25-03-2025 12:47:39 AM
మాజీ మేయర్ యాదగిరి సునీల్‌రావు
కరీంనగర్, మార్చి 24 (విజయ క్రాంతి): బీఆర్‌ఎస్ పార్టీ సన్నాహాక సమావేశం ఓదార్పు సమావేశంగా మారిందని మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన కరీంనగర్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సమావేశం పెడితే అభ్యంతరం లేదని, కానీ సభలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు కావని, రేషన్ బియ్యం తెచ్చి అక్షింతల పేరుతో పంచి ప్రజలను మోసం చేశారని కేటీఆర్ వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఒక వర్గం ఓట్ల కోసం, మద్దతు కోసం యావత్తు హిందూ సమాజాన్ని కించపరచడం శోచనీయమన్నారు. హిందువుల మనోభావాలను కించపరిస్తే హిందూ సమాజం అంతా ఏకమౌతుందని హెచ్చరించారు.
ఎన్నికల సందర్భాల్లో తగిన రీతిలో బుద్ధిచెప్పినప్పటికీ బీఆర్‌ఎస్ తీరు మారడం లేదన్నారు. అయోధ్యలో గుడి నిర్మాణం హిందు ప్రజల చిరకాల వాంఛ అని, అది నెరవేర్చిన ఘనత బీజేపీ పార్టీ, నరేంద్ర మోడీడేనని అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్కు అభివృద్ధి అంటే తెలియదని విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. గంగుల కమలాకర్ గుడి నిర్మాణం చేశారని గొప్పలు చెప్పడం హాస్యాస్పదమన్నారు. గుడి పేరుతో పునాది వేశారు తప్ప ఇటుకపెళ్ల కూడా పెట్టని ఘనత అప్పటి మీ ప్రభుత్వానికిది, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానిదని అన్నారు.
రాజకీయంగా ఎలాంటి పదవి లేని సమయంలో నగరంలో మహాశక్తి ఆలయ నిర్మాణం చేసిన ఘనత బండి సంజయ్ కుమార్ దని అన్నారు. జిల్లాలో బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో చాలా అభివృద్ధి పనులు దిగ్విజయంగా కొనసాగుతున్నాయని అన్నారు. కరీంనగర్కు స్మార్ట్ సిటీ హోదా ఎలా వచ్చిందనే విషయం పురపాలక శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ కు తెలియకపోవడం మూర్ఖత్వమని అన్నారు. అయోధ్య లేదు.. అక్షింతలు లేవు అంతా డ్రామా అని వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు.