు నిర్మించినందున నోటీసులు జారీ చేశామని తెలిపారు. దీనిపై కూడా తదుపరి చర్యలకు టాస్క్ ఫోర్స్ కు లేఖ రాశామన్నారు.