పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా కమీషనరేట్ పరేడ్ గ్రౌండ్ నందు
ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించిన కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి
కరీంనగర్, (విజయక్రాంతి): పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా కమీషనరేట్ పరేడ్ గ్రౌండ్ నందు మంగళవారం నాడు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించామని కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ లోని పలు పాఠశాలలు మరియు కళాశాలలకు చెందిన దాదాపు 1000 మంది విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. విద్యార్థుల సందర్శనార్ధం పోలీసు శాఖలోని వివిధ విభాగాల పనితీరును తెలిపే విధంగా పరేడ్ గ్రౌండ్ నందు పలు స్టాల్ లను ఏర్పాటు చేశామన్నారు.
వాటిల్లో పోలీసులు వాడే తుపాకుల ప్రదర్శన, పోలీసు జాగిలాల ప్రదర్శన, సైబర్ క్రైమ్, యాంటీ నార్కోటిక్ సెల్, షీ టీమ్, ట్రాఫిక్ పోలీసుల పనితీరు, అల్లరి మూకలను చెదరగొట్టుటకు వాడే స్మోక్ గన్ లు, వజ్ర వాహనాలను మరియు కమాండ్ కంట్రోల్ వాహనాలను ప్రదర్శన కొరకు ఉంచామని వాటన్నిటిపై విద్యార్థులకు అవగాహన కల్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (శాంతి భద్రతలు) ఎ. లక్ష్మీనారాయణ, అడిషనల్ డీసీపీ (ఏఆర్) అనోక్ జయ్ కుమార్ లతో పాటు ఏసీపీలు విజయ్ కుమార్, మాధవి, నరేందర్ రిజర్వు ఇన్స్పెక్టర్లు రజినీకాంత్, శ్రీధర్ రెడ్డి, కుమార స్వామి మరియు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.