అవకాశాలిస్తాం..
- కమ్మ పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ పిలుపు
- కమ్మ అంటేనే అమ్మలాంటివారు
- రాజకీయం, నాయకత్వంలో ఎన్టీఆర్ ఓ బ్రాండ్
- ఆయన సంకీర్ణ రాజకీయాలే దేశాన్ని ఏలుతున్నాయి
- కమ్మ గ్లోబల్ ఫెడరేషన్‌లో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 20 (విజయక్రాంతి): కమ్మ అంటేనే అమ్మ లాంటి వారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నా రు. ఆకలి తీర్చడం కోసం బిడ్డ కడుపు అమ్మ చూసినట్టుగానే వ్యవసాయం చేసి పదిమందిని ఆదరించేవారు కమ్మవారు అని పేర్కొన్నారు. మాదాపూర్ హెచ్‌ఐసీసీలో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ (కేజీఎఫ్) రెండు రోజుల సదస్సులో మొదటిరోజు శనివారం మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
కమ్మవారు వ్యవసాయం ద్వారా కష్టపడి పంటలు పండించి, తోటివారికి సా యపడే గుణం ఉన్నవారని కొనియాడారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చే ప్రణాళికలో కమ్మవారు భాగస్వాములు కావాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కమ్మవారు పెట్టుబడులు పెడితే ప్రోత్సహించటానికి ప్రోత్సహిం చడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు. ‘హైదరాబాద్‌కు రండి.. మీకు అవకాశాలిస్తాం’ అని సీఎం పిలుపునిచ్చారు.
ఎన్టీఆర్ ఓ బ్రాండ్
కొండ మీద అమ్మవారు, కొండ కింద కమ్మవారు అనే సినిమా డైలాగ్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా ఉటంకించారు. కమ్మవారితో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు రాజకీయాలు ఎందరికో అవకాశాలు కల్పించాయని అన్నారు. ఎన్టీఆర్ లైబ్రరీలో నేర్చుకున్న పాఠాలే తాను ఇంతటి ఉన్నత స్థాయికి ఎదగడానికి దోహదపడ్డాయని చెప్పారు. ఎన్టీఆర్, చంద్రబాబు తీసుకొచ్చిన సంకీర్ణ రాజకీయాల కారణంగా కేంద్రంలో ఎందరికో అవకాశాలు వచ్చాయని తెలిపారు. వీరి సంకీర్ణ రాకీయాలే నేడు దేశాన్ని ఏలుతున్నాయని అన్నారు. పాలిటిక్స్‌లో, లీడర్‌షిప్‌లో ఎన్టీఆర్ ఓ బ్రాండ్ అని కొనియాడారు. ఎన్టీఆర్ అవకాశాలు ఇవ్వడం వల్లనే తెలుగు రాష్ట్రాల్లో మంచి నాయకులు తయారయ్యారని తెలిపారు.
ఎన్జీ రంగా, పీవీ, వెంకయ్య నాయుడు, జైపాల్‌రెడ్డి వంటి నేతల వల్ల ఢిల్లీలో బలమైన తెలుగు నాయకత్వం ఉండేదని చెప్పారు. ప్రస్తుతం అలాంటి నాయకత్వం ఆవశ్యకత ఎంతో ఉందని అన్నారు. పార్టీ వేరైనా వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కావాలని ఆకాంక్షించామని తెలిపారు. కమ్మ సంఘానికి కేటాయించిన 5 ఎకరాల భూమికి సంబంధించిన సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆ సమస్యను పరిష్కరించడానికే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ సదస్సుకు వచ్చారని తెలిపారు. కేజీఎఫ్ ఫౌండర్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్ మాట్లాడుతూ అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, గల్ఫ్, మిడిల్ ఈస్ట్ తదితర దేశాల నుంచి రెండు వేల మంది ప్రతినిధులు ఈ సదస్సుకు వచ్చారని చెప్పారు.
ప్రపంచం ఒక కుగ్రామంగా మారిన సమయంలో కమ్మవారంతా ఐక్యం కావాల్సిన అవశ్యకత ఉందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కమ్మవారికి సహాయం అందించడమే లక్ష్యంగా కేజీఎఫ్ ఏర్పాటైందని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కమ్మ పారిశ్రామికవేత్తలతో ప్రత్యేకంగా సమావేశమై పెట్టుబడులు, అవకాశాలు, వ్యాపార విస్తరణ అనే అంశాలపై చర్చించారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ, తమిళనాడు ఎంపీ కళానిధి వీరస్వామి, మాజీ గవర్నర్ రామమోహన్‌రావు, కర్ణాటక ఎమ్మెల్యే మునిస్వామి, కేపీసీసీ నాయకుడు రాజగోపాల్‌నాయుడు, యరపతినేని శ్రీనివాసరావు, దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్, రఘురామ కృష్ణంరాజు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, మాజీ మం త్రులు కట్టా సుబ్రమణ్యం నాయుడు, వసంత నాగేశ్వర్‌రావు, మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వరరావు, మురళీ మోహన్ ఈ సదస్సులో పాల్గొన్నారు.