- 600 మంది బాధితులు
- 150 కోట్లకు టోకరా
- తక్కువ ధరకు ఫ్లాట్స్, ఫామ్‌ల్యాండ్స్ ఇస్తామని హామీ
- ఒక్కొక్కరి నుంచి 20 లక్షల నుంచి 50 లక్షలు వసూలు
- నాలుగేళ్లుగా నిర్మాణాలు చేపట్టకపోవడంపై బాధితుల ఆందోళన
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 22 (విజయక్రాంతి): అదే మోసం.. కథ డిట్టో.. జనాన్ని మోసగించేదాకా నమ్మబలుకుడే. కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థల తీరు ఎప్పటిలాగే కొనసాగుతున్నది. తక్కువ ధరకు ఫ్లాట్లు.. రంగు రంగుల బ్రోచర్లు.. ప్రముఖులతో ప్రచారాలు.. ఇవి ఉంటే చాలు.. అసలు ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుందా? లేదా? అని ఆలోచించకుండా ప్రజలు పెట్టుబడులు పెట్టేలా ఆకర్షిస్తాయి.
అనంతరం ప్రాజెక్టే లేదని తెలుసుకొని, పెట్టిన డబ్బులు తిరిగి ఇప్పించాలని పోలీసులను ఆశ్రయిస్తున్నారు బాధితులు. సొంతింటి కల నెరవేర్చుకుందామని అప్పులు తెచ్చి మరీ పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా కుంగిపోతున్నారు. జీవితాంతం సంపాదించిన డబ్బు కొల్పోయామని కొందరు.. తెచ్చిన అప్పులు తీర్చే మార్గం కనబడడం లేదని కొందరు వాపోతున్నారు. తాజాగా నగరంలో మరో ప్రీ లాంచింగ్ మోసం వెలు గులోకి వచ్చింది.
‘ఆర్‌జే వెంచర్స్’ అనే సంస్థ తక్కువ ధరకు అపార్ట్‌మెంట్లు, ఫార్మ్ ల్యాండ్ ఇస్తామని నమ్మించి సుమారు 600 మంది బాధితుల నుంచి రూ. 150 కోట్ల వరకు వసూలు చేసింది. పెట్టుబడులు పెట్టి ఏళ్లు గడుస్తున్నా ఎలాంటి అపార్ట్‌మెంట్లు, ఫామ్ ల్యాండ్స్ ఇవ్వకపోవడంతో బాధితులంతా శుక్రవారం బషీర్‌బాగ్‌లోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)లో ఫిర్యాదు చేశారు.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..
ఆర్‌జే వెంచర్స్ ఎండీ భాస్కర్ గుప్తా, డైరెక్టర్ సుధారాణి మరికొందరితో కలిసి 2020 సంవత్సరంలో నారాయణ్ ఖేడ్, ఘట్కేసర్, పటాన్ చెరు, కర్తనుర్ ప్రాంతాలలో అపార్ట్‌మెంట్లు, ఫామ్ ల్యాండ్స్ మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు విక్రయిస్తామని ఆఫర్లను ప్రకటించారు. ప్రజలను ఆకర్షించడానికి మ్యూజిక్ డైరెక్టర్ కోటి, మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్ వంటి ప్రముఖులతో ప్రచారాలు నిర్వహించారు.
ఇదంతా నిజమేనని నమ్మిన సుమారు 600 మంది బాధితులు ఒక్కొక్కరు రూ. 20 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు పెట్టుబడులు పెట్టారు. రెండేళ్లలో నిర్మాణాలు పూర్తి చేసి ఇస్తామని, ఒకవేళ ఆలస్యం జరిగితే ప్రతి నెల ఆరువేల వరకు అద్దె కూడా చెల్లిస్తామని కస్టమర్లను నమ్మించారు. ఇలా మొత్తం రూ. 150 కోట్ల వరకు వసూలు చేశారు సంస్థ నిర్వాహకులు.
అపార్ట్‌మెంట్ నిర్మాణాలు చేపట్టడానికి హెచ్‌ఎండీఏ అనుమతుల కోసం సమయం పడుతుందని మరికొంతకాలం, ఆ తర్వాత ధరణిలో ఇబ్బందులు ఎదురయ్యాయని మరి కొంత కాలం చెబుతూ వచ్చారు. పెట్టుబడులు పెట్టి నాలుగు సంవత్సరాలు గడుస్తున్న ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోవడంపై అనుమానం వచ్చిన కొందరు ఆర్‌జే వెంచర్స్ నిర్వాహకులను నిలదీశారు.
తమ డబ్బు తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ, సంస్థ నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం, గట్టిగా నిలదీస్తే చెక్కులు ఇస్తున్నారు కానీ, అవి కూడా బౌన్స్ అయ్యాయని బాధితులు వాపోయారు.
వెంటనే ఆర్‌జే గ్రూప్ చైర్మన్ భాస్కర్ గుప్తా, డైరెక్టర్ సుధారాణిలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, వారిని వెంటనే అరెస్ట్‌చేసి, తమకు న్యాయంచేయాలని బాధితులంతా కలిసి శుక్రవారం బషీర్‌బాగ్‌లోని సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. వెంచర్ కార్యాలయం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉందని.. ఫిర్యాదు అక్కడ పోలీసుస్టేషన్‌లో చేయాలని అధికారులు సూచించడంతో నేరుగా సైబరాబాద్ కమిషనరేట్‌కి వెళ్లి అక్కడి అధికారులకు ఫిర్యాదు చేశారు.