- 5 క్యాటగిరీలుగా స్కూళ్లు, ఫీజుల విభజన
- ప్రతీ మూడేండ్ల బ్లాక్ పీరియడ్‌కు ఫీజులు ఖరారు
- తెలంగాణ విద్యాకమిషన్ నివేదిక అందజేత
- వచ్చే ఏడాది నుంచి అమలుకు చర్యలు
హైదరాబాద్, జనవరి 24 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూళ్లలో (ప్రైవేట్) ఫీజుల నియంత్రణపై తెలంగాణ విద్యాకమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి శుక్రవారం నివేదిక అందజేసింది. ఇందులో ఫీజుల నియంత్రణకు రెండు కమిషన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.
ఫీజుల నియంత్రణకు చట్టం రూపొందించాలని పేర్కొంది. జిల్లాస్థాయిలో కలెక్టర్, రాష్ట్రస్థాయిలో రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి లేదా హైకోర్టు జడ్జి నేతృత్వంలో ఫీజు రెగ్యులేటరీ కమిషన్లను ఏర్పాటు చేయాలని తెలిపింది. ప్రతీ మూడేండ్ల బ్లాక్ పీరియడ్‌కు ఈ కమిషన్లు ఫీజులను ఖరారు చేస్తాయి.
ఈ కమిషన్‌కు ‘తెలంగాణ ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ స్కూల్స్ ఫీజు రెగ్యులేటరీ కమిషన్’ పేరును ఖరారు చేశారు. రాష్ట్ర సచివాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ యోగితారాణాను కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, డాక్టర్ చారకొండ వెంకటేశ్, జ్యోత్స్నశివారెడ్డి కలిసి నివేదికను అందజేశారు.
ఐదు క్యాటగిరీలుగా..
నివేదికలో కమిషన్ పలు కీలక సూచనలు చేసింది. రాష్ట్రంలోని స్కూళ్లను మొత్తం ఐదు క్యాటగిరీలుగా విభజించాలని, వీటికి వేర్వేరు ఫీజులు ఖరారుచేయాలని సూచించింది. బడులను ఇంటర్నేషనల్, కార్పొరేట్, ప్రైవేట్, బడ్జెట్ ప్రైవేట్ స్కూళ్లు, గ్రామీణ స్కూళ్లుగా విభజించింది.
కేబినెట్ ఆమోదం తర్వాత అసెంబ్లీలో బిల్లు పెడతారు. ఆ తర్వాత చట్టంగా అమల్లోకి వస్తుంది. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి చట్టానికి రూపకల్పన చేసి కమిషన్లు ఏర్పాటు చేసే దిశలో విద్యాశాఖ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి.
సిఫార్సులివే..
* ఫీజు రెగ్యులేటరీ కమిషన్‌లో సభ్యులుగా పాఠశాల యాజమాన్యాల ప్రతినిధులు, రిటైర్డ్ ప్రొఫెసర్లు, విద్యావేత్తలు
* హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో పాఠశాలల ఫీజులను స్టేట్ ఫీజు రెగ్యులేటరీ కమిషన్ ఖరారుచేస్తుంది. మిగతా జిల్లాల్లో ఫీజల ఖరారు కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిషన్ చూస్తుంది.
* కమిషన్ ఖరారు చేసిన ఫీజులనే స్కూళ్లు వసూలు చేయాలి. ఫీజుల వివరాలను స్కూల్ వెబ్‌సైట్‌లో పొందుపరచాలి.
* ప్రతీ మూడేండ్లకోసారి పాఠశాలల నుంచి ప్రతిపాదనలు స్వీకరించి, ఆర్థిక నివేదికను ఆడిట్ చేయించి, ఆ తర్వాత ఫీజులను కమిషన్ సవరిస్తుంది. కనీస ఫీజును సైతం ఖరారు చేస్తారు.
* కమిషన్‌లో ఆడిటర్లు ఉంటారు. వారు అన్ని వివరాలను పరిగణనలోకి తీసుకుంటారు. కొన్ని స్కూళ్లు ఫారిన్ టీచర్లను నియమించుకున్నామని చెప్పి ఫీజులు లాగుతున్నారు. వీటన్నింటినీ కమిషన్ పరిశీలిస్తుంది.
* పాఠశాలల్లో పుస్తకాలు, బ్యాగులు, షూస్ వం టి వాటిని విక్రయించొద్దు. ఫలానా బుక్‌స్టా ళ్లో మాత్రమే కొనాలని షరతులు పెట్టొద్దు.
* ఫీజులపై ఫిర్యాదుల స్వీకరణకు గ్రీవెన్స్ సెల్‌ను ఏర్పాటు.
* ట్రాన్స్‌పోర్ట్ విషయంలో స్కూల్ బస్సులనే వాడాలని ఒత్తిడికి తీసుకురావొద్దు. తల్లిదండ్రులకే స్వేచ్ఛనివ్వాలి.