ప్రజాసేవ కోసమే రాజకీయాలకు వస్తున్నా
పట్టభద్రులకు న్యాయం జరిగేలా పనిచేస్తా
కాంగ్రెస్ పార్టీ టికెట్ వస్తుందని ఆశిస్తున్నా
ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి
హుజురాబాద్, విజయక్రాంతి: రాబోయే పట్టబద్దుల ఎన్నికల్లో తనకు పట్టభద్రులు అవకాశం కల్పించి గెలిపిస్తే సేవచేసి చూపిస్తానని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. శనివారం హుజరాబాద్ లోని ఆల్ఫోర్స్ పాఠశాలలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టభద్రుల ఎన్నికల కోసం ఓటర్ల ఎన్రోల్ కార్యక్రమం మొదలుపెట్టానని, డిగ్రీ పూర్తి చేసి మూడు సంవత్సరాలు గడిచిన పట్టబద్రులందరూ ఓటు నమోదు చేసుకోవాలన్నారు. గతంలో ఓట్లు ఉన్న అభ్యర్థి కూడా మరోసారి ఓటు నమోదు చేసుకోవాలన్నారు.
నాలుగు జిల్లాల్లో సుమారు 20 లక్షల మంది పట్టబద్రులు ఉన్నారని, వారందరి అభివృద్ధి కోసం తాను గెలిచిన తర్వాత వారి శ్రేయస్సు కోసం కృషి చేస్తానన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్ ను చూసి ఆకర్షితునుడై కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నానని అన్నారు. యుపిఎస్సి తరహాలోనే టీపీఎస్సీలో కూడా ఖచ్చితమైన జాబ్ క్యాలెండర్ అమలయ్యేలా చూస్తానన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు కూడా పెండింగ్లో ఉన్న డిఏ గురించి మాట్లాడి అమలయ్యేలా చూస్తానని, ప్రైవేట్ ఉద్యోగులకు కూడా 12 నెలల జీతం ఇచ్చేలా యాజమాన్యాలతో చర్చిస్తానన్నారు. ప్రైవేట్ ఉద్యోగులందరికీ ఆరోగ్య భరోసా ఇప్పించడానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. బకాయిలో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను కూడా ఇప్పించేలా ముఖ్యమంత్రితో మాట్లాడతానని అన్నారు. దీంతోపాటు తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలో యూనివర్సిటీల భూములు కబ్జాకు గురయ్యాయని వాటన్నిటిని హైడ్రాతరహాలో తిరిగి తీసుకువచ్చేలా కృషి చేస్తానన్నారు.