మాజీ సీఎం కేసీఆర్, ఐఏఎస్ స్మితాసబర్వాల్‌కు భూపాలపల్లి కోర్టు మరోసారి నోటీసులు
హనుమకొండ, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనే కేసు విషయంలో మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌కు భూపాపల్లి కోర్టు గురువారం మరోసారి నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 17న కోర్టులో హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. భూపాలపల్లి జిల్లాలో నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ పలువురు సామాజిక కార్యకర్తలు కొద్దిరోజుల కిందట అప్పటి సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావు, అధికారులు రజత్‌కుమార్, స్మిత సబర్వాల్, హరిరామ్, శ్రీధర్, కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి, ఎల్‌అండ్ టీ కంపెనీ ఎండీ సురేశ్‌కుమార్‌తోపాటు ఎనిమిది మందిపై ప్రైవేట్ రెఫర్ కేసు వేయగా విచారించిన జిల్లా కోర్టు డిస్మిస్ చేసింది.
దీంతో సామాజిక కార్యకర్తలు మరోసారి జిల్లా సెషన్ కోర్టులో వారిపై క్రిమినల్ రివిజన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను గురువారం విచారించిన సెషన్ కోర్టు కేసీఆర్, స్మితా సబర్వాల్ అక్టోబర్ 17 న కోర్టులో హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది.