calender_icon.png 28 September, 2024 | 4:53 AM

పెట్టుబడులతో రండి

28-09-2024 02:53:20 AM

  1. గ్లోబల్ సిటీ హైదరాబాద్‌లో అపార అవకాశాలు 
  2. మైన్ ఎక్స్ పో ఇంటర్నేషనల్ సదస్సులో భట్టి విక్రమార్క

హైదరాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న హైదరాబాద్‌లో మానవ వనరులకు కొదవలేదని, పర్యావరణహిత పునరుత్పాదక ఎనర్జీ, గ్రీన్ టెక్నాలజీలకు, సంబంధిత పరిశ్రమలకు నగరంలో అవకాశాలు మెండుగా ఉన్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

అమెరికాలోని లాస్ వెగాస్‌లో జరుగుతున్న మైన్ ఎక్స్ పో 2024 అంతర్జాతీయ సదస్సులో ఆయన గురువారం నాడు వ్యాపార దిగ్గజ కంపెనీల ప్రతినిధులు, ప్రముఖ అమెరికన్ కంపెనీల ప్రతినిథుల సమావేశాల్లో మాట్లాడారు. ఐటీ, పునరుత్పాదక విద్యుత్, వస్తు ఉత్పత్తిలో ఎంతో ముందు చూపుతో పురోగమిస్తున్న తెలంగాణ రాష్ర్టం అమెరికన్ కంపెనీల భాగస్వామ్యాన్ని కోరుతోందని తెలిపారు.

పెట్టుబడులతో తరలిరావాలని పిలుపునిచ్చారు. దిగ్గజ కంపెనీలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఫేస్ బుక్, ఆపిల్ సంస్థలు హైదరాబాద్‌ను తమ స్వస్థలంగా భావిస్తూ.. వ్యాపారాలు నిర్వహిస్తున్నాయని.. తద్వారా హైదరాబాద్ గ్లోబల్ ఐటీ కేంద్రంగా, ఇన్నోవేషన్ హబ్‌గా రూపుదిద్దుకున్నదని వివరించారు.

హైదరాబాద్ టెక్నాలజీ హబ్ గానే కాకుండా ఫార్మాసిటీ రంగంలో గ్లోబల్ లీడర్‌గా ఉందని డిప్యూటీ సీఎం వివరించారు. ఐటీ అభివృద్ధిలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంతో హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ ఆవిష్కరణ జరుగుతోందని అన్నారు. సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్, స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ అధికారులు పాల్గొన్నారు. 

డోపల్ మేర్ కంపెనీ స్టాల్ సందర్శన

మైన్ ఎక్స్ పోలో భాగంగా ఆస్ట్రేలియాకు చెందిన డోపల్ మేర్ కంపెనీ స్టాల్‌ను డిప్యూటీ సీఎం సందర్శించారు. ఈ కంపెనీ రూపొందించిన అత్యాధునిక బొగ్గు, ఓవర్ బర్డెన్ రవాణా బెల్టులు, వాటి పనితీరును పరిశీలించారు.