calender_icon.png 24 January, 2025 | 2:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొలిక్కి వచ్చేనా!

03-07-2024 01:06:11 AM

తెలంగాణ ప్రాజెక్టులపై కేసులు 

ఆస్తుల్లో వాటాలపై ఏపీ పేచీలు

భవనాలపై ఆంధ్రా సర్కారు పట్టు

ఆస్తులు, అప్పులపై చర్చించే ఛాన్స్

గురుశిష్యుల భేటీపై పెరిగిన ఆసక్తి

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 2 (విజయక్రాంతి): ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన పదేండ్ల తర్వాత రాష్ట్ర విభజన అంశాలపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మళ్లీ చర్చ మొదలైంది. తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో జరిగిన ఒప్పందం ప్రకారం 2024 జూన్ 2 నాటికి ఉమ్మడి రాజధాని ఒప్పందం గడువు ముగిసింది. అయితే 2017లో కేసీఆర్, చంద్రబాబు సీఎంలుగా ఉన్నప్పుడు విభజన ఒప్పందాలపై చర్చించేందుకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసి రాజ్ భవన్ వేదికగా గవర్నర్ నరసింహన్ సమక్షంలో సమావేశం నిర్వహించారు.

ఆ సమావేశంలో 9వ షెడ్యూల్‌కు సంబంధించిన ఎనిమిది కుల సంఘాల సంస్థల విభజనకు మంత్రుల కమిటీ ఆమోదం తెలిపింది. అనంతరం జరిగిన అనేక రాజకీయ పరిణామాల నేపథ్యంలో విభజన ఒప్పందాలపై మళ్లీ మంత్రుల కమిటీ సమావేశం జరగలేదు. కొన్ని అంశాలపై అప్పుడప్పుడు ఇరు రాష్ట్రాల సీఎస్‌లు, అధికారుల బృందం సమావేశం నిర్వహించారు. కానీ అనేక అంశాలపై ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. తాజాగా విభజన ఒప్పందాలపై జరుగనున్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

రాష్ట్ర విభజన సమయంలో ఒకే పార్టీలో గురు శిశ్యులుగా ఉన్న చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన విభజన అంశాలతో పాటు ఆస్తులు, అప్పులు, భవనాల అప్పగింత, 9, 10వ షెడ్యూల్, హౌజింగ్, ఆర్టీసీ, ప్రాజెక్టులపై కేసులు, 11వ షెడ్యూల్‌లోని హంద్రీ నీవా, గాలేరు నగరి, వెలుగొండ, తెలుగు గంగ, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులు, రాష్ట్రం వెలుపల ఉన్న ఆస్తుల్లో 58:42 నిష్పత్తిలో పంపకాలు వంటి అనేక అంశాలు నేటికి అపరిష్కృతంగానే ఉన్నాయి.  

ఆస్తుల్లో వాటాలపై పేచీ పెడుతున్న ఏపీ

సంస్థల విషయంలో 2014 జూన్ 2వ తేదీ నాటికి ఉన్న నగదును పంచుకోవాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇరు రాష్ట్రాలకు సూచించింది. కానీ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం  2014 ప్రకారం 10వ షెడ్యూల్ సంస్థల ఆస్తులు ఎక్కడివి అక్కడే ఉంచి, ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తి చేసుకోవాలని పేర్కొంది. కానీ, ఏపీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ విభజన చట్టానికి విరుద్ధంగా ఆ ఆస్తుల విభజన జరగాలని డిమాండ్ చేయడంతో సమస్య కూడా అలాగే ఉండిపోయింది.

అలాగే 9వ షెడ్యూల్‌లోని దిల్, ఆర్టీసీ, హౌజింగ్ కార్పొరేషన్, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లాంటి సంస్థలకు హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వేల కోట్ల ఆస్తులున్నాయి. దిల్ సంస్థకు 5 వేల ఎకరాలుండగా, ఎస్‌ఎఫ్‌సీకి 400 ఎకరాలు, హౌజింగ్, ఆర్టీసీ సంస్థలకు రాష్ర్టవ్యాప్తంగా వేల కోట్ల విలువైన భూములు, ఆస్తులున్నాయి. ఈ ఆస్తుల్లోనూ వాటా ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నాటి నుంచి పేచీ పెడుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం ఇందుకు అంగీకరించలేదు. రాష్ర్టం వెలుపల ఆస్తులను 58:42 నిష్పత్తిలో పంచుకోవాలని విభజన చట్టంలో పేర్కొన్నారు. అదే విధంగా కొన్ని స్థాయిల్లోని ఉద్యోగుల విభజన అంశం సైతం నేటికీ పెండింగ్‌లోనే ఉంది. 

సాగునీటి ప్రాజెక్టులపై కేసులు

కృష్ణా, గోదావరి నదులపై నిర్మిస్తున్న ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పరస్పరం ఆయా బోర్డులకు ఆది నుంచి ఫిర్యాదులు చేస్తున్నాయి. విభజన చట్టానికి విరుద్ధంగా రాయలసీమ పంపింగ్ స్కీం, పోతిరెడ్డిపాడు కాలువ వెడల్పు పథకాలను ఆంధ్రప్రదేశ్ చేపట్టిందని కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం గతంలో ఫిర్యాదు చేసింది. ఈ విషయమై సుప్రీం కోర్టు, తెలంగాణ హైకోర్టులోనూ, హరిత ట్రిబ్యునల్‌లోనూ తెలంగాణ ప్రభుత్వం కేసు వేసింది.

కృష్ణా బోర్డు అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా విభజన చట్టానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదిపై పాలమూరు- రంగారెడ్డి, డిండి, భక్త రామదాసు, మిషన్ భగీరథ, తుమ్మిళ్ల ఎత్తిపోతల ప్రాజెక్టులు నిర్మిస్తోందని, గోదావరి నదిపై కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల పథకం, పెన్‌గంగపై నాలుగు ప్రాజెక్టులతో పాటు అనేక ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తుందని కృష్ణా, గోదావరి బోర్డులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చలు జరిపి నిర్ణయించేవరకు కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టులు నిర్మించవద్దని, కొత్త ప్రాజెక్టులకు డీపీఆర్‌లను సమర్పించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు కృష్ణ, గోదావరి బోర్డులు లేఖలు రాశాయి.

ఈ సమస్యను అపెక్స్ కౌన్సిల్లో పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాని ఫలితంగా 2016 సెప్టెంబర్ 21న ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగినప్పటికీ ఈ కేసుల అంశం ఓ కొలిక్కి రాలేదు. విభజన చట్టం ప్రకారం 11వ షెడ్యూల్లోని హంద్రీనీవా, గాలేరు-నగరి, వెలుగొండ, తెలుగు గంగ, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులను పూర్తిచేసి ఆ సాగు/తాగు నీటి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చలు జరిపి ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న నదీ జలాల సమస్యలను అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పరిష్కరించే బాధ్యత కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలని ఇరు రాష్ట్రాల ప్రజలు కోరుతున్నారు. 

ఆ భవనాలపై పట్టువీడని ఏపీ

పంజాగుట్ట, ఎర్రమంజిల్, పాటిగడ్డ, కుందన్ బాగ్, మలక్‌పేట, మాద న్నపేటలో ప్రభుత్వ ఉద్యోగుల నివాస గృహాల సముదాయాలున్నాయి. ఇవికాక అంబర్‌పేట పోలీస్‌లేన్, మొయినా బాద్‌లో గ్రేహౌండ్స్ క్వార్టర్స్ ఉన్నాయి. అన్నీ కలిపి 700 నుంచి 800ల గృహా లు ఉంటాయని అంచనా. 2019లో వీటి అప్పగింత కోసం అప్పటి గవర్నర్ నరసింహన్ సమక్షంలో ఒక ప్రయత్నం జరిగినా, ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని భవనాల అప్పగింతకు ఒప్పుకోని కారణంగా ఆ ప్రయత్నం వికటించింది.

అలాగే హైదరాబాద్‌లోని ముఖ్యమైన మాసబ్ ట్యాంకులోని సీఐడీ బంగ్లా, ఖైరతాబాద్‌లోని లేక్‌వ్యూ గెస్ట్‌హౌజ్, ఆదర్శనగర్‌లోని హెరిటేజ్ బిల్డింగ్‌లను అప్పగించడానికి సైతం ఏపీ ప్రభుత్వం ససేమిరా అంటున్నట్లు తెలంగాణ సచివాలయ వర్గాలు తెలిపాయి. అలాగే దేశరాజధాని ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ గెస్ట్ హౌజ్ భవనాన్ని, దాని ఆస్తులను ఏకపక్షంగా విభజించారన్న ఆరోపణలున్నాయి. ఈ పరిస్థితుల్లో 2024 జూలై 6వ తేదీన విభజన ఒప్పందాలపై ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీ అవుతుండటంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

9, 10వ షెడ్యూల్ ప్రకారం

రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల్లో ప్రధానమైనవి 9, 10వ షెడ్యూల్‌లోని సంస్థల విభజన. 9వ షెడ్యూల్‌లో మొత్తం 91 సంస్థలు ఉండగా, 10వ షెడ్యూల్‌లో 142 సంస్థలున్నాయి. కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్ ఇచ్చిన నిర్వచనం ప్రకారం 9వ షెడ్యూల్‌లోని సంస్థల ఆస్తుల విభజనకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కానీ  9వషెడ్యూల్ సంస్థల విష యంలో షీలాభిడే సిఫారసుల మేరకు 68 సంస్థల విభజనకు తెలంగాణ ప్రభు త్వం గతంలోనే సుముఖత తెలిపింది.

అయితే మరో 23 సంస్థల విభజనపై తన అభ్యంతరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. ముందు ఇరుపక్షాలకు అంగీకా రం ఉన్న సంస్థల విభజనతో ప్రక్రియ మొదలు పెట్టాల్సిందిగా కేంద్ర హోంశాఖ సూచించింది. ఇందుకు నిరాకరించిన ఏపీ ప్రభుత్వం మొత్తం ఆస్తుల విభజన ఒకేసారి జరగాలని పట్టుబట్టింది. షెడ్యూ ల్ 9 ఆస్తుల హెడ్ క్వార్టర్స్‌తోపాటు ఎక్కడున్న వాటిని అక్కడే ఉంచాలన్న డిమాండ్ నిబంధనలకు విరుద్ధంగా నాటి ఏపీ ప్రభుత్వం వ్యవహరించడంతో అ అంశం నేటికి అపరిష్కృతంగా ఉండిపోయింది.