calender_icon.png 8 January, 2025 | 12:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరంగల్ సభకు రండి

23-07-2024 12:53:35 AM

  1. రాహుల్‌కు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ ఆహ్వానం 
  2. ఏఐసీసీ ఛీఫ్ ఖర్గే, ప్రియాంకతోనూ భేటీ
  3. నూతన పీసీసీ చీఫ్, మంత్రివర్గ విస్తరణపైన పార్టీ నేతలతో చర్చ

హైదరాబాద్, జూలై 2౨ ( విజయక్రాంతి):  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రెండో రోజు బిజీబిజీగా కొనసాగింది. ఏఐసీసీ అధ్య క్షుడు మల్లిఖార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలతో భేటీ కావడంతోపాటు రాష్ట్రాభివృద్ధికి గాను వివిధ ప్రాజెక్టులకు ప్రత్యేక నిధుల కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,  మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ అగ్రనేతలతో జరిగిన భేటీలో వరంగల్‌లో నిర్వహించే రైతు కృతజ్ఞత సభ, మంత్రివర్గ విస్తరణతో పాటు కొత్త పీసీసీ అధ్యక్షుడి అంశం కూడా చర్చకు వచ్చినట్లుగా తెలిసింది. 

అసెంబ్లీ ఎన్నికల ముందు రైతాంగానికి వరంగల్ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల రుణమాఫీ, మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పథకం కింద రూ.10 లక్షల వరకు అమలు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500 గ్యాస్ సబ్సిడీని  అమలుచేస్తున్నట్టు రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంకగాంధీలకు సీఎం రేవం త్‌రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ,  డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ వివరించారు. రుణమాఫీని అమలుచేస్తున్న  నేపథ్యంలో వరంగల్‌లో నిర్వహించే కృతజ్ఞత సభకు హాజరుకావాలని రాహుల్‌గాంధీకి  ఆహ్వానం అందించారు. పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతుండటంతో.. ఆయన సభకు సంబంధించి తేదీపై న స్పష్టత ఇవ్వలేదని సమాచారం.

రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15లోగా రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని కృతనిశ్చయంతో ఉన్నది. మొదటి విడతగా ఇప్పటికే రూ.1 లక్ష వరకు రుణమాఫీ చేసింది. ఈ నెలాఖరులోగా రెండో విడత రూ. 1.50 లక్ష వరకు  రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.  ఆలోపే వరంగల్‌లో రైతు కృతజ్ఞత  సభను వరంగల్‌లో నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు.  సీఎం రేవంత్‌రెడ్డి  ఆగస్టు 3న అమెరికాకు వెళ్లనున్నారు. ఒక వేళ రాహుల్‌గాంధీ సమయం  ఇస్తే వరంగల్‌లో రైతు కృతజ్ఞత సభ ఆగస్టు 3లోపే  ఉంటుందని, లేదంటే సీఎం అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత నిర్వహించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంగళవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటడంతో..  సీఎంతో పాటు మంత్రులు సోమవారం రాత్రి  హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు.