సీఎం నుంచి జీహెచ్‌ఎంసీ అధికారులకు పిలుపు
నగర అభివృద్ధి, నిధుల విడుదలపై చర్చించే ఛాన్స్
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 17 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి పిలుపు అందుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి జీహెచ్‌ఎంసీ అధికారులతో శనివారం లేదా సోమ వారం సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అనంతరం బల్దియా అధికారులు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి, జీహెచ్‌ఎంసీకి నిధులు కేటాయించాలని విన్నవించిన సంగతి తెలిసిందే.
అయితే, సీఎం వద్దనే మున్సిపల్ శాఖ ఉన్నప్పటికీ, ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నిధుల మంజూరు విషయం ఆలస్యమైంది. ప్రస్తు తం ఎన్నికలు ముగియడంతో జీహెచ్‌ఎంసీ అధికారులకు సీఎంఓ కార్యాలయం నుంచి పిలుపు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో మొత్తం ఆర్థిక అంశాలపైనే చర్చించే అవకాశం ఉంది. కాగా, జీహెచ్‌ఎంసీ 2024 ఏడాదికి రూ. 7937 కోట్ల బడ్జెట్‌ను ఆమోదించింది. ఇటీవల ఎరీ ్లబర్డ్ రూపంలో జీహెచ్‌ఎంసీకి రూ.827 కోట్లు సమకూరాయి. ఇవన్నీ.. సాధారణ నిర్వహణ, వేతనాలు ఇతరత్రా అవసరాలకు సర్ధుబాటు చేస్తున్నారు.
ఇప్పటికే జీహెచ్‌ఎంసీ.. బాండ్లు, ఇతరత్ర రూపంలో రూ. 495 కోట్ల రుణాలు తీసుకోవడం జరిగింది. వీటికి ప్రతినెలా రూ. 50 కోట్లను వడ్డీ రూపంలో చెల్లిస్తుంది. అయితే, ఏడాది కాలంగా జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్లకు దాదాపు రూ. 1300 కోట్ల బిల్లులు బకాయి పడింది. ఈ బకాయిల కారణంగా బల్దియాలో పలు అభివృద్ది కార్యక్రమాలు నిలిచిపోయే ప్రమాదం ఉంది. అందుకే మొదటి ప్రాధాన్యత అంశంగా బల్దియాకు రూ. 1200 కోట్ల నిధులు మంజూరు చేయాలని అధికారులు ప్రభుత్వాన్ని కోరుతున్నా రు. ఎన్నికల ముందు కమిషనర్ రొనాల్డ్ రాస్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి జీహెచ్‌ఎంసీకి తక్షణ అవసరంగా రూ. 1200 కోట్ల నిధులు కావాలని కోరారు. ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేసినట్లయితే, బల్దియాకు ఉపశమనం కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు.