calender_icon.png 22 October, 2024 | 9:09 PM

కమాండర్ రాధిక!

18-06-2024 12:05:00 AM

హిమచల్‌ప్రదేశ్‌లో జన్మించిన రాధికా సేన్ తొలుత బయోటెక్నాలజీలో ఇంజినీరింగ్ వృత్తిలో కొనసాగించారు. అయితే ఆమె బొంబాయిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేస్తుండగానే ఇండియన్ ఆర్మీలో చేరారు. అలా సేన్ 2023లో  ఐక్యరాజ్య సమితి తరపున కాంగోకి శాంతి పరిరక్షకురాలిగా నియమితులయ్యారు. దాదాపు ఏడాది పాటు కాంగోలో తన సేవలందించారు. ఆ తర్వాత ఆమె ఏప్రిల్ 2024 వరకు ఇండియన్ రాపిడ్ డిప్లాయ్‌మెంట్ బెటాలియన్‌తో ఎంగేజ్‌మెంట్ ప్లాటూన్ కమాండర్‌గా కూడా పనిచేశారు. 

హింసకు వ్యతిరేకంగా..

ఆయుధాన్ని చేత పట్టుకొని శాంతి కోసం ప్రయత్నించడం ఒక జటిలమైన పని. అంతర్యుద్ధం జరిగే దేశాల్లో బయటి దేశాల నుంచి వెళ్లి ఈ పని చేయాలంటే ప్రాణాలతో చెలగాటం. కాని ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని శాంతి పరిరక్షక దళం ఆయా దేశాలలో శాంతి కోసం పోరాటం చేస్తూ ఉంటుంది. ప్రాణాలకు తెగిస్తూనే ఉంటుంది. అందుకే ఈ శాంతి దళాలలో గొప్పగా పని చేసిన వారికి ఐక్యరాజ్యసమితి వివిధ విభాగాలలో అవార్డులు ఇస్తుంటుంది. లింగ వివక్ష, మహిళలపై హింసను సమర్థంగా నియంత్రించడానికి పని 

చేసే వారికి ‘మిలటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్’ ఇస్తోంది. 2023 సంవత్సరానికి ఆ అవార్డు ఆర్మీ మేజర్ రాధికా సేన్‌కు దక్కింది.  ప్రతిష్ఠాత్మకమైన ఈ అవార్డు కాంగోలో స్త్రీలు, బాలికల పట్ల జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా రాధికా సేన్ చేసిన శాంతి ప్రచారానికి నిదర్శనం.

కాంగోలో ఘోరాలు..

మధ్య ఆఫ్రికాలో రెండు కాంగోలు ఉన్నాయి. ఒకటి ‘రిపబ్లిక్ ఆఫ్ కాంగో’ (ఆర్‌ఓసి), రెండు ‘డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో’ (డిఆర్‌సి). ఆఫ్రికాలో రెండవ అతి పెద్ద దేశం డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఒకప్పుడు బెల్జియం వలసగా ఉన్న ఈ దేశం తర్వాత స్వాతంత్య్రం పొందింది. ‘మొబుతు’ అనే నియంత పాలనలో మగ్గింది. అతన్ని ప్రజలు అధికారం నుంచి దించేశాక 1998 నుంచి అక్కడ అస్థిర పాలన కొనసాగుతూ ఉంది. తరచూ అంతర్యుద్ధాలు చోటు చేసుకుంటున్నాయి.

ముఖ్యంగా ఆ దేశ తూర్పు ప్రాంతాలైన ఇటురి, నార్త్ కీవోలలో రెండు సాయుధ దళాల వల్ల దాడులు జరుగుతున్నాయి. ‘ఎయిడెడ్ డెమొక్రటిక్ ఫోర్సెన్’ అనే గ్రూప్, ‘హుతూస్’ అనే మరో గ్రూప్ తమ ఆధిపత్యం కోసం తీవ్ర హింసకు పాల్పడుతున్నది. ఈ రెండు గ్రూపుల మధ్య సామాన్య జనం నలుగుతున్నారు. వీరిని అదుపు చేయడానికి వచ్చే సైన్యం వీరి కంటే ఎక్కువ హింసకు గురవుతున్నారు. వీటన్నింటి మధ్య కనీస ఓదార్పుగా ఐక్యరాజ్యసమితి శాంతి దళాలు పని చేస్తున్నాయి. 

అత్యాచార పర్వం..

ఇప్పటి వరకు రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని దాదాపు 30 లక్షల మంది స్త్రీలు, బాలికలు ఏదో ఒక మేర హింసకు, లైంగిక హింసకు లోనయ్యారు. అర్ధరాత్రి అపరాత్రి ప్రత్యర్థి గ్రూపులు దాడి చేసి స్త్రీలు, బాలికల మీద అత్యాచారాలు చేసి మగవారిని చంపేసి పోతారు. ఇవి అక్కడ స్త్రీల మీద తీవ్రమైన మానసిక ప్రభావాన్ని చూపిస్తాయి. అత్యాచారాల వల్ల వారిలో చాలామంది హెచ్.ఐ.వి/ఎయిడ్స్ బారిన పడుతున్నారు. అక్కడి చిన్నపిల్లలైతే దారుణమైన ఆకలిని ఎదుర్కొంటున్నారు. పౌష్టికాహారం ఊసే లేదు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని బాధిత స్త్రీలలో విశ్వాసం నింపింది రాధికా సేన్.

బాధితుల కోసం..

కాంగోలొ కమాండర్‌గా పని చేసింది. అక్కడ మొదటగా ఆమె చేసిన పని తన బెటాలియన్‌కు కాంగో సంస్కృతిని పరిచయం చేయడం. స్త్రీల పట్ల ఎలా మెలగాలో తెలియచేయడం. వారిలో ఆత్మవిశ్వాసం ఎలా కలిగించాలో నేర్పించేది. అక్కడ స్త్రీల కోసం హెల్త్ ఎడ్యుకేషన్, ఉపాధి, లింగ సమానత్వం, కుటుంబ నిర్ణయాల్లో స్త్రీల ప్రాధాన్యం వంటి అంశాలలో రాధికా సేన్ వర్క్‌షాప్‌లు నిర్వహించింది. భర్తలను, పిల్లలను కోల్పోయిన స్త్రీలలో ఆత్మవిశ్వాసం నింపేలా వారితో తరచూ ఆమె వారితో మాట్లాడూ  ఉండేది.

వారు మళ్లీ పనిలో పడేలా చూసేది. హింసను సమిష్టిగా ఎలా ఎదుర్కొనాలో అవగాహన కల్పించేది. అలా రాధికను కాంగో మహిళలు తమలోని మనిషిగా చూశారు. వారి ముఖాల్లో చిరునవ్వులు వచ్చాయి. అందుకే ఐక్యరాజ్యసమితి సెక్రెటరి జనరల్ ఆంటోనియో గుటెరస్ రాధికా సేన్‌కు అవార్డు ప్రకటిస్తూ ‘రాధికా సేన్ కాంగో మహిళలను గొంతెత్తేలా చేయగలిగింది. శాంతి కోసం వారు ముందుకొచ్చేలా కృషి చేసింది’ అని మెచ్చుకున్నారు.

ఆమె గురించి..

  1. మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్న రెండవ భారతీయ శాంతి పరిరక్షకురాలు రాధికా సేన్. సేన్ కంటే ముందు మేజర్ సుమన్ గవానీ దక్షిణ సూడాన్‌లోని యూఎన్ మిషన్‌తో ఆమె చేసిన సేవకు ఇలాంటి గుర్తింపునే పొందారు. 2019లో మేజర్ సుమన్‌కి ఈ అత్యున్నత గౌరవం లభించింది. 
  2. యూఎన్ శాంతి పరిరక్షక కార్యకలాపాల్లో సేన్ ‘యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ స్టెబిలైజేషన్ మిషన్ ఇన్ ది డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో’ తరపున దాదాపు 1,954 మంది వ్యక్తులతో కలిసి పని చేశారు. వారిలో 32 మందికి పైగా మహిళలు ఉండటం విశేషం. రాధికా పని బాధిత మహిళలను ఏకం చేయడం.. సమస్యలు చర్చించడం, సురక్షితమైన ప్రదేశాలుగా మార్చడం.
  3. యూఎన్ ప్రకారం.. సేన్ లింగ సమానత్వంపై దృష్టి సారించి తూర్పు డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (డీఆర్‌సీ)లో శాంతి పరిరక్షక ప్రయత్నాలకు నాయకత్వం వహించారు. ఆమె అక్కడి స్త్రీలకు సహాయం చేస్తూ.. కమ్యూనిటీ అలర్ట్ నెట్‌వర్క్‌లను కూడా స్థాపించారు.