calender_icon.png 28 September, 2024 | 4:50 AM

టూరిస్ట్‌గా వచ్చి.. బిలీయనీర్‌గా!

28-09-2024 12:00:00 AM

రతన్ టాటా.. దేశంలోనే ప్రజాదరణ పొందిన బిలియనీర్లలో ఒకరు. ఆయన మేదస్సు, దాతృత్వం, బిజినెస్ స్కిల్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నేటి యువతకు ఆయనో రోల్‌మోడల్. రోజురోజుకు కొత్త శిఖరాలను అధిరోహిస్తున్న టాటా గ్రూప్ వెనుక రతన్ టాటా కుటుంబ సభ్యుల పాత్ర కచ్చితంగా ఉంటుంది. ఇటీవలనే ట్రెంట్ అనే కంపెనీ రూ. 130000 కోట్ల మార్కెట్ క్లబ్‌లో చేరింది.

టాటా గ్రూపులోని అత్యంత విలువైన బ్రాండ్లలో ఇది ఒకటి. ప్రస్తుతం రతన్ టాటా సోదరుడు నోయెల్ టాటా నాయకత్వం వహిస్తున్నారు. అయితే అంతపెద్ద ట్రెంట్ కంపెనీని ముందుండి నడిపించింది సిమోన్ టాటా. ఈమె ఎవరో కాదు.. రతన్ టాటాకు సవతి తల్లి.

సిమోన్ టాటా జెనీవాలో పుట్టి పెరిగారు. ఆమెకు 23 ఏళ్లు నిండిన తర్వాత పర్యాటకురాలిగా భారతదేశానికి వచ్చినప్పుడు రతన్ టాటా తండ్రి నవన్ హోర్ముస్జి టాటాను ఆమె కలిశారు. కొన్ని సంవత్సరాలు రిలేషన్‌లో ఉన్న తర్వాత ఇద్దరూ 1955లో పెళ్లి చేసుకున్నారు. ఆతర్వాత భారతదేశ ఆర్థిక రాజధాని ముంబైలో స్థిరపడ్డారు.

ఈ జంట 1957లో రతన్ టాటా సవతి సోదరుడు నోయెల్ టాటాకు జన్మనిచ్చింది. అయితే నోయెల్‌కు జన్మనిచ్చిన కొన్ని సంవత్సరాల తర్వాత.. సిమోన్ టాటా 1962లో లాక్మేలోని టాటా ఆయిల్ మిల్క్స్‌కు  అనుబంధ సంస్థలో చేరారు. 20 సంవత్సరాల పాటు కంపెనీకి సేవలందించిన తర్వాత ఆమె చైర్‌పర్సన్ స్థాయికి ఎదిగారు.

లాక్మే విజయం తర్వాత సిమోన్ 1989లో టాటా ఇండస్ట్రీస్ బోర్డుకు నియమితులయ్యారు. ట్రెంట్ కంపెనీతో పాటు జూడియో, ఉత్సా, స్టార్ బజార్ వంటి ప్రముఖ బ్రాండ్లకు తిరుగులేని గుర్తింపు తీసుకొచ్చింది. డిసెంబర్ 2023 నాటికి ‘ఎకనామిక్ టైమ్స్’ నివేదించిన ప్రకారం ట్రెంట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 1 లక్ష కోట్లకు పెరిగింది. ఈ ఘనత వెనుక ఉన్నది సినోమ్ టాటానే.