calender_icon.png 28 September, 2024 | 6:49 AM

కాళేశ్వరం కార్పొరేషన్‌పై కమిషన్ ఆరా

28-09-2024 03:22:47 AM

ఈఎన్సీ హరిరామ్‌కు ఘోష్ కమిషన్ ౯౦ ప్రశ్నలు

రూ. 29,737 కోట్ల అప్పు తిరిగి చెల్లించాం

మెయింటనెన్స్ లేకనే మేడిగడ్డ బరాజ్ ప్రమాదం

కాళేశ్వరం ప్రాజెక్టు నష్ట లాభాల శాతం 1:1.511

కార్పొరేషన్ ద్వారా తీసుకొన్న అప్పు రూ.87 వేలకోట్లు

బ్యాంకులు వాస్తవంగా విడుదల చేసింది రూ.62.82 వేల కోట్లు

కమిషన్‌కు వివరించిన హరిరామ్.. నేడు కూడా విచారణ 

హైదరాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా బ్యాంకులకు వడ్డీ, అసలు కలిపి ఇప్పటివరకు రూ.29,737 కోట్లు తిరిగి చెల్లించినట్లు కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీ, గజ్వేల్ ఈఎన్సీ హరిరామ్ తెలిపారు. శుక్రవారం బీఆర్‌కే భవన్‌లో జరిగిన కాళేశ్వరం కమిషన్ విచారణకు ఆయన హాజరై కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

హరిరామ్‌కు కమిషన్ 90కి పైగా ప్రశ్నలు సంధించింది. ప్రాజెక్టు కోసం రూ.64 వేల కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించినట్లు ఆయన తెలిపారు. ఇందుకు కార్పొరేషన్ బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులతో చెలింపులు జరిపినట్లు వెల్లడించారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఆర్థిక అంశాల గురించి కమిషన్ హరిరామ్ ను ఆరా తీసింది. ఈ సందర్భంగా పలుమార్లు అప్పటి సీఎస్ ఎస్కే జోషి, ఈఎన్సీ మురళీధర్ పేర్లను ఆయన ప్రస్తావించారు.

కార్పొరేషన్ ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్‌ను ప్రభుత్వానికి అందించామని.. అది అసెంబ్లీ లో ప్రవేశపెట్టారా లేదా? అనేది తనకు తెలియదని హరిరామ్ చెప్పారు. మేడిగడ్డ బ్లాక్ డ్యామేజీకి బాధ్యులు ఎవరని హరిరామ్‌ను కమిషన్ ప్రశ్నించగా.. గేట్స్ ఆపరేషన్, మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడమే ప్రధాన కారణమని ఆయన తెలిపారు. 2017 నాటి ఉన్నతస్థాయి కమిటీ మినిట్స్‌ను కాళేశ్వరం సీఈ అనుసరించలేదని వివరించారు.

కార్పొరేషన్‌కు ఇప్పటివరకు సీఈవో లేరని హరిరా మ్ తెలుపగా.. కంపెనీల చట్టం మేరకు నియమించాలి కదా? అని కమిషన్ ప్రశ్నించింది. అప్పటి ప్రభుత్వం చెప్పటం వల్లే నియమించలేదని ఆయన తెలిపారు. కాళేశ్వరం బ్రెయి న్ చైల్డ్ ఎవరని హరిరామ్‌ను ఘోష్ ప్రశ్నించారు. ఇప్పటివరకు తీసుకున్న లోన్ల వివరా లను అడిగారు.

ప్రాజెక్టు నిర్మాణ సమయం లో వడ్డీతో కలిపి (ఇంట్రెస్ట్ డ్యూరింగ్ కన్‌స్ట్రక్షన్) రూ.87 వేల కోట్లను, ఐడీసీ లేకుండా రూ.74 వేల కోట్ల రుణాలు తీసుకోగా.. బ్యాంకులు రూ.62.82 వేల కోట్లను విడుద ల చేశాయని తెలిపారు. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారానే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కోసం రూ.7,145 కోట్లు రుణాలు తీసుకున్నామని హరిరామ్ చెప్పగా దీనివల్ల ఖజానాకు భారం పడుతుంది కదా? అని ఘోష్ ప్రశ్నించారు.

ప్రభుత్వ నిర్ణయం వల్లే పాలమూరును కాళేశ్వరంలో చేర్చినట్లు హరిరామ్ వెల్లడించారు. కాళేశ్వరం కాస్ట్ బెనిఫిట్ రేషియా 1:1.511 అని హరిరామ్ తెలిపారు. కార్పొరేషన్ అంతర్గత ఆడిట్‌కు ఏటా ఒక ఏజెన్సీని ప్రభుత్వం నియమించిందని చెప్పా రు. మూడు బరాజ్‌ల ఆలోచన ఎవరిది? కార్పొరేషన్‌ను ఎవరు ఏర్పాటు చేశారని కమిషన్ ప్రశ్నించగా.. మహారాష్ట్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడం వల్లే తమ్మిడిహట్టి నుంచి ప్రాజెక్టును మార్చామని..

రెండు రాష్ట్రాల సీఎంలు 2015లో భేటీఅయ్యాక మూడు బరాజ్‌ల ఆలోచన చేశారని, కార్పొరేషన్ ఏర్పాటు నిర్ణయం అప్పటి సీఎస్ జోషిదని హరిరామ్ వెల్లడించారు. శుక్రవా రం విచారణలో సమాధానం చెప్పని ప్రశ్నలకు శనివారం డాక్యుమెంట్లు సమర్పిస్తానని హరిరామ్ తెలిపారు. శనివారం కూడా ఆయన కమిషన్ ఎదుట హాజరవ్వనున్నారు.