నేటి నుంచి వినాయక చవితి వేడుకలు షురూ
ప్రత్యేక ఆకర్షణగా ఖైరతాబాద్, బాలాపూర్ గణపతులు
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబరు 6(విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరం వినాయక చవితి ఉత్సవాలకు ముస్తాబైంది. శుక్రవారం నగరవ్యాప్తంగా సందడి నెలకొన్నది. విగ్రహాలు తర లింపు, పూజాసామగ్రి కొనుగోళ్లతో నగరం రద్దీగా కనిపించింది. శనివారం వేలాది మండపాల్లో బొజ్జ గణపయ్య కొలువుదీరనున్నాడు. ఇప్పటికే కాలనీలు, బస్తీలు అనే తేడా లేకుండా నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నది.
ఉత్సవ కమిటీ సభ్యులు 11 రోజుల పాటు ఘనంగా వేడుకలు నిర్వహించనున్నారు. ఖైరతాబాద్ గణేశుడు ఈసారి సప్తముఖ మహాగణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నాడు. బాలాపూర్ గణేశుడూ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు. 17వ తేదీ జరిగే గణేశుని నిమజ్జనోత్సవానికి పోలీసులు ప్రత్యేక బందోబస్తు చేపట్టనున్నారు. అధికారులు హుస్సేన్ సాగర్‌తో పాటు ఇతర ప్రాంతాల్లోని చెరువుల వద్ద తగిన ఏర్పాటు చేస్తున్నారు.