- హెలీకాప్టర్ సాయంతో రక్షించిన రెస్క్యూ టీం
ములుగు (జయశంకర్ భూపాలపల్లి), జూలై 22 (విజయక్రాంతి): భారీ వర్షాలతో వాగులు ఉప్పొంగడంతో రాష్ట్ర సరిహద్దుల్లోని అడవుల్లో చిక్కుకున్న కూబింగ్ పోలీస్ బలగాలను సోమవారం హెలికాప్టర్ సహాయంతో రెస్క్యూ టీం సురక్షితంగా తరలించింది. వారం రోజుల క్రితం ములుగు జిల్లా వాజేడు సరిహద్దు ప్రాంతమైన ఛత్తీస్‌గఢ్ అడవుల్లోకి కూబింగ్ నిమిత్తం వెళ్లిన పోలీసు బలగాలు తిరుగు ప్రయాణంలో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో అక్క డే చిక్కుకుపోయాయి. ఎలిమిడి ఎన్‌కౌంటర్‌లో పాల్గొని వస్తున్న క్రమంలో భారీ వర్షాలు కురిసి వాగులు ఉద్ధృతంగా ప్రవహించాయి.
దీంతో వాజేడు మండల పరిధిలోని పెనుగోలు గుట్టల్లో పోలీస్ బలగాలు చిక్కుకుపోగా సమాచారం అందుకున్న పోలీస్ యంత్రాంగం హెలీకాప్టర్‌ను పంపి రెస్క్యూ టీం సహాయంతో బలగాలను సురక్షితంగా ఆస్పత్రికి తరలించింది. నాలుగైదు రోజులపాటు అడవిలోనే ఇబ్బందులు పడ్డ పోలీసులు నడవలేని స్థితిలో ఉన్నారు. ఉన్నతాధికారులు అప్రమత్తమై వారిని రెస్క్యూ టీం ద్వారా హెలీకాప్టర్‌లో వాజేడు ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు పోలీస్ వర్గాల ద్వారా తెలిసింది.