“ఎన్ని పైసలు ఇచ్చిన పోయిన కొడుకు తిరిగి రాడు. ఎంతో గొప్పవాడు అయితడనుకుంటే తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణాలు తీసుకుండు. తెలంగాణ వస్తే మాలాంటి యువకులకు కొలువులు వస్తాయని మీలాంటి ముసలివారికి పెన్షన్లు వస్తాయని చెప్పేటోడు.” అంటూ రాజు తల్లి నర్సవ్వ విజయక్రాంతితో తన ఆవేదనను పంచుకున్నారు.
తెలంగాణ ఉద్యమం జరుగుతున్న తరుణంలో విద్యార్థి సంఘాలతో జేఏసీ నాయకులతో కలిసి పోరాటం చేసిన చరిత్ర బత్తుల రాజుది. “మా రాజుగాడు సదువుకున్నది ఇస్కుల్ సదువే అయినా లోకం గురించి బాగా తెల్సుకునేటోడు. పేపర్లు సదువుడు, టీవీళ్ల వార్తలు బాగా సూస్తుండే, గట్లా తెలంగాణ కొట్లాట గురించి బాగా తెల్చుకునేటోడు, ఇస్కుల్కు డుమ్మా కొట్టి కామారెడ్డి పోతుండే, వేసవి సెలవుళ్లనైతే కామారెడ్డిలో జరిగిన ఉద్యమంలో ముందుండి నడ్సిండు.
కామారెడ్డికి ఎనిమిది కిలోమీటర్ల దూరమే కాబట్టి మా కంట పడకుంట బస్సుకో, బండికోపోయి పొద్దుగాళ్లనే చేరుకుంటుండె. ర్యాలీలు, ధర్నాలు, మీటింగులు ఏవి జరిగినా వీడు తప్పకుండా అక్కడ ఉంటుండే. ఇంటికి ఓల్లు అచ్చినా తెలంగాణ రావాలా.. మన బతుకులు మారాల... అని చెప్తుండే . తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పరితపించిండు. కాబట్టె పాణం తీసుకోవడానికి ఎనకకు రాలేడు. కొడుకుని పోగుట్టుకున్న తమకు తెలంగాణ ఏర్పడిన తరువాత తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబాలకు గత ప్రభుత్వం అండగా నిలుస్తామని హామీ ఇచ్చిండ్రు. ఇప్పటికీ జాగ లేదు, భూమి లేదు, ఇళ్లు లేదు.” అని రాజు తల్లీ కన్నీటి పర్యంతం అయ్యారు.
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన బత్తుల రాజు(27) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 28 డిసెంబర్ 2009న గ్రామ శివారులోని రాళ్ల తరకపై పురుగులమందు తాగి ఆత్మ బలిదానం చేసుకున్నాడు. గ్రామానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న కామారెడ్డికి వెళ్లి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటూ తెలంగాణ వస్తేనే బతుకులు బాగుపడుతాయని అనేవాడు. ఇంట్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా తెలంగాణ కోసం తపించేవాడు.
తెలంగాణ ఖచ్చితంగా వస్తుందని అనేవాడు. తెలంగాణ సాధన కోసం ఉద్యమం జరుగుతుండగా మరోవైపు సీమాంధ్ర పాలకులు ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తుడటంతో తెలంగాణ రావాలంటే ఉద్యమం జోరుగా నడపాలి అని బత్తుల రాజు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మ బలిదానం చేసుకున్నాడు. తన మరణంతోనైనా తెలంగాణ రావాలని చిట్టి రాసుకొని ఆత్మర్పణం చేసుకున్నాడు. ఉద్యమంలో చురుకుగా పాల్గొంటూ ఉద్యమకారులతో నిరంతరం కలిసి ఉండేవాడు. రాజు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలియడంతో జేఏసీ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలో గ్రామస్తులు, తెలంగాణవాదులు పెద్ద ఎత్తున అతని శవాన్ని ఊరేగింపు నిర్వహించారు. గ్రామంలో అంత్యక్రియలు జరిగే వరకు ఉద్యమకారులు వెన్నంటే నడిచారు. రాజు ఉద్యమస్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ తెలంగాణ ఉద్యమకారులు రెట్టింపు ఉత్సాహంతో ఉద్యమాన్ని నడిపారు.
మొసర్ల శ్రీనివాస్‌రెడ్డి, కామారెడ్డి
కుటుంబ నేపథ్యం..
బత్తుల రాఘవులు, నర్సవ్వ దంపతులకు నలుగురు కుమారులు ఒక కూతురు ఉన్నారు. తెలంగాణ అమరవీరుడు రాజు మూడో వాడు. ఇద్దరు అన్నలు రాజలింగం, నారాయణ కాగా, తమ్ముడి పేరు రాజేందర్, చెల్లి పేరు గంగామణి వీరిది రెక్కాడితే గానీ డొక్కాడని పేద కుటుంబం. పెద్దవాడు రాజలింగం కామారెడ్డిలో ఓ ప్రైవేటు షాపులో పని చేస్తుండగా.. రెండో వాడు నారాయణ గ్రామంలోనే తల్లితండ్రులతో కూలీ పని చేసుకుంటూ ఉండేవాడు. ఇంటర్ చదువుతున్న రోజుల్లోనే మలిదశ తెలంగాణ ఉద్యమం వచ్చింది. బత్తుల రాజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూ తెలంగాణ రాష్ట్రం వస్తేనే బతుకులు బాగుపడుతాయంటూ ఉద్యమ కార్యక్రమాల్లో తిరిగేవాడు.
ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం సీమాంధ్ర పాలకులు చేస్తున్నారని ఉద్యమం జోరు తగ్గవద్దని తాను ఆత్మబలిదానం చేస్తేనైనా ఉద్యమం బలోపేతం అవుతుందని చిట్టి రాసుకుని తెలంగాణ రావాలని ఆత్మబలిదానం చేసుకున్నాడు. తమ్ముడు రాజేందర్, చెల్లి గంగామణి చదువుకునేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి ప్రభుత్వం రాజు కుటుంబానికి పది లక్షల నగదును అతని తమ్ముడు రాజేందర్‌కు జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగాన్ని ఇచ్చారు. ఉండేందుకు ఇల్లు, ప్లాట్, వ్యవసాయం చేసుకోవడానికి మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు భూమి ఇవ్వలేదు. జాగ ఇవ్వలేదు. ప్లాట్ ఇవ్వలేదు. ఇల్లు కట్టివ్వలేదు అని రాజు తల్లితండ్రులు బత్తుల నర్సవ్వ, రాఘవులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఉద్యమంలో కుమారుడిని పొగొట్టుకున్నాం.ఎన్ని డబ్బులు ఇచ్చిన చచ్చిన కొడుకు తిరిగి రాడు అని కన్నీటి పర్యంతం అయ్యారు.