calender_icon.png 6 November, 2024 | 9:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫైనాన్స్ పంతుళ్లు?!

30-06-2024 01:28:52 AM

  • సైడ్ బిజినెస్‌లో సర్కారు సార్లు

వడ్డీలు, ప్లాట్ల బేరంలో మాస్టార్ల జోరు

ఎంఈవోలు, డిప్యూటీ డీఈవోల కొరత

అధికారులను మేనేజ్ చేస్తూ ప్రవృత్తి

పర్యవేక్షణ లేక ఉపాధ్యాయుల ఇష్టారాజ్యం

కామారెడ్డి, జూన్ 29 (విజయక్రాంతి): సమాజానికి మేలు చేయాల్సిన ఉపాధ్యాయుల్లో కొందరు ఆ వృత్తికే మచ్చగా మారారు.  పాఠశాలల్లో విద్యార్థులకు సరైన విద్య భోదన చేయకుండా సొంత దందాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. తరగతి గదుల్లో లెక్కలు చెప్పాల్సిన మాస్టార్లు ఫైనాన్స్ వ్యాపారంలో బారువడ్డీ లెక్కల్లో మునిగిపోయారు. పాఠాలు బోధించాల్సిన పంతులు ప్లాట్ల బేరాన్ని ప్రవృత్తిగా మార్చుకున్నారు. కామారెడ్డి జిల్లాలో 1,244 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ప్రైమరీ పాఠశాలలు 711,  ప్రాథమికోన్నత పాఠశాలలు 210, ఉన్నత పాఠశాలలు 323 ఉన్నాయి. మొత్తం 1,59,620 మంది విద్యార్థులు చదువుతున్నారు.

వీరికి 4,943 మంది ఉపాధ్యాయులు అవసరం ఉండగా 4,076 మంది పనిచేస్తున్నారు. 867 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్నవారిలోనూ సగానికిపైగా సైడ్ బిజినెస్‌ల్లోనే బిజీగా గడుపుతు న్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా కేంద్రంతో పాటు బిచ్కుంద, జుక్కల్, మద్నూర్, పిట్లం, మాచారెడ్డి, రాజంపేట్, లింగంపేట్, నాగిరెడ్డిపేట్, గాంధారి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, సదాశివనగర్ ఏరియాల్లో పనిచేసే ఉపాధ్యాయులు కొందరు ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ దందాలకు అలవాటుపడినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు చర్చించుకుం టున్నారు.

ఒకవేళ విధులకు హాజరైనా.. పాఠాలను పక్కన పెట్టి ఫోన్లలోనే ప్లాట్ల బేరాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. యూని యన్ నాయకులు గా చెప్పుకుంటూ వ్యాపారాల్లో మకుటం లేని మహారాజులుగా చలామణి అవుతున్నారని సహ ఉపాధ్యాయులే మండిపడుతున్నారు. సమాయానికి బడికి రాకుండా బిజినెస్‌లో తలమునకలవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. 

పెద్ద సార్లకు దావత్‌లు..

ఇదంతా తెలిసిన ఉన్నతాధికారులు నోరు మెదపకుండా ఉండడానికి వీకెండ్ పార్టీలతో వారిని బుట్టలో వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, వీరి పేరిట ఒక లీవ్ లెటర్‌లో రిజిస్టర్‌లో భద్ర పరిచి ఉంటుందని విశ్వసనీయ సమాచారం. సడెన్‌గా జిల్లా ఉన్నతాధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు ఆ లీవ్ లెటర్ ముందు పెడతారని, ఇందుకు ప్రధానోపాధ్యాయులకు వీకెండ్ పార్టీలు ఆరేంజ్‌మెంట్లు ఉంటాయని తెలుస్తోంది. మారుమూల మండలాలు, గ్రామాల్లో పనిచేసే ఉపాధ్యాయులు మరీ ఈ రకమైన అక్రమాలకు పాల్పడుతున్నట్లు స్కూల్ కమిటీలు బహిరంగంగానే విమర్శిస్తున్నాయి. 

ఎంఈవోలు ఏరి..?

జిల్లాలో 22 మండలాలు ఉండగా కేవలం ఆరుగురు ఎంఈవోలు మాత్రమే ఉన్నారు. డిప్యూటీ డీఈవోలు ఇద్దరే ఉన్నారు. డీఈవో సైతం ఇన్‌చార్జే. దీంతో పాఠశాలలపై పర్యవేక్షణ కొరవడి ‘పైనాన్స్ పంతుళ్లు’ తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. కుదిరితే ఫైనాన్స్.. లేదంటే ప్లాట్ల బేరంలో రాజ్యమేలుతున్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. మరికొందరు పం తుళ్ల పేకాటకు కూడా తెగబడిపోయారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.   కొన్ని పాఠశాలల్లో బయోమెట్రిక్ వ్యవస్థ ఉన్నా వాటిలో ఏవో పుల్లలు పెట్టి మరమ్మతుల పేరిట పక్కన పడేసి, దర్జాగా జల్సా చేస్తున్నట్లు విమర్శలు లేకపోలేదు. 

సైడ్ బిజినెస్ సార్లపై చర్యలు తీసుకోవాలి

లక్షల రూపాయల వేతనం తీసుకుంటూ పాఠశాలలకు రాకుండా సొంత వ్యాపారాలు చేస్తున్న ఉపాధ్యాయులు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలి. అలాంటి వారిని తల్లిదండ్రులు గుర్తించి ఉన్నతాధికారులు ఫిర్యాదుల చేయాలి. వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి.

 బాలు, టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకుడు

డుమ్మాకొడితే చర్యలు తప్పవు

టీచర్లు ఎవరైనా అదే పనిగా బడులకు డుమ్మా కొడితే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చర్య లు తీసుకుంటాం. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అం దించాలనే ఉద్దేశంతో 300 పాఠశాలలో కార్పొరేట్ స్థాయిలో మౌలిక వసతులు కల్పించాం. ఉపాధ్యాయుల తీరును అమ్మ ఆదర్శ కమిటీలు పర్యవేక్షిస్తాయి. 

 రాజు, డీఈఓ, కామారెడ్డి