calender_icon.png 21 November, 2024 | 11:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసెంబ్లీకి రా సామీ.. చర్చిద్దాం

21-11-2024 02:01:02 AM

రుణమాఫీ మీరు ఎంతిచ్చారో.. మేము ఎంతిచ్చామో లెక్కలు తీద్దాం

కేసీఆర్ లక్ష కోట్లు తిన్నడు.. ఫాంహౌజ్‌లో పన్నడు.

  1. కేటీఆర్ ఎగురుతుండు.. ఊచలు లెక్కించక తప్పదు 
  2. భూ సేకరణపై ఆయన కుట్ర చేసిండు
  3. కొడంగల్ నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని ఫార్మా విలేజ్ తెస్తే అధికారులపై దాడులు చేశారు
  4. కే కే హెచ్‌ల లెక్క తేలుస్తాం 
  5. రాజన్న క్షేత్రానికి కేసీఆర్ ఏమీ చేయలే..
  6. చట్టం అందరికీ సమానమే 
  7. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం 
  8. వేములవాడ సభలో సీఎం రేవంత్

* గతంలో ప్రభుత్వం రుణమాఫీ చేసి ఉంటే నేను చేయవలసిన అవసరం లేదు కదా?.. గత ప్రభుత్వ హయాంలో 11 వేల కోట్ల రూపాయల రుణమాఫీకి ఐదేళ్లు పట్టింది. మన ప్రభుత్వం 25 రోజుల్లో 18 వేల కోట్ల రుణమాఫీ చేసింది. అప్పుడు జరిగిన రుణమాఫీ, నేడు జరుగుతున్న రుణమాఫీపై చర్చ పెడదాం ధైర్యముంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలి. 

 సీఎం రేవంత్‌రెడ్డి

కరీంనగర్/సిరిసిల్ల, నవంబర్ 20 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుల లెక్క తేలుస్తామని  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేటీఆర్ ఎగురుతుండు.. ఎంత ఎగురుతాడో ఎగరనీ.. ఊచలు లెక్కించక తప్పదు అని ఆయన చెప్పారు. బుధవారం వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శిం చుకున్న అనంతరం ముఖ్యమంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభను జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కలెక్టర్‌పై దాడి కేసులో కేటీఆర్ ఊచలు లెక్కపెట్టే సమయం దగ్గర పడిందని అన్నారు. స్వాతంత్య్ర భారతంలో కొడంగల్ నుంచి ఎవరూ మంత్రి కూడా కాలేదని, తమ ప్రాంతం నష్టపోయిందని అన్నారు.

అందుకే అభివృద్ధి చేయాలని తాను నిర్ణయించుకున్నానని చెప్పారు. తమ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని ఫార్మా విలేజ్ తెస్తే, అధికారులపై దాడులు చేశారన్నారు. ‘కేటీఆర్ నువ్వు ఎంత ఎగురుతావో ఎగురు, ఉయ్యాలలా ఎక్కడో ఓ చోట ఆగవలసిందే’నని అన్నారు. ‘నేను సేకరిస్తానన్నది నాలుగు గ్రామాల్లో ౧,౧౦౦ ఎకరాలు మాత్రమే.

అదే వారికి ప్రపంచ సమస్య అయ్యిందా?.. కేసీఆర్‌కు నా నియోజకవర్గం కొడంగల్‌పై ఎందుకంత కక్ష. భూ సేకరణలో పరిహారం తప్పకుండా పెంచుతాం. అధికారం పోయే సరికి బీఆర్‌ఎస్ వాళ్లకి మైండ్ పోయింది’. రంగ నాయకసాగర్ ప్రాజెక్టును కట్టేందుకు భూ సేకరణ చేపడితే ఆ భూములను హరీశ్‌రావు తన పేరిట బదలాయించుకుని ఫాంహౌజ్ కట్టుకున్నాడని సీఎం అన్నారు.

360 డిగ్రీల వ్యూ ఉండేలా ప్రాజెక్టు మధ్యలో ఫాంహౌజ్ కట్టుకున్నాడని.. ఆ లెక్కలన్నీ తీస్తున్నానని, దానికి సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. కొండపోచమ్మ ప్రాజెక్టు కేవలం కేసీఆర్ ఫాం హౌజ్ కోసమే నిర్మించారని, వేల కోట్ల ప్రజ ల సొమ్ముతో డైరెక్టుగా కేసీఆర్ ఫాంహౌజ్‌కు నీళ్లు తీసుకుపోయాడని వ్యాఖ్యానించారు. 

నిజనిర్ధారణ కమిటీ వేద్దామా?

నిధుల దుర్వినియోగంపై నిజనిర్ధారణ కమిటీ వేద్దామా అని కేసీఆర్‌ను ప్రశ్నించా రు. కేటీఆర్‌ను కేసీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిని చేస్తే జన్వాడలో 111 జీవోతో ఫాం హౌజ్ కట్టుకున్నారని అందులో కేటీఆర్ బావమరిది కాసినోను నడుపుకుంటూ డ్రగ్స్, మందు కొడితే చర్యలు తీసుకోవద్దా అని ప్రశ్నించారు. బావమరిది కళ్లలో ఆనం దం కోసం బావ ఇలాంటి చర్యలకు వత్తాసు పలకవచ్చా అని ప్రశ్నించారు.

ప్రభుత్వంపై కుట్రలు చేస్తే.. కేటీఆర్ ఊసలు లెక్కపెట్టేలా చేస్తానన్నారు. పదేళ్లలో జరగని అభివృద్ధి పదినెలల్లో చేసి చూపించాం, కేసీఆర్‌కు లెక్క లు తీసి చూపిస్తామని ముఖ్యమంత్రి అన్నా రు. కేటీఆర్, హరీశ్‌రావులు మన కాళ్ల మధ్య లో కట్టెలు పెడుతున్నారని ధ్వజమెత్తారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే రెండవస్థానంలో ఉందని, అది కేసీఆర్ వల్ల కాదా అని ప్రశ్నించారు.

11 వేల కోట్ల రుణమాఫీకి కేసీఆర్ ఐదేళ్ల సమయం తీసుకుం టే, మా ప్రభుత్వం 25 రోజుల్లో 23 లక్షల కుటుంబాలకు 18 వేల కోట్ల రుణమాఫీ చేసిందని స్పష్టం చేశారు. రుణమాఫీని అభినందించాల్సింది పోయి విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. పదేళ్లలో మీరు చేయలేని పని తాము చేస్తుంటే మీకు నొప్పెందుకన్నారు. మీ నొప్పికి మా కార్యకర్తల దగ్గర మందు ఉందన్నారు.

త్వరలోనే మందు పెడతామని, స్థానిక సంస్థల ఎన్నికలకు మేం సిద్ధంగా ఉన్నామని, ఆ ఎన్నికల్లో మీ సంగతి తేలుస్తామని సీఎం హెచ్చరించారు. మీరు చేసిన రుణమాఫీ, మేము చేసిన రుణమాఫీపై వివరాలు బయటకు తీసి చర్చకు పెడతామని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.

కేసీఆర్‌కు దమ్ముంటే అసెంబ్లీకి రావాలని ఆ లెక్కలు చూపిస్తామని అన్నారు. చట్టం అందరికీ సమానమే కేటీఆర్ అంటూ ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే...

కేసీఆర్ ఏమీ చేయలే...

పదేళ్లలో గత ముఖ్యమంత్రి కేసీఆర్ 20 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా రాజన్న ఆలయాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదు? కాళేశ్వరం ప్యాకేజీ- 9 పనులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయో ప్రజలు ఆలో చన చేయాలి. వేములవాడ గత ఎమ్మెల్యేను ప్రజలు కలవాలంటే జర్మనీకి పోవా ల్సి వచ్చేది. నేడు మన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వేములవాడ వీధులలో దయ్యంలా తిరుగుతున్నాడు.

ఆయన కృషి ఫలితంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. సిరిసిల్ల ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయ కుండా నూలు డిపో, వైద్య కళాశాల ఏర్పా టు చేశాం. గల్ఫ్ కార్మికుల గురించి స్థానిక నాయకుల ఆలోచన మేరకు ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల పరిహారం ఇచ్చాం. 

ఇచ్చిన మాట ప్రకారం..

గతంలో పీసీసీ చీఫ్‌గా పాదయాత్ర సమయంలో వేములవాడ రావడం జరిగింది. ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం ఆలయ అభివృద్ధి పనులు, మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యలు పరిష్కరిస్తున్నాం. సిరిసిల్ల, చొప్పదండి ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. కళికోట సూరమ్మ ప్రాజెక్టు పెండింగ్ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నాం.

సిరిసిల్ల ప్యాకేజీ పనులను జిల్లా ఇంచార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ పనులను పూర్తి చేస్తాం. నవంబర్ 30 లోపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపకల్పన చేశాం. గ్రామస్థాయి నుంచి ఢిల్లీకి నాయకత్వాన్ని అందించి కరీంనగర్ జిల్లా. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావును అందించిన జిల్లా కరీంనగర్.  

తెలంగాణ హామీ కరీంనగర్ నుంచే...

తెలంగాణకు కట్టుబడి ఉన్నామని 2004లో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కరీంనగర్ గడ్డ నుంచే హామీ ఇచ్చా రు. మంత్రి పొన్నం ప్రభాకర్, స్వర్గీయ జైపా ల్ రెడ్డి ఆనాడు ఎంపీలుగా పార్లమెంట్‌లో చేసిన వీరోచిత పోరాట ఫలితంగానే తెలంగాణ వచ్చింది. హామీ మేరకు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది. 

బండి సంజయ్ ఏం చేయలే..

కరీంనగర్ జిల్లాకు ఎంపీ బండి సంజయ్ ఏం చేశారో ప్రజలు ఆలోచించాలి. రెండుసార్లు గెలిపించినందుకు కేంద్ర మంత్రి అయ్యారు. జిల్లాకు ఏమి చేయలేదు. గత సీఎం పడావు పెట్టినా ప్రాజెక్టులను మళ్లీ ప్రారంభిస్తున్నాం. 

ధైర్యముంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలి

గతంలో ప్రభుత్వం రుణమాఫీ చేసి ఉంటే నేను చేయవలసిన అవసరం లేదు కదా?.. 11 వేల కోట్ల రూపాయల రుణమాఫీకి ఐదు సంవత్సరాలు చేస్తే మన ప్రభు త్వం 25 రోజుల్లో 18 వేల కోట్ల రుణమాఫీ చేసింది. గత ప్రభుత్వంలో జరిగిన రుణమాఫీ, నేడు జరుగుతున్న రుణమాఫీపై చర్చ పెడదాం ధైర్యముంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలి.

వందలాది మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటే వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చా రు. మేము పది నెలల కాలంలో 50 వేల ఉద్యోగాలు ఇచ్చాం. కోటి 10 లక్షల మంది ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణానికి 3700 కోట్లు ఖర్చు పెట్టాం. 500 రూపాయలకు గ్యాస్ సరఫరా చేస్తున్నాం, సన్నవడ్లకి 500 రూపాయల బోనస్ ప్రకటించడం తో 66 లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగింది. 

కాళేశ్వరం నుంచి చుక్కనీరు లిఫ్టు చేయకుండానే.. 

కాళేశ్వరం నుంచి చుక్కనీరు లిఫ్టు చేయకుండానే రికార్డు స్థాయిలో కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఉత్పత్తి జరిగిం ది. లక్షా 83 వేల కోట్లు ఖర్చు చేస్తే ఒక్క ప్రాజెక్టు కూడా సంపూర్ణంగా పూర్తి చేయలేదు. కేసీఆర్ ప్రాజెక్టుల పేరుతో లక్ష కోట్లు తిని ఫాంహౌజ్‌లో పడుకున్నాడు.

కాళేశ్వరం మూడు ప్రాజెక్టులు కుప్పకూలాయి. ఎనుకటికెవడో పందిరేస్తే కుక్క తోక తగిలి పందిరి కూలిందట.. గట్లున్నది వీళ్ల పని. రంగనాయక్‌సాగర్ దగ్గర హరీశ్‌రావు ఫాంహౌజ్ కట్టుకున్నాడు. రంగనాయక్, కొండపోచమ్మ సాగర్‌పై నిజనిర్ధారణ కమిటీ వేద్దాం.

దేశం లో బీఆర్‌ఎస్ నాయకులకు ప్రత్యక చట్టం ఉందా? కొడంగల్ అభివృద్ధి కోసం నారాయణపేట ప్రాజెక్టు పెడితే అం దులో పుల్లలు పెడుతున్నారు. పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తుంటే అధికారులపై దాడు లు చేస్తున్నారు. దాడులు చేస్తే కేసులు పెట్టొ ద్దా? తెలంగాణలో పరిశ్రమలు పెట్టొద్దా? భూసేకరణ చేయొద్దా ప్రజలు ఆలోచించాలి. 

కేటీఆర్‌పై చర్యలు తప్పవు..

నా నియోజకవర్గంపై ఎందుకు కక్షకట్టారు, ఎక్కడికి వెళ్లినా కుట్రలు చేస్తున్నారు, కేటీఆర్‌పై చర్యలు తప్పవు. దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా తెలంగాణను అభివృద్ధి చేస్తాం.

* కాళేశ్వరం నుంచి చుక్కనీరు లిఫ్టు చేయకుండానే రికార్డు స్థాయిలో కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం దిగుబడి వచ్చింది. లక్షా 83 వేల కోట్లు ఖర్చు చేస్తే ఒక్క ప్రాజెక్టు కూడా సంపూర్ణంగా పూర్తి చేయలేదు. కేసీఆర్ ప్రాజెక్టుల పేరుతో లక్ష కోట్లు తిని ఫాం హౌజ్‌లో పడుకున్నాడు. కాళేశ్వరం మూడు ప్రాజెక్టులు కుప్పకూలాయి. ఎనుకటికెవడో పందిరేస్తే కుక్క తోక తగిలి కూలిందట.. గట్లున్నది వీళ్ల పని. 

 సీఎం రేవంత్‌రెడ్డి

అత్యధిక వరి పండించే రాష్ట్రం మనదే 

స్వాతంత్య్ర భారత్‌లో అత్యధికంగా వరి పండించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ 9వ ప్యాకేజీ పనులు 83 శాతం పూర్తయ్యాయని, మరో యేడాదిలో రూ.340 కోట్లు ఖర్చు పెట్టి 80 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు అందిస్తామని వెల్లడించారు. కలకోట సూరమ్మ ప్రాజెక్ట్‌కు రూ.70 కోట్లు ఖర్చు పెట్టామని, మరో రూ.30 కోట్లు ఖర్చు చేసి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

ఎల్లంపల్లి ప్రాజెక్ట్ స్టేజీ 2 ఫేస్ 1 పనులు పూర్తిచేసి ౧.౫౧లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. ఎల్లంపల్లి కెనాల్ నెట్ వర్క్ ప్యాకేజీ 2లో పెండింగ్ పనులకు రూ.170 కోట్లు ఖర్చు చేసి, వేములవాడ  నియోజకవర్గంలో 40,500 ఎకరాలు, కోరుట్లలో 2,500 ఎకరాల కొత్త అయకట్టుకు నీరందిస్తామన్నారు. కాళేశ్వరం ప్యాకేజీ 9, 10, 11లో పనులు పూర్తిచేసి లక్షన్నర ఎకరాలకు సాగునీరందిస్తామని తెలిపారు. 

 మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

రాజన్న భక్తుల కష్టాలు తీరనున్నాయి

కొన్నేళ్లుగా రాజన్న భక్తులు పడుతున్న కష్టాలు తీరనున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాజన్న దర్శనానికి వచ్చే భక్తులకు అన్నదానం నిర్వహించేందుకు ఉన్న సత్రాన్ని ఆధునీకరించేందుకు రూ.35 కోట్ల నిధులను సీఎం రేవంత్‌రెడ్డి మంజూరు చేశా రు. గత పాలకులు వాగ్దానాలకు పరిమితమయ్యారు. మా ప్రభుత్వం చెప్పింది చేసి తీరుతుంది.

మధ్యమానేరు ముంపు గ్రామాల ప్రజలకు న్యాయం జరగాలని అనేక పోరాటాలు చేశామని గుర్తుచేశారు. సిరిసిల్ల నేతన్న కార్మికులకు ఉపయోపడే విధంగా యారన్ డిపోను ప్రారంభించమని తెలిపారు. వచ్చే రోజుల్లో నేతన్న కార్మికుల ఉపాధి కోసం బృహత్తర ప్రణాళిక రూపొందిస్తున్నామని వెల్లడించారు. పెండింగ్‌లో ఉన్న నీటి పారుదల ప్రాజెక్ట్‌లకు ప్రాధాన్యత ఇచ్చి, పూర్తి చేస్తామన్నారు.        

మంత్రి పొన్నం ప్రభాకర్ 

క్రమశిక్షణతో హామీలు అమలు చేస్తున్నాం

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రతి ఎకరా సాగు అయ్యే దిశగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాటను నేడు సీఎంగా వచ్చి నెరవేర్చారని పేర్కొన్నారు. నిరంతరం ప్రజల్లో తిరిగే శ్రమ జీవి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని అన్నారు. పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. గతంలో ప్రజలకిచ్చిన హామీ మేరకే నూలు డిపో ఏర్పాటు చేశామన్నారు. 

 మంత్రి శ్రీధర్‌బాబు

60ఏళ్ల పోరాటం, త్యాగాల ఫలితమే రాష్ట్రం

60 ఏళ్ల సుదీర్ఘ పోరాటాలు, త్యాగాల ఫలితంగానే తెలంగాణ కల సాకారం అయ్యిందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటను కాంగ్రెస్ ప్రభు త్వం ఒక్కొక్కటిగా నేరవేరుస్తుందని చెప్పారు. రూ.166 కోట్ల నిధులతో సిరిసిల్ల వైద్య కళాశాల నిర్మాణం చేపట్టమని తెలిపారు. ముంపు గ్రామాల నిర్వాసితులకు 4,696 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని గుర్తుచేశారు.  ఈ ప్రాంత అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.     

మంత్రి దామోదర రాజనర్సింహ

నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్లు నిర్మిస్తాం

ప్రజల దీవెనలతోనే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మార్పు పేరిట మంచి నిర్ణయం తీసుకున్న ప్రజలకు కాంగ్రెస్ ఎప్పటికి రుణపడి ఉంటుందని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతో పాటు అనే క కార్యక్రమాలు అమలు చేస్తున్నామని స్పష్టంచేశారు. రాబోయే నాలుగేళ్లలో రూ.లక్ష కోట్లతో 20 లక్షల ఇండ్లు నిర్మించి, పేదలకందిస్తామని వెల్లడించారు. ధరణి రికార్డుల నిర్వహణ విదేశీ సంస్థ నుంచి తప్పించి ఎస్‌ఐసీకు అప్పగించామని చెప్పారు. భూములను దోచుకున్న వారి నుంచి తీసుకొని పేదవారికి పంచే కార్యక్రమం చేపడతామని తెలిపారు. 

 మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి 

నేతన్నల చిరకాల కల నేరవేర్చాం

సిరిసిల్ల నేతన్నల 30 ఏండ్ల చిరకాల కల కాంగ్రెస్ ప్రభుత్వం నేరవేర్చిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వేములవాడలో రూ.50 కోట్లతో నూలు డిపో ఏర్పాటు చేశామని చెప్పారు. నేతన్నలకు చేయూత, నేతన్న బీమా, పావలా వడ్డీ పథకాలను కార్మికులకు అమలు చేస్తామని ఉద్ఘాటించారు.

365 రోజులు చేనేత కార్మికులకు పని కల్పించే సంకల్పం ప్రభుత్వం తీసుకుందని స్పష్టంచేశారు. రాజన్న దీవెనతోనే దేశంలోను అత్యధికంగా వరి సాగు చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. రూ.18 వేల కోట్లతో రుణమాఫీ చేశామని, మిగిలిన రైతులకు రుణామాఫీ సొమ్మును త్వరలోనే విడుదల చేస్తామని భరోసా ఇచ్చారు.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 

కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ఈ ప్రాంత అభివృద్ధి

కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల సహకారంతోనే ఈ ప్రాంత అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే  ఆది శ్రీనివాస్ అన్నారు. సీఎం హామీ మేరకు మధ్యమానేరు నిర్వాసితులు 4,696 మందికి ఇండ్లు మంజూరు చేశామని తెలిపారు. రూ.76 కోట్లతో రాజన్న ఆలయ విస్తరణ పనులు శృంగేరి అధిపతుల సూచనల మేరకు నిర్వహిస్తున్నామని చెప్పారు. రూ.47 కోట్లతో రోడ్ల విస్తరణ పనులకు భూమి పూజ చేయడం సంతోషంగా ఉందన్నారు. రూ.35 కోట్లతో అధునాతన నిత్యాన్నదాన సత్రం ఏర్పాటుకు సీఎం నిధులు చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.    

ఆది శ్రీనివాస్, ప్రభుత్వ విప్ 

11 నెలల్లో 50 వేల ఉద్యోగాలు ఇచ్చాం

కాంగ్రెస్ పాలన చేపట్టి 1౧నెలల్లోనే నిరుద్యోగ యువతకు 50 వేల ఉద్యోగా ఆవకాశాలను కల్పించామని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం మాటల ప్రభుత్వమైతే, కాంగ్రెస్ చేతల ప్రభుత్వంగా ప్రజల మన్ననలు పొందుతుందని ఆయన చెప్పారు. ఈ ప్రాంతంతో తనకు 35 ఏళ్ల అనుబంధం ఉందనీ, రాజన్న ఆశీస్సులతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు. 

 మహేశ్‌కుమార్ గౌడ్, పీసీసీ అధ్యక్షుడు