calender_icon.png 21 January, 2025 | 4:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

2025 కలర్ ఆఫ్ ది ఇయర్

17-01-2025 12:00:00 AM

ఫ్యాషన్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టించింది కాఫీ కలర్. సహజంగా కాఫీ కలర్ ఒక ప్రత్యేకమైన శోభను, హుందాతనాన్ని కలిగి ఉంటుంది. కాఫీ పేరు వినగానే దాని పరిమళం గుర్తొస్తుంది. మరీ ముఖ్యంగా కాఫీ, చాక్లెట్‌కు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చింది మాత్రం కచ్చితంగా వాటి రంగే. అందుకేనేమో ఆ కమ్మని రంగునే ఈ ఏడాది ఫ్యాషన్ కలర్‌గా ఎంపిక చేసింది అంతర్జాతీయ పాంటోస్ సంస్థ. అదే ‘మోకా మూస్’. చాక్లెట్ కాఫీ రంగులతో మేళవించిన ఈ సరికొత్త రంగే 2025 ఫ్యాషన్ కలర్. మగువల దుస్తులకు, హుందాతనాన్నీ ఇచ్చే మోకా మూస్‌దే ఈ సంవత్సరం సందడి.. 

రుతువుల రంగుల్లానే కాలానుగుణంగా మారే మనిషి జీవితంలోని మార్పులకు తగ్గ సరికొత్త రంగులు కావాల్సిందే అంటున్నారు నిపుణులు. సృష్టిలో వేల వర్ణాలున్నా ఎప్పటికప్పుడు కొత్త రంగు కనువిందు చేయాల్సిందే. అది దృష్టిలో పెట్టుకునే అంతర్జాతీయ పాంటోన్ కలర్ ఇన్‌స్టిట్యూట్ ఏటా ఒక ఫ్యాషన్ రంగును ఎంపిక చేస్తుంది.

చూడగానే కనిపించే రంగుకి మనసుల్ని ప్రభావితం చేయగల శక్తి ఉందనే ఉద్దేశంతో గత ఏడాది జరిగిన పరిణామాల్నీ, మనుషుల మానసిక స్థితిగతుల్నీ, ప్రస్తుత ప్రపంచ సంఘటనల్నీ పరిగణనలోకి తీసుకుంటూ ఫ్యాషన్ కలర్‌ను ఎంపిక చేస్తుంది. అలా ఎంచిన రంగు ఆ ఏడాది మార్కెట్లోకి రాబోయే ఉత్పత్తుల కోసం డిజైనర్లూ, ఆర్టిస్టులూ, కార్పొరేట్ కంపెనీలూ అన్నీ కలిసి సమన్వయంతో పనిచేయడానికి ఎంతో దోహదపడుతుంది.

1999 నుంచి మొదలైన ఈ సంప్రదాయం ప్రపంచంలోని ఫ్యాషన్ రంగాన్ని ఏకం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అలా ఏటా ఒక్కో సూపర్ కలర్‌ని ఎంపిక చేస్తూ అన్ని రంగాల్లో తన ముద్ర చూపిస్తున్న పాంటోస్ సంస్థ ‘మోకా మూస్’ ని కలర్ ఆఫ్ ది ఇయర్ అంటున్నది. 

పాంటోన్ సంస్థ ఈ కొత్త రంగును ప్రకటించడం ఆలస్యం.. సెలబ్రిటీల దగ్గర్నుంచీ ఫ్యాషన్ ప్రేమికుల వరకూ ప్రతి ఒక్కరూ ఆ రంగును చూసి ఫిదా అయిపోతున్నారు. ఇంట్లో ఆ రంగు వస్తువులు ఏమున్నాయో, దాన్ని చూడగానే అనుభూతి ఏంటో చెబుతూ సోషల్‌మీడియాలో వీడియోలు చేయడం మొదలుపెట్టారు. ఇక ఫ్యాషన్ డిజైనర్లు ఆ రంగుతో తీసుకొచ్చే అవుట్‌ఫిట్స్ తయారీ కోసం సిద్ధమైపోతున్నారు. 

బట్టల్లోనే కాదు, ముఖ్యంగా జ్యువెలరీలోనూ ఈరంగు హల్‌చల్ చేస్తుంది. మ్యాచింగ్ మానియాతో వేసుకున్న డ్రెస్సుకు తగ్గట్టు మోకా మూస్ రంగున్న నగల్నీ ఎంచుకోవాలనుకునేవాళ్లు, వాటికోసం మార్కెట్లో తెగ వెతికేస్తున్నారు. వాటిల్లో ఆ రంగు బీడ్స్, ఫంకీ జ్యువెలరీతో పాటు బ్రౌన్ డైమండ్స్ కూడా కనిపిస్తున్నాయి. సహజంగానే దొరికే ఈ చాక్లెట్ వజ్రాలతో చెవి కమ్మలూ, ఉంగరాల్లాంటి రకరకాల జ్యువెలరీని లెవియాన్ కంపెనీ తయారు చేస్తుంటుంది. 

కాస్మొటిక్స్‌లోనూ ఈ ఏడాది ఇదే సందండి చేస్తుంది. ఫౌండేషన్లూ, లిప్‌స్టిక్‌లూ, ఐలాష్‌లూ, నెయిల్ పాలిష్‌లూ.. ఇలా ప్రతిదీ సహజమైన ఛాయతో కనిపిస్తూ మేకప్‌లో నేచురల్ బ్యూటీని తీసుకొస్తాయి. హ్యాండ్‌బ్యాగులూ, చెప్పులూ ఇతర యాక్సెసరీలన్నీ కూడా ఈ రంగులతో మెరిసిపోతాయి. ఈతరం కోసం వాహనాలూ, ఫోన్లూ, గ్యాడ్జెట్లపైనా ఇది చేరింది.